ప్రజాభీష్టాన్ని గౌరవించకుంటే?
తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్ష ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మాత్రమే. ఈ ఆకాంక్షను సాకారం చేసుకునేందుకు పది జిల్లాల ప్రజలు నాలుగు దశాబ్దాలుగా అలుపెరుగని పోరాటాలు సాగిస్తున్నారు. ఈ ఉద్యమాన్ని అణచివేయాలని అధికారంలో ఉన్నవాళ్లు చేయని ప్రయత్నం లేదు. ఉద్యమాన్ని మొగ్గలోనే తుంచివేయాలని ప్రయత్నించిన పార్టీగా కాంగ్రెస్ గణ చరిత్రే ఉంది. 1969లో తెలంగాణ ప్రజల ఆకాంక్షల్లోంచి ఆవిర్భవించి 1971 సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటిన తెలంగాణ ప్రజాసమితిని తనలో విలీనం చేసుకొని తెలంగాణ సమస్యే ఇక ఉత్పన్నం కాబోదన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది. ఆ పార్టీ చూపిన మార్గంలోనే తెలుగుదేశం పార్టీ అడుగులు వేసి తెలంగాణ ప్రాంత వనరులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, నీళ్లు, నిధులు కొళ్లగొట్టడం కొనసాగించింది. భాషా ప్రయోక్త రాష్ట్రాల పేరుతో బలవంతంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయించిన పెద్దలు తర్వాతికాలంలో ఈ ప్రాంత ప్రజల స్థితిగతులను ఎంతమాత్రం పట్టించుకోలేదు. తెలుగును అధికార భాషగా చేసే క్రమంలో అప్పటి వరకూ హైదరాబాద్‌లో అధికార భాషగా ఉన్న ఉర్దూకు సముచిత ప్రాధన్యం కల్పించలేదు. ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో రెండు తరాల యువతరం ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కోల్పోయింది. తెలంగాణ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడటం, వేధింపులకు గురిచేయడం ప్రారంభమైంది. తెలంగాణ భాష అవహేళనకు గురైంది. ప్రజలు నాలుగో శ్రేణి పౌరుల మాదిరిగా ఉణికిని వేదుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది. తెలంగాణ యాస, భాష విలన్ల భాషగా మార్చేయబడింది. ఆరు దశాబ్దాల సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రులు పాలించిన కాలం దశాబ్దానికి మించదు. ఇంతటి నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ, స్వపరిపాలన, ఆత్మ గౌరవం కోసం కణకణ మండే నిప్పు కణికలా ప్రజ్వరిల్లింది తెలంగాణ ఉద్యమం. బెల్లం ఉన్నకాడ ఈగలు వాలినట్లు ఉద్యమాన్ని, ప్రజల ఆకాంక్షలను ఆసరాగా చేసుకొని రాజకీయ పార్టీలు ఉద్యమంలో భాగస్వాములయ్యాయి. ప్రజల ఉద్యమాన్ని పార్టీలు ఆసరాగా చేసుకున్నాయే తప్ప వాటికవే స్వతహాగా ఉద్యమ నిర్మాణం చేయలేదు. తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజల ఆకాంక్షలను ఒక పార్టీకి దోహదం చేసేవిగా పేర్కొంటూ అధికారపక్షం ఉద్యమాన్ని నిర్బంధంతో అణచివేయాలని ప్రయత్నిస్తోంది. మొన్న టీ జేఏసీ ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని సీమాంధ్ర సర్కారు అదేవిధంగా అడ్డుకోజూసింది. కేవలం హైదరాబాద్ నగరంలో 30 వేల మంది పోలీసులు, భద్రతా బలగాలను మోహరించి, రైళ్లు, బస్సులు, రోడ్లు బంద్ చేసి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించింది. చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొంటారనే నెపంతో తెలంగాణలోని పది జిల్లాల్లో 15 వేల మందికిపైగా అరెస్టులు, బైండోవర్ల పేరుతో నిర్బంధించింది. హైదరాబాద్‌కు వచ్చే అన్ని రోడ్లపై పోలీసు పికెట్లు ఏర్పాటు చేసి వచ్చే ప్రతి వాహణాన్ని తనిఖీల పేరుతో నిలుపుతూ అనేక ఇబ్బందులకు గురి చేసింది. రైళ్లనూ వదల్లేదు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ అదుపులోకి తీసుకొని వేధించారు. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎంతగా అణచివేయాలని చూసినా చలో అసెంబ్లీ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు బయల్దేరారు. పెద్ద సంఖ్యలో ఇందిరాపార్క్‌కు చేరుకున్న, చేరుకుంటున్న తెలంగాణవాదులపై పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించి బలప్రయోగాలు చేసి ఠాణాలకు తరలించారు. అయినా అసెంబ్లీ వైపు ప్రజలు చొచ్చుకొచ్చారు. అసెంబ్లీ ఒకటో నంబర్ గేట్ ఎదుట టీ జేఏసీ జెండాలతో జై తెలంగాణ అని నినదించారు. ఐదంచెల భద్రతా వలయాలను ఛేదించుకొని, తీవ్ర నిర్బంధాన్ని దాటుకొని అసెంబ్లీ వైపు దూసుకొచ్చిన వందలాది మంది తెలంగాణలోని నాలుగున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు ప్రతీకలు. సీమాంధ్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని సమర్థంగా అడ్డుకున్నామని జబ్బలు చరుచుకుంటున్నారు. వేలాది మంది పోలీసులను పెట్టి, నాలుగు రోజుల ముందు నుంచే తెలంగాణవాదులను నిర్బంధించి దాన్ని పెద్ద విజయంగా చెప్పుకుంటోంది ప్రభుత్వం. అంతటితో ఆగకుండా చలో అసెంబ్లీ విఫలమైంది అనే అబద్ధపు ప్రచారాన్ని మొదలు పెట్టింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేది ఉదయం ఏడు గంటలకైతే ఆరు గంటలకే శాసనసభకు చేరిన ముఖ్యమంత్రి, స్పీకర్ తెలంగాణవాదులకు భయపడే ఇలా చేశారా అంటే సమాధానమే లేదు. కాదు లేదు అంటూ దాటవేయడానికి ప్రయత్నించడమే తప్ప దీనిపై సరైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ముఖ్యమంత్రి కిరణ్ ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఒకటుంది. ఇరాక్ ప్రజలపై ఇనుపబూటు కాలు మోపిన జార్జిబుష్ వేలాది మంది సైన్యం భద్రతలో ఆ దేశంలో పర్యటించవచ్చు అంత మాత్రన ఇరాక్ ప్రజలందరూ ఆయన చర్యలకు మద్దతు పలికినట్లు కాదు. ఇరాక్ దురాక్రమణ వల్ల ఆ దేశ ప్రజలను బుష్ సర్కార్ ఎంతగా వేధించిందో ప్రపంచానికంతా తెలుసు. బుష్ దురాఘతాలను నిరసిస్తూ కడుపుమండిన ఓ ఇరాకీ పౌరుడు బుష్‌పైకి బూటు విసిరి ఇదీ ఇరాకీయుల నిరసన అని చాటి చెప్పాడు. ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా పోలీసుల నిర్బంధం మధ్య చలో అసెంబ్లీని పాక్షికంగా అడ్డుకోగలిగాడేమోగాని ప్రజల్లోని ఆకాంక్షను మాత్రం చెరిపివేయలేదు. పాలన పోలీసుల నీడలో కాదు ప్రజల మద్దతు సాగించాలి. పోలీసులు, భద్రతా బలగాల అండదండలతో సాగే పాలనే ఎప్పటికీ ప్రజాపక్షం కాబోదు. ఈ విషయాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డి పూర్తిగా విస్మరించాడు. ప్రజాభీష్టాన్నీ, ప్రజల అభిప్రాయాలను తుంగలో తొక్కి పరిపాలిద్దామనుకుంటే అలాంటి పాలనకు ప్రజలు చరమగీతి పాడటానికి ఎంతో సమయం పట్టదు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు తేల్చుకున్నారు. తమ ఆకాంక్షలను, అభిప్రాయాలను గౌరవించని పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని.