పెద్దల సభకు డీఎస్, కెప్టెన్
– ఎమ్మెల్సీ సీటు ఫరీదుద్దీన్‌కు
– టీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ నిర్ణయం
హైదరాబాద్,మే26(జనంసాక్షి):ఎలాంటి ఊహాగానాలకు, ఉత్కంఠకు తావు లేకుండా టీఆర్‌ఎస్ రాజ్యసభ అభ్యర్థులను పార్టీ ప్రకటించింది. తెలంగాణ నుంచి ఇద్దరు అభ్యర్థులను ఎన్నుకునే అవకాశం ఉంది. ఈ రెండు స్థానాలు ఆధిక్యత రీత్యా టిఆర్‌ఎస్‌కు దక్కనున్నాయి. అయితే ఇవి ఎవరికి ఇస్తారా అన్న అనుమానాలతకు తావు లేకుండా డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు పేర్లును పార్టీ ఖరారు చేసింది. తుమ్మల రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా మాజీ మంత్రి ఎండీ ఫరీదుద్దీన్‌ను పార్టీ ప్రకటించింది. ఎన్నికల పర్యవేక్షకులుగా ఈటెల రాజేందర్, నాయిని నరసింహారెడ్డిని పార్టీ నిర్ణయించింది. పిసిసి చీఫ్‌గా తెలంగాణ ఏర్పాటులో కీలక భూమిక పోషించిని డి.శ్రీనివాస్ ఇటీవలే టిఆర్‌ఎస్‌లో చేరి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. టిఆర్‌ఎస్‌లో పెద్దన్న పాత్ర పోషిస్తున్న ఆయన ఢిల్లీ స్థాయిలో, సోనియా వద్ద ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా మద్దతు కూడగట్టారు. కెసిఆర్ తెలంగాణ పోరాటాన్ని సానుకూలంగా మలచడంలో కీలక భూమిక పోషించారని చెబుతారు. ఇక కెప్టెన్ లక్ష్మీకాంతరావు తెలంగాణ ఉద్యమంలో సిఎం కెసిఆర్ వెన్నంటి ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. బ్రాహ్మణులకు ఒక సీటు ఇస్తామన్న హావిూ మేరకు ఇలా కెప్టెన్‌కు అవకాశం దక్కిందని భావించాలి. రాజ్యసభకు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపిక చేసి అభ్యర్థుల్లో కరీంనగర్ జిల్లా నుంచి ఒకరికి అవకాశం ఉంటుందని ఆ పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ముందునుంచి చర్చ సాగింది. తెరాస ఆవిర్భావం నుంచి జిల్లా ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తోంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటిసారి ఎంపీగా 2004లో కరీంనగర్ నుంచే ఎన్నికయ్యారు. ఆ తర్వాత కీలకమైన రెండు ఉప ఎన్నికల్లోనూ తిరుగులేని విజయాలు అందుకున్నారు. నాటి నుంచి నేటి వరకు పార్టీకి, అధినేతకు వెన్నంటి నిలుస్తున్న మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు, దీవకొండ దామోదర్‌రావుల్లో ఒకరికి రాజ్యసభ అవకాశం దక్కుతుందని ముందునుంచి ప్రాచరం జరిగింది. అయితే కెప్టెన్ టిఆర్‌ఎస్ తెరాస వ్యవస్థాపక సభ్యులుగా ఉండడంతో పాటు పార్టీకి మొదటి నుంచి అండగా కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఉంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కెప్టెన్‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తుంటారు. 2004లో హుజూరాబాద్ నుంచి శాసనసభ్యునిగా ఎన్నికైన ఆయన ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. నాడు వైఎస్ క్యాబినెట్‌లో తెరాస తరపున ఆరుగురిని మంత్రులుగా ఎంపిక చేయగా అందులో జిల్లా నుంచి కెప్టెన్‌కు అవకాశం దక్కింది. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో కమలాపూర్ నియోజకవర్గం రద్దవడంతో అక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈటల రాజేందర్ హుజూరాబాద్‌కు మారడంతో ఆ ఎన్నికల్లో కెప్టెన్ హుస్నాబాద్ నుంచి బరిలోకి దిగారు. 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి తనయుడు సతీశ్‌బాబును రంగంలోకి దింపి గెలిపించుకున్నారు…ప్రత్యేక రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే ఆయనకు ఏదో ఓ క్యాబినెట్ ¬దా ఉన్న పదవి కేటాయిస్తారనే ప్రచారం సాగింది. అయితే కెసిఆర్ మాత్రం ఇప్పుడు రాజ్యసభ స్థానం ఖాయం చేశారు. ఛార్టెడ్ అకౌంటెంట్ అయిన దామోదర్‌రావు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బంధువు, సన్నిహితుడు. పార్టీ ఆవిర్భావం నుంచి అధినేతకు సన్నిహితునిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం నమస్తే తెలంగాణ పత్రికకు ఎండీగా ఉన్నారు. ఆయనకు కూడా అవకాశం ఉంటుందని భావించారు. రాష్ట్రం నుంచి ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న రెండు స్థానాలను అధికార పార్టీకే దక్కే అవకాశం ఉండడంతో జి/-లా నుంచి ఒకరికి అవకాశం దక్కినట్లయ్యింది. మొత్తంగా ఊహాగానాలకు అవకాశం లేకుండా సిఎం కెసిఆర్ సూటిగా నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో అధికార టిఆర్‌ఎస్‌లో అభ్యర్థులు ఎవరన్న చర్చ తొలుత మొదలయ్యింది. అయితే టిఆర్‌ఎస్‌కు రెండు సీట్లు ఏకగ్రీవంగా గెల్చుకునే మెజార్టీ ఉండడంతో అధినేత కెసిఆర్ ఎవరిని ఎంపిక చేస్తారన్న చర్చ సాఇంది. దీనికితోడు తుమ్మల ఎమ్మెల్సీ రాజీనామాతో ఒక మండలి సీటు ఖాళీ అయ్యింది. కాబట్టి ఈ మూడు సీట్లను సర్దే అవకాశం వచ్చింది. తెలంగాణ నేపథ్యం, పార్టీలో సీనియార్టీ, తదితర అంశాలను పరిగణించి ఆ ఇద్దరిని ఎంపిక చేసినట్లు భావిస్తున్నారు. అందుకే ఆశావహులంతా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం కోసం ఎదురుచూసారు. ఒక్కో అభ్యర్థి గెలవడానికి 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. ప్రస్తుత శాసనసభలో 40 మంది సభ్యుల బలం ఉన్న పార్టీలు లేవు. మొత్తం ప్రతిపక్షాల బలం కలిపినా 40 మందికి చేరేలా లేదు. దీనికితోడు మొన్నటి రెండు ఉప ఎన్నికల విజయాలు, పార్దటీలో చేరిన వారితో టిఆర్‌ఎస్ బలం 83కు చేరింది. దీంతో రెండు స్థానాలూ తెరాస ఖాతాలోకి వెళ్లడం ఖాయం అయ్యింది. అంతేగాకుండా ఏకగ్రీవం కూడా కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ తరఫున ఈసారి పోటీచేసే అభ్యర్థులు సునాయాసంగా రాజ్యసభ స్థానం సంపాదించేందుకు అవకాశం ఉంది. దీంతో తెరాసలో రాజ్యసభ స్థానం ఆశించేవారి సంఖ్య పెరిగింది. పార్టీ పరంగా రాజ్యసభ ఎన్నికలపై ఇప్పటి వరకు ఎలాంటి చర్చా జరగలేదు. నామినేషన్ల స్వీకరణ మొదలవుతున్న నేపథ్యంలోనూ పార్టీ కీలక నేతలు చర్చలు ప్రారంభించకపోవడంతో అందరిలో కుతూహలం మొదలైంది. గతంలో కెసిఆర్ అన్యాపదేశంగా కొందరికి ఆశ పెట్టినా ఇప్పుడా పరిస్థితి లేదు. ఇచ్చిన హావిూ మేరకు వారికి రాజ్యసభ ఇవ్వాలన్న రూలు లేదు. బ్రహ్మణ కోటాలో పారిశ్రామకవేత్త సి.రాజంకు రాజ్యసభ ప్రామిస్ చేశారు. అయితే ఆయన అనుకోకుండా బిజెపిలో చేరారు కనుక ఆయనకు అవకాశం లేదు. పార్టీ కోసం ఉద్యమకాలం నుంచి పనిచేస్తున్న నాయకులతోపాటు ఇటీవల కాలంలో పార్టీలో చేరినవారి వరకు అనేక మంది రాజ్యసభ సీట్లను ఆశిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా ఉన్న డి.శ్రీనివాస్, పార్టీ కోశాధికారిగా సుధీర్ఘకాలంగా పనిచేస్తున్న డి.దామోదర్‌రావు, దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్న వేణుగోపాలాచారి, మాజీ మంత్రి
ఫరీదుద్దీన్, మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు తదితరులు రాజ్యసభ స్థానం ఆశిస్తున్నవారిలో ఉన్నారు. అందులో నుంచే ఇద్దరిని ఎంపిక చేసిన సిఎం కెసిఆర్ విమర్శకులకు తావివ్వకుండా నిర్ణయం ప్రకటించారు. ఉన్న రెండు సీట్లను పంచడం కత్తివిూద సామే అయినా కెసిఆర్‌కు ఎలాంటి శ్రమ లేకుండా చేసుకున్నారు. ఇక ఉన్న ఒక్క ఎమ్మెల్సీని మాజీమంత్రి ఫరీదుద్దీన్‌కు ఇచ్చి మైనార్టీలకు కూడా న్యాయం చేశారు. కఎసిఆర్ నిర్ణయం శిలాశాసనం కావడంతో దానిని ప్రశ్నించే అవకాశం రాదు. ఒక బ్రాహ్మణ వర్గానికి, ఒకటి బిసిలకు, మరోటి మైనార్టీలకు కూడా ఇచ్చి సామాజిక న్యాయాన్ని కూడా పాటించారు.
కెసిఆర్ బాటలో బంగారు తెలంగాణ కోసం పనిచేస్తా: డిఎస్
టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. తనకు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తానని టీఆర్‌ఎస్ ప్రభుత్వ సలహాదారుడు సీనియర్ నేత డి. శ్రీనివాస్ చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణంలో తనవంతుగా పాటు పడతానని అన్నారు. ఢిల్లీకి వెళ్లి సేవచేసే భాగ్యం తనకు కల్పించినందుకు కేసీఆర్‌కు డిఎస్ ధన్యవాదాలు తెలిపారు. టీఆర్‌ఎస్ తరపున రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను కేసీఆర్ గురువారం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. వారిలో డి.శ్రీనివాస్‌ను రాజ్యసభ అవకాశం ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తన గురించి అనేకమంది అనేక విధాలుగా మాట్లాడారంటూ డీఎస్ వాపోయారు. పనిచేసే నేతలకు పదవులు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో తనకు ఉన్న పరిచయాలతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి సీఎం కేసీఆర్ తోడుగా ఉంటానని చెప్పారు. బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తానని అన్నారు. ఎన్నికల్లో ఎవరూ అయిన పోటీ చేయొచ్చునని డి. శ్రీనివాస్ విమర్శించారు. బంగారు తెలంగాణ కోసమే కేసీఆర్ తనను టీఆర్‌ఎస్ పార్టీలో చేర్చుకున్నట్టు తెలిపారు. అందుకే తనకు ఈ అవకాశమిచ్చినట్టు చెప్పారు. టీఆర్‌ఎస్‌లో చేరితే తన భవిష్యత్తు బాగుండదని చాలామంది అనుకున్నారని అన్నారు. కేసీఆర్ అడుగుజాడల్లో తామంతా నడుస్తామని డీఎస్ చెప్పారు. రాజ్యసభకు టీఆర్‌ఎస్ అభ్యర్థిగా అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు డీ శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ అడుగుజాడల్లోనే నడుస్తానని ఆయన అన్నారు. ఢిల్లీలో నాకున్న పరిచయాలతో తెలంగాణ రాష్టాభ్రివృద్ధికి కృషిచేస్తానని డీఎస్ తెలిపారు.