పోరాటాలతో ప్రజలకు దగ్గరవుతం: వీరభద్రం

5

సీపీఎం నూతన కార్యదర్శిగా తమ్మినేని

నగరంలో భారీ ర్యాలీ

హైదరాబాద్‌,మార్చి4(జనంసాక్షి): నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో నాలుగు రోజులుగా జరుగుతున్న సీపీఎం రాష్ట్ర మహాసభలు ముగిసాయి. మహాసభల్లో 60 మందితో నూతన రాష్ట్ర కమిటీని మహాసభ ఎన్నుకుంది. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా కార్యదర్శిగా నియమితులైన తమ్మినేని ఇప్పుడు అధికారికంగా ఎన్నికయ్యారు. 13 మందితో నూతన కార్యదర్శి వర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ తెలంగాణలో వామపక్షాలే నిజమైన ప్రత్యామ్నాయమని అన్నారు. కాంగ్రెస్‌, బిజెపి, టిడిపిలు ప్రజలను సవిూకరించి.. ఉద్యమాలు చేసే స్థితిలో లేవని… వారు ప్రజల తరపును పోరాడే వారు కాదన్నారు. సామాజిక పోరాటాలను నిర్వహస్తామని చెప్పారు. సాంస్కృతిక రంగంలో కూడా ఉద్యమించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రజల మనసులను విషతుల్యం చేస్తున్న భూస్వామ్య భావజాలంపై చర్చించామని చెప్పారు. రాబోయే కాలంలో సాంస్కృతికరంగంలో కూడా కృషి చేయాల్సిన అవసరముందని గుర్తించామని… ఆ మేరకు ఉద్యమాలకు ప్రణాళికలు రచించామని వివరించారు. ఇదే అంశాన్ని మహాసభ తీర్మానించినట్లు ఆయన తెలిపారు. ప్రయివేట్‌ రంగంలో రిజర్వేషన్ల కల్పనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని చెప్పారు. విద్యా, వైద్యం ప్రయివేటీకరణ, దోపిడీకి వక్యతిరేకంగా పోరాడుతామని చెప్పారు. విద్య, వైద్య రంగాలను ప్రభుత్వరంగంలోనే ఉంచాలన్నారు. ప్రభుత్వ సంస్థలను పరిరక్షించాలని కోరారు. టీఆర్‌ ఎస్‌.. ఎన్నికలో చేసిన వాగ్ధానాలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఏడాదిలోపలే భాజపా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ప్రధాని మోదీ పాలన ప్రజలపై భారం మోపుతోందని అన్నారు. రానున్న రోజుల్లో పార్లమెంటు లోపల, బయట మోదీకి ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ప్రతిపక్షాలతో కలిసి ప్రజాఉద్యమాన్ని నిర్మిస్తామని  తెలిపారు. ఇదిలావుంటే సీపీఎం తెలంగాణ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఎర్రకవాతు నిర్వహించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి ఈ కవాతు ప్రారంభమైంది. అగ్రభాగాన సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు రాఘవులు, సెంట్రల్‌ కమిటీ సభ్యుడు వి.శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. మహాసభలో తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేగాకుండా వామపక్షాలు, ప్రజాతంత్ర శక్తులు బలపడాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలపై మహాసభలో చర్చించడం జరిగిందని, రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమాలు ఉవ్వెతున ఎగిసిపడుతాయని తమ్మినేని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సీపీఎం పార్టీ పాగా వేస్తుందని సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. సీపీఎం పార్టీ మహాసభ సందర్భంగా కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా జూలకంటి  మాట్లాడారు. కవాతులో వేలాది మంది యువకులు తరలివచ్చారని, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోయిందన్నారు. సమస్యలు పరిష్కారం కావాలంటే కమ్యూనిస్టులు కలిసి పోరాటం చేయాలన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగిందని గుర్తు చేశారు. నవ తెలంగాణ రావాలంటే కమ్యూనిస్టుల వల్లే సాధ్యమని, ఇది కేవలం కమ్యూనిస్టులు, వామపక్షాల వల్లే సాధ్యమని వొక్కాణించారు.