ప్రజా సమస్యలను పట్టించుకోని సర్కార్: టీడీపీ
కడప, జూలై 8 : రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న ప్రాథమిక సమస్యలపట్ల ముఖ్యమంత్రి, అధికారులు నిస్సాహయతను వ్యక్తం చేయడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే లింగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలతో పాటు కడప జిల్లా ప్రజలు కూడా విద్యుత్ కోత, మంచినీటి సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ సమస్యలను స్వయంగా సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. సీఎం అధికారులను ఆదేశించి చేతులు దులుపుకున్నారని చెప్పారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు సీఎంకు తెలుసని, కాని ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదని విమర్శించారు. ప్రజల పక్షాన టీడీపీ ఆందోళనకు దిగనున్నదని చెప్పారు. మంచినీటి సమస్య, విద్యుత్ కోత, విత్తనాలు, ఎరువుల కొరత, సిమెంట్ అధిక ధరలు, తదితర సమస్యలపై టీడీపీ ఉద్యమిస్తున్నదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు ఆందోళనలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.