ప్యాకేజి పొట్లాలు జాంతానై హైదరాబాద్‌తో కూడిన తెలంగాణే కావాలి
.హైదరాబాద్, జనవరి 4 (జనంసాక్షి) :
ప్యాకేజీలు, పొట్లాలు గిట్లాలు జాన్తా నై తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే కావాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు ఏకగ్రీవంగా తీర్మానించారు. హైదరాబాద్ రాజధానిగా ప్రత్యేక రాష్ట్రమే ఇవ్వాలని సమావేశం నిర్ణయించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక రాష్ట్రం మినహా మరే ప్రత్యామ్నయానికి అంగీకరించేది లేదని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సానుకూల వాతావరణంలో రాష్ట్ర విభజన జరిగేలా చూడాలని కోరారు. తెలంగాణ అంశంపై హైకమాండ్ నేతలతో చర్చించేందుకు ఈనెల 10న ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు. తెలంగాణ అంశంపై చర్చించేందుకు, భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించేందుకు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు శుక్రవారం సమావేశమయ్యారు. మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని క్లబ్ హౌస్‌లో జరిగిన
ఈ సమావేశానికి డెప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సహా 11 మంది మంత్రులు, ఎంపీలు, 12 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు డీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు. సీనియర్ నేతలు కె.కేశవరావు, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి కూడా పాల్గొన్న ఈ సమావేశంలో.. అఖిలపక్ష సమావేశం, తర్వాతి పరిణామాలపై చర్చించారు. నెల రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో హైకమాండ్‌పై ఒత్తిడి పెంచే వ్యూహాలపై సమావేశంలో తీవ్రంగా చర్చ జరిగింది. సమావేశం ప్రారంభం కాగానే, గత నెల 28న జరిగిన అఖిలపక్ష సమావేశం వివరాలను మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి ఈ సమావేశంలో వివరించారు. ఎవరెవరు ఎలా వ్యవహరించారు, షిండే ఏమన్నారు తదితర విషయాలను ఆయన నేతలకు వెల్లడించారు. అఖిలపక్షంలో సమర్థంగా వాదనలు వినిపించిన ఆయనను నేతలు అభినందించారు. అనంతరం ఢిల్లీ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిగింది. కేవలం సమావేశాలే కాదని, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. సమావేశానికి హాజరు కాని వారిని కూడా సమన్వయం చేసుకోవాలని, వ్యతిరేక సంకేతాలు వస్తే అందరం కలిసికట్టుగా పోరాడదామని మాజీ మంత్రి దామోదరరెడ్డి అన్నారు. 18న జైపూర్‌లో జరిగే కాంగ్రెస్ పార్టీ మేధోమథనం సమయంలో తెలంగాణకు అనుకూల సంకేతాలు వస్తాయని ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. చివరకు, తెలంగాణ సాధించే వరకూ కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. ప్రత్యేక రాష్ట్రం మినహా వేరే ప్రత్యామ్నయానికి అంగీకరించేది లేదని, హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ కావాలని ఒత్తిడి తేవాలని తీర్మానించారు. వీలైనంత త్వరగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ అధిష్టానాన్ని కలవాలని భావించారు.
భేటీ అనంతరం కేకే తదితరులతో కలిసి మంత్రి జానారెడ్డి విూడియాతో మాట్లాడారు. తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని, హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్టాన్న్రి ఏర్పాటు చేయాలని సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశామన్నారు. తీర్మాన కాపీని కేంద్ర ప్రభుత్వానికి, సోనియాగాంధీ అందజేయనున్నట్లు చెప్పారు. సామరస్యంగా రాష్ట్ర విభజన చేయాలని, తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా సత్వరమే నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరతామన్నారు. తెలంగాణ రాష్ట్రం మినహా మరో ప్రత్యామ్నయం లేదని స్పష్టం చేశారు. త్వరలోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షల నెరవేరుతుందన్న నమ్మకం ఉందని జానారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. నెల రోజుల్లో తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామన్న కేంద్ర ¬ం మంత్రి సుశీల్‌కుమార్ షిండేకు, అఖిలపక్షంలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం చెప్పిన పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. ఆందోళనలు తీవ్రమై అభివృద్ధికి ఆటంకం కలగక ముందే తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని మంత్రి జానారెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నెల రోజుల తర్వాత తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం రాకుంటే అప్పడు నిర్ణయం తీసుకుంటామన్నారు. పనుల్లో ఉండడం వల్ల కొందరు నేతలు సమావేశానికి హాజరు కాలేదని, దాన్ని వేరే కోణంలో చూడవద్దని చెప్పారు. తెలంగాణ విషయంలో తామంతా ఐక్యంగా ఉన్నామని జానా తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు తమ కృషి కొనసాగుతుందన్నారు. మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, బస్వరాజు సారయ్య, శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య, ఎంపీలు వివేక్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పొన్నం ప్రభాకర్, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీ కే.కేశవరావు తదితరులు హాజరయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశంలో చేసిన తీర్మానాన్ని పార్టీ పెద్దలకు మంత్రి జానారెడ్డి అందించనున్నారు. ఇందుకోసం ఆయన ప్రత్యేకండా ఢిల్లీ వెళ్లనున్నారు.