ప్రపంచ నెంబర్‌ వన్‌ షట్లర్‌గా సైనానెహ్వాల్‌

4

హైదరాబాద్‌, మార్చి 30(జనంసాక్షి) : భారతీయ బాడ్మింటన్‌ స్టార్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌ మరో అరుధైన ఘనతను సృష్టించింది. ప్రపంచ నంబర్‌ వన్‌ ర్యాంక్‌ సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా అమె రికార్డును సొంతం చేసుకుంది. ఇండియన్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ లో భాగంగా నెం.1 ర్యాంక్‌ పోటీదారు కరోలినా మారీన్‌ (స్పెయిన్‌) శనివారం సెమీఫైనల్లో ఓడిపోవడంతో 25 ఏళ్ళ సైనాకు అగ్రస్థానం ఖాయమైంది. గురువారం ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య అధికారికంగా ప్రకటించే ర్యాంకింగ్స్‌లో ఆమెకు నెం.1 ర్యాంకు దక్కడం లాంఛనమే! 2010 తర్వాత ఈ ఘనత సాధింఛిన చైనాయేతర క్రీడాకారిణిగా సైనా రికార్డు సృష్టించింది. చైనా ఆధిపత్యానికి సవాల్‌ విసురుతూ.. అద్భుత ఆటతీరుతో.. అసాధారణ విజయాలెన్నో అందుకున్న భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌.. మరోసారి చైనాను ఓడించి అరుదైన ఘనతను దక్కించుకుంది. లీ జురుయ్‌ (చైనా)ను వెనక్కినెట్టి ప్రపంచ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కొల్లగొట్టింది. ప్రస్తుతం రెండో ర్యాంకర్‌ సైనా ఖాతాలో ఉన్న పాయింట్లు 74,381. నిరుడు ఇండియా ఓపెన్‌లో క్వార్టర్‌ఫైనల్‌ చేరుకున్న సైనాకు 5040 పాయింట్లు వచ్చాయి. శనివారం  ఇండియన్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీలో ఫైనల్‌ విజేతగా నిలిచి 9200 పాయింట్లు సాధించింది. గత ఏడాది సాధించిన పాయింట్లు తొలగించి.. ప్రస్తుత టోర్నీలో గెల్చుకున్న పాయింట్లను కలిపి ర్యాంకింగ్‌ ఇస్తారు. అప్పుడు సైనా ఖాతాలో అత్యధిక పాయింట్లుంటాయి. ప్రస్తుత ర్యాంకింగ్స్‌లో లీ జురుయ్‌ (చెయనా) 79,214 పాయింట్లతో ఉంది. గత ఏడాది ఇండియా ఓపెన్‌లో ఆమె రన్నరప్‌ (7800 పాయింట్లు)గా నిలిచింది. ఈసారి టోర్నీకి జురుయ్‌ గైర్హాజరైనందున.. ఆమెకు పాయింట్లేమీ రావు. రానున్న ర్యాంకింగ్స్‌లో 7800 పాయింట్లు కోతపడే అవకాశముంది! కాబట్టి సైనాకు అగ్రస్థానం లభించింది.

1980లో భారత దిగ్గజం ప్రకాశ్‌ పదుకొనె పురుష్ళల సింగిల్స్‌లో ప్రపంచ నెంబర్‌వన్‌ అయ్యాడు. మహిళల సింగిల్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి క్రీడాకారిణి సైనానే. 2010 జులైలో రెండో ర్యాంకు సాధించిన సైనా.. ఐదేళ్ళ తర్వాత అగ్రస్థానం సొంతం చేసుకోనుంది. 2010 తర్వాత నెం.1 ర్యాంకు అందుకోనున్న తొలి చెయనాయేతర క్రీడాకారిణిగా సైనా రికార్డు సృష్టించనుంది. ఈ ఏడాది సైనా మూడు ఘనతలు సాధించింది. చెయనాయేతరులకు కష్టసాధ్యమైన చెయనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో విజేతగా నిలిచింది. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణి అయింది. ఆల్‌ ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌ చేరుకుని మరో రికార్డు నెలకొల్పింది. తాజాగా ప్రపంచ నెంబర్‌వన్‌ ర్యాంకుతో ఇంకో ఘనత సాధించింది. తాను ఈ స్థితికి రావడానికి చాసా కష్టాపడ్డానని సైనా చెప్తోంది. ”నేను కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా. ఓ దశలో అగ్రశ్రేణి క్రీడాకారుల చేతిలో వరుసగా పరాజయాలు చవిచూశా. నిరుడు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ తర్వాత బ్యాడ్మింటన్‌కు గుడ్‌బై చెప్పాలని కూడా భావించా. అది నా కెరీర్‌లో దుర్దశ. ‘సైనా నీ కెరీర్‌ ముగిసింది’ అని కూడా అన్నారు. ఆ తర్వాత నేను బెంగళూరు వెళ్లా. నెంబర్‌వన్‌ ర్యాంకును అందుకోవడానికి ఈ ఏడాది మే నెలను నా లక్ష్యంగా నిర్ణయించారు కోచ్‌ విమల్‌ కుమార్‌. కానీ నేను మార్చిలోనే దాన్ని సాధించా. అంటే నేను నెంబర్‌వన్‌ ర్యాంకు కోసమే ఆడుతున్నాననుకోవద్దు. కానీ ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నా. ప్రపంచ నెంబర్‌వన్‌ అయ్యానన్న విషయాన్ని ఇంకా నమ్మలేకపోతున్నా. ర్యాంకింగ్‌ జాబితాలో నా పేరును చూసుకున్నప్పుడు నమ్ముతా. నెంబర్‌వన్‌ కావడం చాలా గొప్ప విషయం. క్రీడాకారులంతా ఈ స్థానాన్ని అందుకోవాలని కల కంటారు. నా ప్రదర్శన వల్లే ఈ స్థితికి చేరుకున్నా. ఐతే నా దృష్టిలో ఒలింపిక్‌ పతకం తర్వాతే దీని స్థానం. విమల్‌ సర్‌తో పాటు ప్రకాశ్‌ పదుకొనె సర్‌కు నా కృతజ్ఞతలు. క్లిష్ట దశలో వారు నాకు అండగా నిలిచారు” అని సైనా తెలిపింది. కాగా సైనాకు రాష్ట్రపతి, ఫ్రధాని సహా పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.

”ప్రపంచ నెం.1 ర్యాంక్‌ సాధించిన సైనాకు అభినందనలు. ఇది ఆమె కృషికి తగిన ్ణొరవం. ఇండియా ఓపెన్‌లోనూ సైనా గెలవాలని కాంక్షిస్తున్నా” అని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ట్వీట్‌ చేశారు. ప్రధాని మోదీ ”సైనా సాధించిన విజయాలు మనల్ని గర్వపడేలా చేస్తూనే ఉన్నాయి. ప్రపంచ నెం.1 స్థానం దక్కించుకున్నందుకు ఆమెకు నా అభినందనలు” అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్‌రావు ”ప్రపంచ నెంబర్‌వన్‌ ర్యాంకు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన సైనాకు అభినందనలు. దేశంలోని యువతకు సైనా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది” అని ప్రసంసించారు. ”ప్రపంచ నెం.1 ర్యాంకు సాధించిన సైనాకు హృదయపూర్వక అభినందనలు. దేశం గర్వించదగిన క్షణాలివి” అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ”ప్రపంచ నెం.1 ర్యాంక్‌ సొంతం చేసుకున్న మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన సైనాకు శుభాకాంక్షలు. ఆమె ఇలాగే మరిన్ని రికార్డులు తిరగరాయాలి. దేశంలోని క్రీడాకారులందరికీ స్ఫూర్తిగా నిలిచింది”అని గాడ్‌ ఆఫ్‌ క్రికెట్‌ సచిన్‌ అన్నారు. ”సైనా నెం.1 ర్యాంక్‌ చేరుకోవడం భారత బ్యాడ్మింటన్‌కు, భారతీయులందరికీ గర్వకారణం. నాకెంతో ఆనందంగా ఉంది” అని  ద్రోణాచార్య అవార్డీ ఎం.ఎమ్‌.ఆరిఫ్‌ అన్నారు.

సైనా నెహ్వాల్‌ ప్రస్థానం

2006లో ఫిలిప్పిన్స్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ను గెలిచి స్టార్‌ ఓపెన్‌ను గెలిచిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

2006లో బీడబ్యూఎఫ్‌ ప్రపంచ చాంపియన్‌లో రన్నరప్‌గా నిల్చింది.

2007 లో ఇండియా నేషనల్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో విజయం సాధించింది

2007లో జాతీయ క్రీడలలో బ్యాడ్మింటన్‌ స్వర్ణాన్ని గెలుచుకుంది.

2008లో ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ను సాధించి..తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది.

2008లో చైనా మాస్టర్‌ సూపర్‌ సీరీస్‌లో సెవిూస్‌ వరకూ సైనా వెళ్ల గల్గింది.

2008లో ఇండియన్‌ నేషనల్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌ లో విజేతగా నిలిచింది

2008లో కామన్వెల్త్‌ యూత్‌ గేమ్స్‌లో స్వర్ణపతకం సాధించింది.

2008లో ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో కూడా టైటిల్‌ సాధించింది.

2009 లో ఇండోనేషియా ఓపెన్‌లో టైటిల్‌ సొంతం చేసుకంది.

2009 లో  ప్రపంచ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ వరకూ వెళ్లింది.

2010 లో ఆల్‌ ఇంగ్లండ్‌ సూపర్‌ సీరీస్‌ సెవిూస్‌ వరకు వెళ్ళింది.

2010 లో ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించింది

2010 లో ఇండియా ఓపెన్‌, ఇండోనేషియా ఓపెన్‌ గ్రాండ్‌ ప్రిక్‌ టైటిళ్లును సైనా కైవశం చేసుకుంది.

2011 ఆరంభంలో స్విస్‌ ఓపెన్‌ గెలిచింది.

2012లో సైనా స్విస్‌ ఓపెన్‌ టైటిల్‌ ను కాపాడుకోవడంలో సైనా సఫలమయ్యింది.

2012లో ఇండోనేషియా సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ ను, సమ్మర్‌ ఒలింపిక్స్‌ లో  కాంస్య పతకాన్ని చేజిక్కించుకుంది

2012లో డెన్మార్క్‌ సూపర్‌ సిరీస్‌ ను తొలిసారి కైవశం చేసుకుంది.

2014 లో మూడు టైటిళ్లను సైనా గెలుచుకుంది.

2014 లో ఇండియా ఓపెన్‌ టైటిల్‌ ను కైవసం చేసుకుంది.

2014 లో ఆస్ట్రేలియా సూపర్‌ సిరీస్‌ సోంతం చేసుకుంది.

2014 లో చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ లను సైనా దక్కించుకుంది.

2015 లో ఇండియన్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌ గోల్డ్‌ టైటిల్‌ సైనాను వరించింది.

2015 లో ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ ప్రీమియర్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నమెంట్‌ ఫైనల్‌ వరకు వెళ్లి తలపడింది