ప్రశాంతంగా ఎస్సై రాత పరీక్ష

3

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 17(జనంసాక్షి):రాష్ట్ర వ్యాప్తంగా సివిల్‌ ఎస్‌ఐ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 321 కేంద్రాల్లో ఉదయం 10 గంట నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష నిర్వహించారు. 568 పోస్టులకు 2 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎస్‌ఐ పరీక్షల్లో తొలిసారిగా బయోమెట్రిక్‌ విధానం అమలు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్షకు అనుమతించలేదు. దీంతో అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు వచ్చారు.హైదరాబాద్‌ నిజాం కాలేజ్‌ లో ఎగ్జామ్‌ సెంటర్‌ ను సెంట్రల్‌ జోన్‌ డీసీపీ కమలాసన్‌ రెడ్డి పరిశీలించారు.అటు ఎస్‌ ఐ పరీక్షకు నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను. . అధికారులు ఎగ్జామ్‌ సెంటర్‌ లోకి అనుమతించలేదు. కూకట్‌ పల్లి రిషి ఇంజినీరింగ్‌ కాలేజ్‌ లో ఇద్దరు, నిజాం కాలేజ్‌ లో ఒక క్యాండిడేట్‌.. ఎగ్జామ్‌ కు లేట్‌ గా వచ్చారు. వారిని పరీక్ష రాసేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో, అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు.నల్లగొండ జిల్లా లో ఎస్సై సివిల్‌ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా సాగింది. జిల్లా కేంద్రంలో 33 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 15,377 మంది అభ్యర్దులు పరిక్షలు రాశారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమెదటి సారిగా నిర్వహిస్తున్న ఈ ఎస్‌ ఐ రాత పరిక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు బయోమెట్రీక్‌ విధానాన్ని అమలు చేశారు. మెదక్‌ జిల్లా పటాన్‌చెరూలో ఎస్సై రాత పరీక్ష ప్రశాంతంగా కొనసాగింది. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి సెంటర్‌ వద్ద వాటర్‌ ప్యాకెట్లు పంపీణీ చేశారు.అటు ఆదిలాబాద్‌ జిల్లాలోనూ ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా 7 వేల 266 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. వీరి కోసం 16 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడిపింది. పరీక్షల్లో అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేశారు. అటు కరీంనగర్‌ లోనూ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో మొత్తం 21 చోట్ల 44 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 21,618 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు తలెత్తకుండా 144 సెక్షన్‌ విధించారు. ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఎగ్జామ్‌ హాల్లోకి అనుమతించారు. ఎగ్జామ్‌ సెంటర్లను జిల్లా ఎస్పీ జోయల్‌ డేవిస్‌ సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు.వరంగల్‌ జిల్లాలో ఎస్సై రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంతో పాటు వర్దన్నపేటలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్ష నిర్వహించారు.సంగెం మండలం బొల్లికుంటలోని వాగ్దేవికళాశాలలో మొత్తం 3960 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ఆలస్యంగా వచ్చిన ముగ్గురు అభ్యర్థులను అనుమతించలేదు. దీంతో వారు నిరాశతో వెను దిరిగారు. అటు మహబూబ్‌ నగర్‌ జిల్లాలోనూ ఎస్సై పరీక్ష ప్రశాంతంగా సాగింది. మొత్తం 26 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 12, 236 మందికి హాల్‌ టిక్కెట్లు పంపిణీ చేశారు. అటు ఖమ్మం జిల్లాలోనూ ఈ పరీక్ష ప్రశాంత వాతావరణంలో కొనసాగింది.రంగారెడ్డి జిల్లాలోనూ ఎస్సై సివిల్‌ పరీక్ష ప్రశాంతంగా సాగింది. మెడ్చెల్‌, చేవెళ్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్ష నిర్వహించారు. ఎప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులు పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు.