ప్రతిపాదనలు పంపండి : కలెక్టర్‌

నెల్లూరు, జూలై 27 : జిల్లాలో వివిధ పరిశ్రమలు నెలకొల్పేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు అవసరమైన ప్రతిపాదనలను పంపాలని కలెక్టర్‌ శ్రీధర్‌ కోరారు. శుక్రవారం స్థానిక కలెక్టర్‌ ఛాంబర్‌లో ఇండస్ట్రీస్‌ ప్రమోషన్‌ కమిటీ సమావేశంలో సంబంధిత అధికారులతో సమీక్షించి తగు సూచనలు, సలహలిచ్చారు. కలెక్టర్‌ మాట్లాడుతూ, పంచాయితీ పరిధిలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందస్తుగా తగిన ప్రతిపాదనలు పంపి, అనుమతి పొందాలన్నారు. స్థల సేకరణలో మార్కెట్‌ విలువ ప్రకారం సంబంధిత సర్టిఫికేట్స్‌ను తీసుకోవాలన్నారు. అలాగే అంచనాలతో కూడిన ప్రణాళికలను పంపి, ఆమోదం పొందడంతో పాటు సంబంధిత అధికారులకు నివేదికలు పంపి, క్లియరెన్స్‌ సర్టిఫికేట్‌ పొందాలన్నారు. కొన్ని పరిశ్రమలు పనులు నిర్వహించుటలో జాప్యం చేయకుండా సంబంధిత క్లియరెన్స్‌ సర్టిఫికేట్లను మంజూరు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనల ప్రకారం స్థల సేకరణ, మౌలిక సదుపాయాలు, కరెంటు, మంచినీరు. తదితర సౌకర్యాలు కల్పించేందుకు సంబంధించిన సర్టిఫికేట్‌ పొందుటలో పరిశ్రమల శాఖాధికారులు అవసరమైన ప్రతిపాదనలు పంపి, ఆమోదం పొందాలన్నారు. మధ్యతరహా, చిన్నతరహా పరిశ్రమలు నెలకొల్పేందుకు నిబంధనల ప్రకారం బ్యాంక్‌ల సహకారంతో ఆర్థిక సహాయం అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ సుధాకర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ షఫి, జోనల్‌ మేనేజర్‌ గోపాల్‌రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.