పేదపిల్లలు, వృద్ధులు, వికలాంగులకు మధ్యాహ్నభోజనం పెట్టండి

3

– కోదండరాం

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 21(జనంసాక్షి): కరువు పరిస్థితుల దృష్ట్యా సెలవుల్లోనూ విద్యార్థులకు మధ్యాహ్నభోజన సౌకర్యాన్ని అమలు చేయడాన్ని తెలంగాణ జేఏసీ స్వాగతిస్తోందని జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌  తెలిపారు. చదువులతో నిమిత్తం లేకుండా గ్రామంలోని నిరుపేద పిల్లలందరికీ అలాగే గ్రామంలోని వికలాంగులకు, వృద్ధులకు కూడా మధ్యాహ్న భోజన సదుపాయాన్ని వర్తింపజేయాలని జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. యుద్ధ ప్రాతిపదికన కరువు సహాయ చర్యలు చేపట్టి..ఉపాధి హావిూ బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోదండరామ్‌ కోరారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొనిఉన్న నేపథ్యంలో యుద్దప్రాతిపదికన ముమ్మరంగా కరువు సహాయక చర్యలను అమలు చేయాలని కోరుతున్నామని అన్నారు.  పనికి ఆహార పథకానికి సంబంధించిన బకాయలన్నింటినీ వెంటనే పూర్తిగా చెల్లించి, పనులను నిలిపివేసినచోట వెంటనే పనికి ఆహార పథకం పనులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని కోదండరామ్‌ విూడియాతో వివరించారు. తెలంగాణలో కరవు పరిస్థితుల దృష్ట్యా వేసవి సెలవుల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలుచేయడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.  గ్రామాల్లో నివసిస్తున్న నిరుపేద పిల్లలకు, వికలాంగులు, వృద్ధులకు కూడా మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.