ప్రజల ఆకాంక్షలతో పనిలేదా?

తెలంగాణ ప్రజల ఆకాంక్షలతో ప్రభుత్వానికి పనిలేదా? అనే సందేహం ఇటీవల బలపడుతోంది. పది జిల్లాల ప్రజలు ముక్తకంఠంతో ప్రత్యేక రాష్ట్రం కావాలని నినదిస్తుంటే ప్రభుత్వం ఆ డిమాండ్‌ను ఏమాత్రం లక్ష్యపెట్టడం లేదు. తెలంగాణ ప్రజలు స్వయం పాలన కోసం పోరాటం నిన్ననో మొన్ననో మొదలు పెట్టలేదు. ఆరు దశాబ్దాల క్రితం వేర్వేరు రాష్ట్రాలుగా ఉన్న హైదరాబాద్‌, ఆంధ్రను కలిపి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పాటు చేశారు. ఉమ్మడి మద్రాస్‌ నుంచి విడివడి కనీస సౌకర్యాలు లేని, ఆర్థికంగా చితికిపోయిన ఆంధ్రను, ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా పేరొంది తర్వాత స్వతంత్ర భారతంలో విలీనమైన హైదరాబాద్‌ను కలిపి రాష్ట్రం ఏర్పాటు చేసేప్పుడు పెద్ద మనుషుల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆ రోజు అత్యంత దయనీయమైన స్థితిలో హైదరాబాద్‌కు చేరుకున్నవారు కొన్నేళ్లలోనే కోట్లకు పడగలెత్తారు. తెలంగాణ ప్రాంత వనరులు, నీళ్లు, నిధులు, ఉద్యోగ ఉపాధి అవకాశాలను కొళ్లగొట్టి ఆర్థికంగా బలపడ్డారు. అక్రమ సంపాదనను చట్టబద్ధం చేసుకోవడానికి రాజకీయాల్లోకి ప్రవేశించారు. వాళ్లే ఇప్పుడు కార్పొరేట్‌ శక్తులుగా అవతరించి రాజ్య పాలనను హస్తగతం చేసుకున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీల్లో తమ వాళ్లను పెట్టుకొని అనుకున్న పనులు చేసుకుంటున్నారు. ఆయా శక్తులు తెలంగాణ ప్రాంతంలో ఉన్న సహజ వనరులపై, హైదరాబాద్‌ చుట్టు పక్కల ఉన్న విలువైన భూములపై కన్నేసి వాటిని హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. తమ దోపిడీకి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అడ్డుట్ట పడుతుందనే భయంతో ఢిల్లీలోని కాంగ్రెస్‌ పెద్దలను తమవైపునకు తిప్పుకొని తెలంగాణ ఏర్పాటుకు అడ్డుతగులుతూనే ఉన్నారు. ఇలాంటి శక్తుల చేతుల్లో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌, టీడీపీ ప్రజాప్రతినిధులు బందీలుగా మారి వారి ప్రతి చర్యకు తందానా అంటున్నారు. తెలంగాణ ఆకాంక్షపై అన్ని రాజకీయ పార్టీలు ఒకే విధానంతో ముందుకు సాగుతున్నాయి. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోతో తెలంగాణ అంశాన్ని చేర్చడం, అధికారంలోకి వస్తే తెలంగాణ ఏర్పాటు చేస్తామనో, ఏర్పాటుకు సహకరిస్తామనో చెప్పడం తర్వాత హామీని తుంగలో తొక్కడం పరిపాటిగా మారింది. 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ అంశమే ప్రధానమైంది. రేపు రాబోయే 2014 ఎన్నికల్లోనూ తెలంగాణపై స్పష్టత ఇవ్వకుండా ఎన్నికల గోధాలోకి రాజకీయ పార్టీలు దిగలేని పరిస్థితి. ఇంతటి అనివార్య పరిస్థితులు ముందున్నా అధికారపక్షం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మొండిగానే వ్యవహరిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, 2009 డిసెంబర్‌ 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంబిస్తున్నట్లు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి (టీ జేఏసీ) శుక్రవారం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం పది జిల్లాలపై అప్రకటిత ఎమర్జెన్సీ విధించింది. హైదరాబాద్‌కు వచ్చే ప్రతి రోడ్డు, రైలు మార్గంలో పోలీసు పికెట్లు ఏర్పాటు చేసి వేలాది మంది తెలంగాణవాదులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. గ్రామాల్లో, మండల కేంద్రాల్లో, పట్టణాలు, నగరాల్లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాల్లో పాల్గొంటున్న వారి ఇళ్లకు వెళ్లి అదుపులోకి తీసుకొని బైండోవర్లు చేస్తున్నారు. పది జిల్లాల్లో ఇప్పటి వరకు 12 వేల మందికి పైగా తెలంగాణవాదులను అరెస్టులు, బైండోవర్ల రూపంలో అక్రమంగా నిర్బంధించారు. చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్నారంటూ విద్యార్థులను, దినసరి కూలీలను నిర్బంధిస్తున్నారు. మొత్తం పది జిల్లాలు ఖాకీ వనాన్ని తలపిస్తున్నాయి. నిరసన తెలపడం ప్రజల రాజ్యాంగబద్ధమైన హక్కు. ఆ హక్కును కాలరాసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. చలో అసెంబ్లీ కార్యక్రమానికి అనుమతి ఇవ్వబోమని తేల్చిచెప్తోంది. ప్రభుత్వానికంటే మొండిగా హైదరాబాద్‌ నగర కమిషనర్‌ అనురాగ్‌శర్మ వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం అనుమతి ఇస్తామన్నా తాము ఇవ్వనివ్వబోమని చెప్తున్నారు. చలో అసెంబ్లీకి మావోయిస్టులు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లాంటి ఘటనలు చోటు చేసుకునే అవకాశమున్నందున తాము అనుమతి ఇవ్వకుండా అడ్డుకుంటామని చెప్తున్నారు. ప్రజల పోరాటానికి మద్దతు పలకడం మావోయిస్టులకు కొత్త కాదు. కానీ వారు పాల్గొంటారని చెప్తూ నిరసన హక్కును కాలరాయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి పోలీసులు హైదరాబాద్‌ నగర ప్రజల జీవన యానానికి అడ్డు తగులుతున్నారు. పలు ఫ్లై ఓవర్లు మూసేస్తున్నట్లు ప్రకటించారు. ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేయడమో, కుదించడమో చేశారు. పలు బస్సు సర్వీసులను రద్దు చేశారు. హైదరాబాద్‌ వ్యాప్తంగా 150కిపైగా పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశముందని నిజాం కళాశాల హాస్టల్‌నే ఖాళీ చేయించారు. ఇన్ని అప్రజాస్వామిక చర్యలకు పాలకులే ఒడిగడితే కడుపు మండిన ప్రజల పరిస్థితి ఏమిటి? చలో అసెంబ్లీ కార్యక్రమానికి పాక్షిక అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నా సర్కారు ఆ దిశగా ఆలోచించడం లేదు. అసెంబ్లీ వరకూ కాకున్నా ఇందిరాపార్క్‌ వరకైనా నిరసన ప్రదర్శనను అనుమతించవచ్చు. ఏదో ఒక రెడ్‌లైన్‌ లేదా డెడ్‌లైన్‌ పెట్టి ఆ లైన్‌దాటిన వారిని అరెస్టు చేయవచ్చు. కానీ ఆ దిశగా సర్కారు కనీస చర్యలు చేపట్టడం లేదు. చలో అసెంబ్లీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి నాయకులెలా వస్తారో చూస్తామని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ హెచ్చరించారు. ప్రజల ఆకాంక్షలతో పనిలేదన్నట్టుగా ప్రభుత్వం రెచ్చిపోతుండటంతో ఆయన రాజకీయ పక్షాలకే సవాల్‌ విసిరే పరిస్థితి ఏర్పడింది. ప్రజాప్రతినిధులు గ్రామాల్లోకి వచ్చి ప్రజలను ఓట్లు అడగక తప్పని పరిస్థితి. ఇప్పుడు చలో అసెంబ్లీని అడ్డుకునే ప్రభుత్వంలో భాగస్వాములైన వారు రేపు ఏ ముఖం పెట్టుకుని గ్రామాల్లోకి వస్తారు. మిలియన్‌ మార్చ్‌కు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో పాటు ఉద్యమ నాయకులను అరెస్టు చేయడంతో ఉద్యమకారులకు మార్గనిర్దేశనం చేసే వారు లేకుండా పోయారు. నిర్బంధాలతో సహనం కోల్పోయిన తెలంగాణవాదులు టాంక్‌బండ్‌పై ఉన్న విగ్రహాలను ధ్వంసం చేశారు. చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొంటారనే అనుమానంతో వేలాది మందిని అరెస్టు చేసి ప్రజల్లో ఆగ్రహం తెప్పించారు పోలీసులు. ఈ నేపథ్యంలో చలో అసెంబ్లీకి బయల్దేరిన వారిని నియంత్రించే నాయకులు లేకపోతే ఆందోళన పట్టుతప్పడం ఖాయం. అదే జరిగితే హైదరాబాద్‌లో తలెత్తే పరిణామాలకు ప్రభుత్వం, పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వం తెగేదాకా లాగేకంటే మధ్యేమార్గంగా పాక్షిక అనుమతులైన ఇవ్వడం సామరస్యపూర్వక పరిష్కారం దిశగా అడుగులు వేయడమే అవుతుంది.