ప్రపంచానికి మనవంతు అందించాం

5

– ప్రధాన మంత్రి మోడీ

న్యూఢిల్లీ,మార్చి11(జనంసాక్షి): ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ ప్రపంచంలో భారత్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దిల్లీలో జరుగుతున్న ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ… ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ ద్వారా రవిశంకర్‌ 35 సంవత్సరాలుగా సేవ చేస్తున్నారని కొనియాడారు. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ను చూస్తే ఇండియా అంటే ఏంటో తెలుస్తుందన్నారు.భారత్‌ ప్రపంచానికి ఎంతో ఇచ్చిందని.. ఆర్థిక పరంగానే కాకుండా సాంస్కృతికంగానూ ప్రపంచంతో ఎంతో అనుబంధం పెనవేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉత్సవాల కోసం 150 దేశాల నుంచి వేలాది ప్రజలు ఇక్కడికి రావడం ఎంతో గొప్ప విషయమని మోదీ అన్నారు. కుంభమేళాను తలపించేలా వేదిక ఏర్పాటు చేశారని నిర్వాహకులను అభినందించారు.

ప్రపంచమే నా కుటుంబం: శ్రీశ్రీ రవిశంకర్‌

ప్రపంచంలోని ప్రజలను కలిపేందుకు ఐదు మాధ్యమాలు ఉన్నాయని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ గురూజీ అన్నారు. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ స్థాపించి 35 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దిల్లీలో నిర్వహిస్తున్న ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాల సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సమాజానికి మనం ఎంత ప్రేమ పంచుతామో… అంతకు వందరెట్లు ప్రేమ తిరిగి పొందుతామన్నారు. వివిధ, మతాలు, సంస్కృతులు, సంప్రదాయాలు కలవారిని ఏకం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం తన ప్రైవేటు పార్టీ అని కొందరు విమర్శించారని… మంచి పని చేసేటప్పుడు కొన్ని విఘ్నాలు కలగడం సహజమేనన్నారు. ప్రపంచమంతా తన కుటుంబమేనని… అందుకే అన్ని దేశాల నుంచి ప్రజలు వచ్చి ఈ ఉత్సవానికి వన్నె తెచ్చారని అన్నారు.

ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు ప్రారంభం

దిల్లీ వేదికగా యమునా నదీ తీరాన ‘ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు’ శుక్రవారం సాయంత్రం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ స్థాపించి 35 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ సంస్థ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌ గురూజీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు 155 దేశాల నుంచి వేలాది మంది కళాకారులు, ప్రతినిధులు తరలివచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.