ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడండి

` విప్లవానికి మరణం లేదు
` ప్రజల పోరాటానికి అంతం లేదు
` జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ పట్టణ, పారిశ్రామిక ప్రాంతాల్లోనూ మావోయిస్టుల పట్టు
` విప్లవోద్యమాలతోనే సామాజిక మార్పు
` మావోయిస్ట్‌ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హుస్సేన్‌

(దయానంద్‌గాంధీ)
గోదావరిఖని, జనంసాక్షి :
నాలుగున్నర కోట్ల ప్రజలు ఆకాంక్షిస్తున్నట్టుగా ప్రత్యేక రాష్ట్రం మాత్రమే కాదు ప్రజాస్వామ్యంతో కూడిన తెలంగాణ అవసరమని మావోయిస్ట్‌ పార్టీ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హుస్సేన్‌ అన్నారు. తెలంగాణ ఏర్పాటుతో పాటు అణగారిన ప్రజల అభివృద్ధి కూడా ముఖ్యమేనన్నారు. మావోయిస్టు పార్టీ అనుబంధ సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) కోల్‌బెల్ట్‌ ఏరియాలో ప్రధాన భూమికను పోషించి ఉత్తర తెలంగాణ నుంచి ఉత్తర భారతం వైపు అడుగులు వేశారు. ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో కార్మిక ఉద్యమాలకు, మావోయిస్టు పార్టీ విస్తరణకు ఎంతగానో కృషి చేశారు. ఈక్రమంలోనే జార్ఖండ్‌ రాష్ట్రం బొకారోలో 2009 జనవరి 28న పోలీసులకు చిక్కారు. సికాస, రాడికల్‌ నాయకునిగా పేరు గడిరచిన హుస్సేన్‌ విప్లవ సాహిత్యంతో విప్లవోద్యమ పార్టీలో ప్రవేశించి కరీంనగర్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, వరంగల్‌లోని బొగ్గుగని ప్రాంతాల్లో పార్టీ ఉనికిని చాటిన సుధాకర్‌, శంకర్‌, శేఖర్‌ పేర్లతో ప్రాచుర్యం పొందారు. 33 ఏళ్ల అజ్ఞాత జీవితంలో మావోయిస్టు పార్టీ అత్యున్నత కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి ఎదిగారు. హుస్సేన్‌ తన భార్య జిలానీబేగంను సైతం విప్లవ పార్టీలోకి నడిపించారు. ఆమె ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందింది. పీడిత ప్రజానీకం హక్కుల కోసం నిరంతరం పోరాటం జరిపిన హుస్సేన్‌ కోల్‌బెల్ట్‌ ఏరియాలో సికాసలో కురవృద్ధ మావోయిస్ట్‌గా ప్రాచుర్యం పొందారు. సింగరేణి కార్మికుడిగా పనిచేసి, ఉద్యోగాన్ని వీడి విప్లవ బాటపట్టారు హుస్సేన్‌. జైలు జీవితం గడుపుతూ బెయిల్‌పై విడుదలై గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి వచ్చిన ఆయన ‘జనంసాక్షి’తో ముఖాముఖి మాట్లాడారు.
జనంసాక్షి : విప్లవోద్యమంలోకి ఎందుకు వెళ్లాలనుకున్నారు?
హుస్సేన్‌ : సామాజిక జీవనంలో అనేక మంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు భూస్వామ్యవ్యవస్థలో అణగదొక్కబడ్డారు. వ్యవసాయంపై బతుకులీడుస్తున్న మా కుటుంబం కూడా అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది. అందుకే సామాజిక మార్పు కోరుకున్నాను. అందుకు అవసరమగు మార్గాన్ని అన్వేషించాను.
జ : ఇంకా?
హు : శ్రీశ్రీ విప్లవ సాహిత్యం నన్ను విశేషంగా ఆకర్షించింది. ఆయనకు సంబంధించిన అనేక రచనలు చదివాను. వీటితో పాటు నాస్తిక సాహిత్యం, విరసం రచనలు కూడా నన్ను ఆకట్టుకున్నాయి. ఇతరులతో చదివించాలని సంకల్పించాను. నిత్యం ఆ సాహిత్యాన్ని మనసులో మననం చేసుకుంటుండేవాడిని. అందులోని అంశాలను సమాజంలో గమనించేవాణ్ని.
జ : ఎప్పుడు విప్లవబాట పట్టారు?
హు : 1974లో జమ్మికుంటలో వ్యవసాయాన్ని వీడి, ఆదిలాబాద్‌ జిల్లా బెల్లంపల్లికి రావడంతోనే నా ఉద్యమ జీవితం పురుడు పోసుకుంది. అక్కడ టీ స్టాల్‌ నిర్వహిస్తూ.. ఆ హోటల్లోనే అన్ని రకాల విప్లవ సాహిత్యాలను బహిరంగంగా అమ్మడం ప్రారంభించాను. అన్నివర్గాలు ముఖ్యంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ సాహిత్యాన్ని చదివేలా ప్రొత్సహించాను. వారితో సామాజిక రుగ్మతలపై సుధీర్ఘంగా చర్చించేవాడిని.
జ : మొదట పోరాటం ఎక్కడి నుంచి ప్రారంభించారు?
హు : చెమటను రక్తంలా ధారపోసే… బొగ్గుగని కార్మికుల బతుకులు నన్ను బాధించాయి. ప్రాణాలను చేతిలో పెట్టుకుని విధులను నిర్వహించే కార్మికుల చెమట బిందువులను తుడిచేవారు లేక ఆవేదన పడే వాడిని. అప్పుడున్న కార్మిక సంఘాలు యాజమాన్యానికి తొత్తుగా మారాయి. అతితక్కువ జీతాలతో ఎలాంటి హక్కుల్లేకుండా ఉన్న కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపాలని అనిపించింది. అదేసమయంలో మావోయిస్ట్‌ పార్టీకి దగ్గరయ్యాను. దానికి అనుబంధంగా రిజిస్టర్డ్‌ యూనియన్‌గా ‘సికాస’ను ఆవిష్కరించాము.
జ : సికాసను ఎలా విస్తరింపచేశారు ?
హు : ఎమర్జెన్సీ సమయంలో బొగ్గుగని కార్మికుల వేతనాల్లో డిపాజిట్‌ స్కీం పేరిట జరిగిన కోతపై రిజిస్టర్డ్‌గా ఉన్న సికాస ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాన్ని నిర్వహించాం. చారిత్రాత్మకంగా సింగరేణి 36 భూగర్భ గనుల్లో 56 రోజుల సమ్మె చేపట్టాం. ఈ ‘రాడికల్‌’ కార్యకలాపాలను అణగదొక్కడానికి యాజమాన్యం, పోలీసులు, కొన్ని ట్రేడ్‌ యూనియన్లు తీవ్రస్థాయిలో ప్రయత్నించాయి. చివరకు ప్రభుత్వం దిగొచ్చింది. దీంతో మాకు కార్మికుల్లో పట్టు పెరిగింది. దీంతో మాపై నిర్బంధం పెరిగింది. కానీ, కార్మికులు తలెత్తుకునే జీవితాన్ని సంపాదించుకున్నారు.
జ : 33 ఏళ్ల అజ్ఞాత జీవితం అనుభవాలు?
హు : డబ్బుతో వెలకట్టనిది… మాటల్లో చెప్పలేనిది 33 ఏళ్ల అజ్ఞాత జీవితంలో సాధించాం. ప్రజల జీవితాల్లో చిరుదివ్వెను వెలిగించాం. నీటికోసం, రోడ్డు కోసం, తిండి కోసం, ఇళ్ళు కోసం అలమటించే ఎంతో మంది అభాగ్యులకు ఊరటనిచ్చాం. దీర్ఘకాలిక పోరాటాలతో అనేకమందికి సౌకర్యాలు కల్పించాం. భూస్వామ్య వ్యవస్థను, విచ్చలవిడిగా చెలరేగే గుండాయిజానికి సమాధి కట్టాం.
జ : ఉత్తర తెలంగాణ నుంచి ఉత్తర భారతంవైపు మీ పయనం సాగింది కదా జార్ఖండ్‌లో ఉద్యమ ప్రభావమెట్లా ఉంది?
హు : మావోయిస్టు పార్టీపై ఇప్పటి వరకూ ఓ తప్పుడు ప్రచారం ఉంది. మావోయిస్టులు కేవలం అణగారిన వర్గాలు, ఆదివాసీల్లో మాత్రమే విప్లవోద్యమాన్ని రగల్చ గలిగారని. నగరికత లేని ప్రాంతాల్లోనే మావోయిస్టు పార్టీ మనగలుగుతుందని, అది నూటికి నూరుపాళ్లు తప్పు. నా ఉద్యమ ప్రస్థానమంతా పట్టణ ప్రాంతాల్లోనే సాగింది. పట్టణాలు, నగరాల్లోని భారీ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల్లో విప్లవోద్యమానికి ఎంతో ఆధరణ ఉంది. ఓ సంఘమనే కాదు. అన్ని కార్మిక సంఘాల్లో పనిచేస్తున్న వారు విప్లవోద్యమానికి మద్దతుగా ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లోనూ మావోయిస్టు పార్టీ బలంగా ఉందనడానికి ఇంతకు మించిన ఉదాహరణలు అక్కర్లేదు.

జ : ప్రస్తుత అజ్ఞాత విప్లవ సంస్థల పరిస్థితి ఏమిటి?
హు : విప్లవానికి మరణం లేదు. ప్రజల పోరాటానికి అంతం లేదు. కాకపోతే ప్రభుత్వం పెట్టే ఒత్తిళ్లతో సేఫ్‌ జోన్‌లోకి అజ్ఞాత సంస్థలు వెళ్లిపోయాయే తప్ప ఉద్యమం మరుగున పడదు. రుగ్మతలున్నంత కాలం ప్రజల్లో విప్లవం బతికే ఉంటుంది. సికాస కార్మికవర్గ ఆలోచనల్లో స్థానం పొందే ఉంది. గెరిల్లా జోన్‌కు మధ్యగా ఉండటం కీలక రంగంలో కొంతవరకు తగ్గిందే తప్ప పూర్తిగా తగ్గలేదని కచ్చితంగా చెప్పవచ్చు.
జ : జనజీవన స్రవంతిలో కలిసిన కొందరి లంపెన్‌ కార్యకలాపాలపై మీ అభిప్రాయం?
హు : అలాంటి వారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. వారు ప్రజల చేతిలో శిక్షింపకబడక తప్పదు. ఎన్నటికైనా సమాజం వారిని వెలేస్తుంది. వీలైతే చట్టం కూడా శిక్షిస్తుంది.
జ : మీపై ఎన్ని పోలీసు కేసులున్నాయి?
హు : విప్లవోద్యమంలో ఉన్నంత కాలం ఏ ఒక్కరిని చెంపదెబ్బ కూడా నేను వేయలేదు. ఎదుటివారిని ఒక్క తిట్టు కూడా తిట్టలేదు. కీలక నాయకత్వ బాధ్యునిగా ప్రజాకంఠకులను కింది క్యాడర్‌ శిక్షించడానికి మాత్రం అనుమతిని ఇచ్చేవారిమి. అయితే శత్రువులు నాపై ఎన్నో కేసులు పెట్టారు. అవన్నీ కొట్టుడుపోయిన, జార్ఖండ్‌ కేసు మాత్రం కొనసాగుతోంది.
జ : మీ భవిష్యత్‌ కార్యచరణ?
హు : జనజీవన స్రవంతిలో సమాజాన్ని చదువుతాను. అనారోగ్యరీత్యా విప్లవ పోరాటాలకు నా శరీరం, నా మనసు శక్తి సరిపోదు. అందుకే శేష జీవితం భార్య, పిల్లల్లేని నేను నా రక్తసంబంధీకుల మధ్య గడుపుతాను.
జ : తెలంగాణపై మీ అభిప్రాయం ?
హు : భూ విస్తీర్ణాన్ని విభజిస్తూ ఇచ్చే తెలంగాణ ప్రజలకు అవసరం లేదు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతంలో ప్రజాస్వామ్య బలంగా ఉండాలి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినంత మాత్రాన ఆంధ్రోళ్లు నెలకొల్పిన విధానాలు పోతాయని గ్యారంటీ ఏంటి. మా అంటే ఉద్యోగాలు, కొన్ని సంక్షేమ పథకాలు పీడిత ప్రజలకు వస్తాయి కాబోలు. అదే పరిస్థితి ఉంటే ప్రత్యేక రాష్ట్రంలో హక్కుల కోసం ప్రజలు ఉద్యమించక తప్పదు. ప్రత్యేక రాష్ట్రం మాత్రమే కాదు ప్రజాస్వామిక తెలంగాణ కావాలి.