పెళ్లికి ముందే పేదలకు డబ్బులు

C

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ లబ్దిదారులకు తక్షణ సాయం అందించండి

ఆదివాసీ, దళిత, బడుగు, మైనారిటీల అభివృద్ధికి కట్టుబడ్డాం

రెండో రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌18(జనంసాక్షి): కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ లబ్దిదారులకు పెళ్లికిముందే డబ్బు అందజేయాలని కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఈ పథకాల లబ్దిదారులు తహసీల్దార్లకే నేరుగా దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సూచించారు. రెండు రోజుల్లో తహసీల్దార్లు దరఖాస్తులను పరిశీలించి పెళ్లికి ముందే డబ్బు అందజేయాలన్నారు. లబ్దిదారులకు ఇబ్బంది కలిగించవద్దని, సరళమైన విధానాలతో పేదలకు సాయం చేయాలన్నారు. దళితుల అభివృద్ధి విషయంలో ప్రచారం తప్ప గుణాత్మక మార్పులు జరగలేదన్నారు. దళితుల కుటుంబాల నుంచి దారిద్యాన్న్రి తొలగించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాలలో దళితులకు ఇంకా ఏమి చేయవచ్చో అధికారులు సూచించాలన్నారు. కలెక్టర్ల సద్సులో రెండో రోజు వివిధ అంశాలపై సిఎం చర్చించారు. గతంలో దళితుల అభివృద్ధి విషయంలో ప్రచారం జరిగిందే తప్ప గుణాత్మక మార్పులేవిూ లేవని సీఎం  అన్నారు.  దళితుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. దళితుల కుటుంబాల నుంచి దారిద్యాన్ని పారదోలడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. వాళ్లు మళ్లీ దరిద్రులుగా మారకుండా పలు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. దళితులకు ఉచితంగా భూమి ఇవ్వడమే కాకుండా వ్యవసాయం చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. రూరల్‌, అర్బన్‌, అర్బన్‌ దళితులు, ఎస్టీలకు ఇంకా ఏం చేయవచ్చో అధ్యయనం చేసి ప్రభుత్వానికి అధికారులు పలు సూచనలు చేయాలని ఆదేశించారు. బంగ్లాదేశ్‌లో యావస్‌ అనే ప్రొఫెసర్‌ చిన్న వర్తకుల జీవన ప్రగతికి చేసిన ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా స్వయం సహాయక బృందాల విప్లవానికి దారి తీసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. అదే విధంగా కొత్త ఆలోచనలతో ముందుకు పోదామని పిలుపునిచ్చారు. కలెక్టర్లు ఇతర ప్రభుత్వాధికారులు దళిత బస్తీలు, గిరిజన తండాల్లో కొంత సమయం గడిపితే వాళ్ల వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని పేర్కొన్నారు.  దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సీఎం  స్పష్టం చేశారు.  దళిత పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం టీ-ప్రైడ్‌ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని వివరించారు. ఇంజినీరింగ్‌ చేసిన ఎస్సీ, ఎస్టీ యువతకు శిక్షణనిచ్చి పెట్టుబడి సమకూర్చి ప్రోత్సహించాలని సూచించారు. కాంట్రాక్టర్ల దగ్గర పనిచేసే ఎస్సీ, ఎస్టీలకు ఇప్పటికే అనుభవం ఉందని వారిని గుర్తించి కాంట్రాక్టర్లుగా అభివృద్ధి చేయాలని, కాంట్రాక్టర్లుగా ఎదిగేందుకు ప్రోత్సహించాలని ఆదేశించారు. ఇండస్టియ్రల్‌ ఎస్టేట్‌లో ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం ప్లాట్లు రిజర్వ్‌ చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని సీఎం అన్నారు.  వివిధ పోటీ పరీక్షల కోసం విద్యార్థులను సిద్ధం చేయాలని ఆదేశించారు. కేవలం రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఉన్నాయి, అవి దక్కాలంటే ఏలా ప్రిపేర్‌ కావాలి అనే అంశాలను విద్యార్థులకు చెప్పాలని విద్యపై సవిూక్షలో సూచించారు. కలెక్టర్లు, ఎస్పీలు కూడా విద్యార్థులకు నేరుగా బోధన చేస్తే మరికొంత స్ఫూర్తిదాయకంగా ఉంటుందని అన్నారు. అమ్మాయిలు కూడా చదువుకునేందుకు అవసరమయ్యే విధంగా బోధనా, వసతి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. విద్యార్థులు హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో కూడా ప్రావీణ్యం సంపాదించేలా విద్యాశాఖ ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. నిర్బంధ ఉచిత విద్య అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని  ముఖ్యమంత్రి  అన్నారు. ప్రతి జిల్లాలో మైనార్టీల కోసం 2 రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు విద్యా విధానం రూపకల్పన జరుగుతోందన్నారు. కులాల అంతరాలు లేకుండా ఒకే చోట ఒకే విద్య అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ప్రయోగాత్మకంగా వచ్చే ఏడాది నుంచి రెసిడెన్షియల్‌ పాఠశాలలను ప్రారంభిస్తామన్నారు.  కేజీ టు పీజీ అమలులో భాగంగా నియోజకవర్గానికి ఓ రెసిడెన్షియల్‌ పాఠశాలను ఏర్పాటు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు.అయితే  కేజీ టు పీజీపై శాస్త్రీయంగా అధ్యయనం జరగాల్సి ఉందన్నారు. గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలను కొనసాగించనున్నట్లు స్పష్టం చేశారు. మూడో తరగతి వరకు స్థానిక పాఠశాలల్లోనే విద్యాబోధన ఉంటుందని తెలిపారు. కొందరు టీచర్లు స్కూల్‌కు రాకుండా తమ వంతుగా ఇతరులను పంపుతున్నారని, అలాంటివారిపై చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.