ప్యాకేజీ అంటే ప్యాకైపోతారు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం సాగుతున్న ఉద్యమానికి ప్యాకేజీ ద్వారా ముగింపు పలకాలనే ఓ దుర్మార్గపు పన్నాగానికి కాంగ్రెస్ అధి ష్టానం తెరతీసింది. ఆ ఒక్కటే కాదు ఇంకో మూడు, నాలుగు ప్రత్యామ్నాయాలు ఉన్నాయంటూ మీడియాకు పదే పదే లీకులిస్తోంది. ఏఐసీసీ అధినేత్రి సోని యాగాంధీ నివాసం టెన్ జన్‌పథ్, ఏఐసీసీ కార్యాలయం నుంచే ఈ లీకులందుతున్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించే ఉద్దేశం లేదు. నాలుగు దశాబ్దాల పోరాటానికి ఫలితం ఇచ్చే ప్రయత్నమేది ఆ పార్టీ అధినాయకత్వం చేయడం లేదు. తెలంగాణ అన్నోళ్లకు కుక్కకు బొక్కేసినట్టు ఓ పదవి ఇస్తే సరిపోతుంది అనే ధోరణి కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో అవలంబిస్తోంది. ఇందిరాగాంధీ జమానాలో మొదలైన ఈ ప్రలోభాల వల సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ హయాంలోనూ కొనసా గుతోంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓ విషయాన్ని విస్మరిస్తోంది తాను బొక్కేసిన కుక్కలు ఆ పార్టీకి చెందినవే. ప్రజలు అలా కాదు. నిఖార్సైన తెలం గాణవాదులు. నాలుగు దశాబ్దాలుగా రెండు తరాల వారు ఈ ఆకాంక్షను సాకారం చేసుకునేందుకు ప్రజాస్వామిక పోరాటాలు సాగిస్తున్నారు. 1969లో యువత, విద్యార్థులు సీమాంధ్ర పాలనలో తెలంగాణకు సాగుతున్న అన్యాయాలపై గొంతెత్తి పోరాడింది. బరిగీసి ఉద్యమానికి దిగింది. వారి గుండెలపై తుపాకీ ఎక్కుపెట్టి పాశవిక హత్యాకాండను సాగించింది కాంగ్రెస్ సర్కారు. సీమాంధ్ర పెద్దల ఏలుబడిలో 369 మంది విద్యార్థులను హత్య చేశారు. ఎంతో ఉజ్వల భవిత ఉన్న యువతను కోల్పోయిన ఉద్యమ వాడి తగ్గ లేదు. ఆ ఉద్యమ కేంద్రంగా ఆవిర్భవించిన టీపీఎస్ 1971లో 10 ఎంపీ స్థానా లను గెలుచుకొని సత్తా చాటగా, ఇందిరాగాంధీ ఆ పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసి తెలంగాణవాదాన్ని తాత్కాలికంగా తొక్కిపెట్టింది. కానీ ఉద్యమం మాత్రం ఆగ లేదు. వివిధ స్వచ్ఛంద సంఘాలు ఉద్యమాన్ని భుజానికెత్తుకున్నాయి. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు చాటిచెప్పాయి. నక్సలైట్ల పేరుతో తెలంగాణవాదులను రాజ్యం పొట్టన బెట్టుకున్నా, తుపాకీ గుళ్ల వర్షం కురిపించి శరీరాలను ఛిద్రం చేసినా ఉద్యమ హోరును మాత్రం అణచలేక పోయారు. తీవ్ర నిర్బంధం మధ్య నుంచి భూమిని చీల్చుకు వచ్చే విత్తనం వలే మళ్లీ అంకురించింది తెలంగాణ ఉద్యమం. దశాబ్దానికి పైగా తెలంగాణ ఉద్యమం హోరెత్తుతోంది. తెలంగాణవాదాన్ని ఇప్పుడు రాజకీయాలతోనూ ముడిపెట్టేశారు. మంచికో చెడుకో తెలంగాణ పేరత్తకుండా ఇప్పుడు ఏ పార్టీ ఈ ప్రాంతంలో ఎన్నికల గోధాలోకి దిగని పరిస్థితి తలెత్తింది. కానీ దానినే అవకాశంగా తీసుకొని కొందరు స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఎవరు ఏం చేసినా తెలంగాణకు జై కొట్టక తప్పని పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ ప్యాకేజీల పేరుతో ఉద్యమానికి పుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందు పది జిల్లాలతో కూడిన హైదరాబాద్ స్టేట్ మాత్రమే కావాలని తెలంగాణవాదులు కోరుతుండగా, లేదు ఇంకో రెండు జిల్లాలను బోనస్‌గా ఇస్తామంటూ ఓ దిక్కుమాలిన ప్రతిపాదన ముందుకు తెచ్చింది. హైదరాబాద్ ముస్లింలకు అధికార ప్రతినిధిగా చెప్పుకునే ఎంఐఎం రాయల తెలంగాణ కోరుకుంటోంది కాబట్టి దానికే జై కొడతామం టూ కాంగ్రెస్ అధిష్టానం ఇటీవల ఓ లీక్‌ను ఇచ్చింది. మొత్తం రాయలసీమ కాకుండా మహబూబ్‌నగర్ జిల్లాకు సమీపంలోనే ఉన్న కర్నూల్, అనంత పూరం జిల్లాలను తెలంగాణతో కలపే కొత్త యత్నానికి లోపల్లోపల కసరత్తు జరుగుతున్నట్లుగా కలర్ ఇస్తోంది. తెలంగాణ ఆకాంక్షకు మొదటి ప్రత్యామ్నా యంగా భారీ ప్యాకేజీ ఇచ్చి దానికి చట్టబద్ధత కల్పించడం, తెలంగాణకు చెందిన ఓ సీనియర్ నాయకుడికి దాని పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడం తద్వారా తెలంగాణను అభివృద్ధి చేయడం తమ ముందున్న లక్ష్యంగా చెప్పు కుంటోంది. దీనిపై తెలంగాణ ప్రజల నుంచి నిరసన గళం వెల్లువెత్తడంతో మరికొన్ని ప్రతిపాదనలంటూ మీడియాకు వరుసగా లీకులిస్తోంది. వాటిలో రాయల తెలంగాణ ఒకటి. తద్వారా తెలంగాణపై బలవంతంగా రెండు జిల్లాల ఆధిపత్యాన్ని రుద్దే ప్రయత్నమూ చేస్తోంది. దీనికి ఎంఐఎం ప్రతిపాదనతో లంకె పెట్టింది. కేవలం హైదరాబాద్ ప్రజలే కాదు పది జిల్లాల ప్రజలు తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నారు. దీనిని గుర్తించిన ఎంఐఎం తెలంగాణ ప్రజల ఆకాం క్షను గౌరవిస్తామని ఆ తర్వాత ప్రకటించింది కూడా. కానీ దానిని కాంగ్రెస్ పార్టీ విస్మరించింది. రాష్ట్రంలో నాయకత్వ మార్పు ద్వారా తెలంగాణ ఉద్య మార్చి చల్లార్చే ప్రయత్నం చేయబోతున్నట్టు మరోలీకునిచ్చింది. దీనిపై తెలంగాణ ప్రజలు భగ్గుమన్నారు. ముఖ్యమంత్రినో, పీసీసీ అధ్యక్షుడినో ఎన్నికల ముందు మార్చడం ద్వారా ఓట్లు పొందాలనే కుట్రపై నిప్పులు చెరిగారు. హైదారాబాద్ ఉమ్మడి రాజధానిగా తెలంగాణ, హైదరాబాద్ లేకుండా తెలం గాణ ఇస్తామంటూ మరికొన్ని లీకులిచ్చారు. మొత్తంగా తెలంగాణ సమస్యకు పది పరిష్కారాలు చూపుతూ వాటిని మీడియా ద్వారా ప్రచారం కల్పించారు. ఒక్కో ప్రతిపాదనపై ప్రజలెలా స్పందిస్తున్నారో ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. ఒక్క తెలంగాణ సాధన మినహా ప్రజలకు ఏ ప్రతిపాదననూ అంగీకరించకపోవడంతో నాయకులను మచ్చిక చేసుకునే యత్నాలకు తెరతీశారు. పంచాయతీ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు, వాటి తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణవాదం వల్ల పార్టీ నష్టపోకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం లీకుల రాజకీయాన్ని నడుపుతోంది. కానీ తెలంగాణ ప్రజలెవరూ వీటిని ఆమోదించడం లేదు. కాంగ్రెస్ పార్టీ కనుక ప్యాకేజీనే ముందుకు తెస్తే త్వరలో జరుగబోయే ఎన్నికల్లో ఆ పార్టీని మొత్తంగా ప్యాక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్యాకేజీ ఇచ్చి ప్యాక్ అవుతుందో, ప్రజల ఆకాంక్షను నెరవేర్చి వారి మదిలో మిగులుతుందో కాంగ్రెస్ పార్టీనే తేల్చుకోవాలి.