ప్రతీ జిల్లాలో వెయ్యి పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
ఉస్మానియా వైద్యశాలకు
24 అంతస్తులతో
నూతన భవనం
– 2500 పడకల పెంపు
– వైద్య,ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ
– వైద్య రంగాన్ని ప్రక్షాళన చేస్తాం
హైదరాబాద్, ఏప్రిల్ 8 (జనంసాక్షి):
సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖపై సీఎం కేసీఆర్ నిర్వహించిన సవిూక్షా సమావేశం ముగిసింది. ఈ సమావేశం సుదీర్ఘంగా ఆరు గంటల పాటు కొనసాగింది. ఈ సమావేశం లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలందించే అంశంతోపాటు వైద్య, ఆరోగ్య శాఖలో తీసుకురావాల్సిన మార్పులపై సుదీర్ఘంగా చర్చించారు. అదేవిధంగా ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలను చేపట్టాలని నిర్ణయించారు. ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో 100పడకల ఆస్పత్రి, ప్రతీ జిల్లాలో వెయ్యి పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఉస్మానియా వైద్యశాలకు 24 అంతస్తులతో నూతన భవనం, ఉస్మానియా ఆస్పత్రిలో పడకలు 2500 పెంపు, గాంధీ ఆస్పత్రిని 1600-2వేల పడకలకు పెంపు, నిలోఫర్ ఆస్పత్రికి నూతన భవనం ఏర్పాటు అంశాలపై చర్చించినట్టు సమాచారం. వైద్య,ఆరోగ్య శాఖలో ఖాళీలకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం..గుర్తించిన ఖాళీలన్నీ త్వరలో భర్తీ చేయాలని ఆదేశించారు. అలాగే వైద్యశాఖ విభాగాలన్నీ ఒకే గొడుగు కిందకు తెవాలని సీఎం నిర్ణయించారు.