ప్రజాప్రతినిధులే లక్ష్యంగా ఆఫ్ఘన్‌ పార్లమెంట్‌పై దాడి

C

– భద్రత దళాల కాల్పుల్లో 7 మంది మిలిటెంట్ల హతం

– 21మంది పౌరులకు గాయాలు

– ప్రజాప్రతినిధులు సురక్షితం

కాబూల్‌,జూన్‌22(జనంసాక్షి):

హైదరాబాద్‌: ఆఫ్గనిస్థాన్‌లో తాలిబాన్‌ ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. రాజధాని కాబూల్‌లోని ఆ దేశ పార్లమెంటు వద్ద తుపాకులు, రాకెట్‌లాంఛర్లతో దాడికి పాల్పడ్డారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు. పార్లమెంటు ప్రవేశద్వారం వద్ద వాహనంలో భారీ పేలుడు పదార్ధాలతో వచ్చిన ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేశాడు. దీంతో అప్రమత్తమయిన భద్రతాసిబ్బంది ఇతర ఉగ్రవాదులు లోనికి రాకుండా కాల్పులకు దిగారు. దీంతో ఏడుగురు ఉగ్రవాదులు సమీప భవనంలోకి వెళ్లి రాకెట్‌ లాంఛర్లు, గ్రనేడ్లతో దాడికి దిగారు. వీరి కాల్పులను తిప్పికొట్టిన భద్రత సిబ్బంది వారిపై దాడి చేయడంతో ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో 21 మంది పౌరులు గాయపడ్డారు. ఈ దాడిలో ఎంపీలందరూ సురక్షితంగా బయటపడ్డారు. పార్లమెంటు భవనం స్వల్పంగా ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు.పార్లమెంటు ప్రధానద్వారం వద్ద ఓ కారులో ఉగ్రవాది తనను తాను పేల్చుకొని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలోనే కొంతమంది ఉగ్రవాదులు పార్లమెంటులోకి ప్రవేశించేయత్నం చేయడంతో భద్రతాదళాలు అడ్డుకున్నాయి. దీంతో ఉగ్రవాదులు పక్క భవనంలోకి ప్రవేశించి అక్కడ నుంచి దాడికి దిగారు. పార్లమెంటులో నూతన రక్షణశాఖ మంత్రిని పరిచయం చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాంబుల శబ్దంతో ఉలిక్కిపడిన ఎంపీలు నలుదిక్కులకూ పరుగులు తీశారు. భద్రతా బలగాలు అప్రమత్తమై ఎంపీలను, విలేకరులను, సిబ్బందిని ఉగ్రవాదుల బారి నుంచి కాపాడి బయటకు తీసుకొచ్చారు. బాంబుదాడులతో పార్లమెంటు భవనం వద్ద దట్టంగా పొగ అలుముకుంది. ఈ ఘటన అంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడులకు పాల్పడింది తామేనని తాలిబన్లు ప్రకటించారు.కాబూల్‌లో ఆఫ్గనిస్తాన్‌ పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో అక్కడున్న తమవారిపై పరిస్థితిపై భారతీయుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై స్పందించిన ఆఫ్గనిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయం భారతీయులంతా సురక్షితంగానే ఉన్నారని ప్రకటించింది. ఆఫ్గనిస్థాన్‌లో భారత రాయబారి అమర్‌సిన్హా మాట్లాడుతూ… ఉగ్రవాదుల దాడిలో భారతీయులెవరూ గాయపడలేదని… అందరూ సురక్షితంగానే ఉన్నారని తెలిపారు.ఆఫ్గన్‌ పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడిని భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడిలకు స్థానం లేదన్నారు. ఈ దాడిలో మృతి చెందిన, గాయపడిన వారికి అయన తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆఫ్గన్‌కు అన్ని విధాలా సాయం అందిస్తామని అయన భరోసా ఇచ్చారు.