ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు

4

విడియో సమావేశంలో ప్రధాని మోది

న్యూదిల్లీ,మార్చి 24 (జనంసాక్షి):

ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో భాగంగా ప్రజలిచ్చే ఫిర్యాదుల్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాధికారులను ఆదేశించారు. ఈ విషయంలో అలసత్వం పనికిరాదన్నారు. తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్నా నమ్మిక కలిగేలా అధికారులు చూడాలన్నారు. ప్రస్తుతం పెండింగులో ఫిర్యాదుల్ని ఒక నెలలో గరిష్ఠంగా 60రోజుల్లో పరిష్కరించాలని కోరారు. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో మోదీ మాట్లాడారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు అంతర్జాలంలో ఓ ప్లాట్‌ఫాం తయారు చేయాలని, ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో జాప్యం ఎందుకు జరుగు తుందనే విషయంపైనా ఆరా తీశారు. ఆన్‌లైన్‌లో వివరాల్ని ఆధార్‌తో అనుసంధానం చేయాలని చెప్పారు. అనంతరం ఆయన మధ్యప్రదేశ్‌, హర్యాణా, రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ల్లో జరుగుతున్న రోడ్డు, రైల్వే, విద్యుత్తు ప్రాజెక్టుల గురించి సంబంధిత అధికారులతో సవిూక్ష నిర్వహించారు.

ప్రతిభావంతుల జాబితాలో ప్రధాని మోడీ

ఇదిలావుంటే అత్యంత ప్రభావవంతులైన వ్యక్తుల్లో పోటీపడుతున్న వారిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా విూర్జా, బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రాలు ఉన్నట్లు ప్రముఖ టైమ్స్‌ మ్యాగజైన్‌ సంస్థ ప్రకటించింది. వచ్చే నెల టైమ్స్‌ మ్యాగజైన్‌ ప్రపంచలోనే అత్యంత ప్రభావవంతులైన వంద మంది వ్యక్తుల జాబితాను ‘టైమ్‌ 100’ పేరుతో విడుదల చేయనుంది. గతేడాది టైమ్స్‌ మ్యాగజైన్‌ విడుదల చేసిన జాబితాలో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో పాటు ప్రధాని మోదీ ఉన్నారు. భారత ఉత్తమ మహిళా టెన్నిస్‌ స్టార్‌గా, మహిళల డబుల్స్‌లో మొదటి స్థానాన్ని సంపాదించుకొని తన సొంత దేశంలోనే ఎందరో అథ్లెట్లుకి స్పూర్తిగా సానియావిూర్జా నిలిచింది. అత్యధిక పారితోషకం తీసుకుంటున్న వారిలో ఒకరిగా నిలిచిన బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా ‘క్వాంటికో’ టీవీ సిరీస్‌తో అందరి దృష్టిని తనవైపుకి తిప్పుకుంది. ఇప్పుడు వీరిద్దరూ ఈ జాబితాలో పోటీపడుతున్నారు. ప్రస్తుతం ప్రియాంక బేవాచ్‌ చిత్రంలో నటిస్తోంది. సాంకేతిక రంగం నుంచి గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ సీఈవోలు సుందర్‌ పిచాయ్‌, సత్యనాదెళ్లలను అత్యంత ప్రభావవంతులైన జాబితాలో ఉన్నారు. మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ 10ని విజయవంతంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. భారత సంతతికి చెందిన అజీజ్‌ అన్సారీ, స్పేస్‌ ఎక్స్‌ సీఈవో ఎలెన్‌ ముస్క్‌, గాయని రిహన్నా, జమైకా పరుగుల వీరుడు ఉసేన్‌ బోల్ట్‌, హ్యారీపోటర్‌ రచయిత జెకె రోలింగ్‌, ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌, ఆయన సతీమణి ప్రిస్కిల్లా చాన్‌, మయన్మార్‌ ఎన్‌ఎల్‌డీ పార్టీ అధ్యక్షురాలు అంగ్‌ శాన్‌ సూచీ జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌, మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌, రష్యన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో పాటు పలువురు టైమ్స్‌ 100 జాబితాలో పోటీదారులుగా ఉన్నారు. వారిలో ఎవరికి ఏ ర్యాంకు వస్తుందో తెలియాలంటే వచ్చే నెల వరకు వేచి చూడాల్సిందే.