ప్రాణహిత మా ప్రాణం

4

– నీటి నిల్వ పెంచుతున్నాం

– రూ.1400 కోట్లు దుబారా చేసింది మీరూ!

– మంత్రి హరీశ్‌ రావు

హైదరాబాద్‌,మార్చి17(జనంసాక్షి): ప్రాణహిత ప్రాజెక్టు విషయంలో పాపం అంతా కాంగ్రెస్‌దేనని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌ రావు అన్నారు.ముఖ్యమంత్రి కెసిఆర్‌ దీనిని సరిచేయడానికి మహారాష్ట్రను ఒప్పించి, నీటిని సద్వినియోగం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన చెప్పారు. కెసిఆర్‌ రీడిజైన్‌ వల్ల వందల టిఎంసిల నీరు నిల్వ చేసుకునే అవకాశం వస్తుందని,ఆ నీటిని రిజర్వాయిర్‌ లలో స్టోర్‌ చేస్తే పంటలకు నీళ్లు ఇవ్వవచ్చని, అలాగే హైదరాబాద్‌కు నీళ్లు ఇవ్వవచ్చని ఆయన అన్నారు. గతంలో అధికారలంఓ ఉన్న కాంగ్రెస్‌ ఎందుకు ఈ పనిచేయలేదో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. 2007లో ప్రాణహిత ప్రాజెక్టులో రంగారెడ్డి జిల్లాలో టెండర్లు పిలిస్తే 2014 వరకు ఎందుకు పనులు చేయలేదని హరీష్‌ రావు ప్రశ్నించారు. గురువారం ఆయన అసెంబ్లీ విూడియాపాయింట్‌ వద్ద మాట్లాడుతూ కాంగ్రెస్‌ దివాళాకోరు రాజకీయాలు అవలంబిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం చేపడుతోన్న ఇరిగేషన్‌ ప్రాజెక్టులను ప్రతిపక్ష కాంగ్రెస్‌ పదేపదే విమర్శించండంపై మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు.  కాంగ్రెస్‌ నేతలు ప్రభుత్వంపై అవాక్కులు చెవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను విమర్శిస్తున్న కాంగ్రెస్‌ నేతలు వాళ్లు అధికారంలో ఉన్నపడు ఎందుకు పూర్తి చేయలేక పోయారని ప్రశ్నించారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్లే ఇవాళ ప్రాజెక్టులకు ఈ దుస్థితి పట్టిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన తప్పులను తమ ప్రభుత్వం సవరించుకుంటూ ముందుకు పోతోందని వివరించారు. 2014లో కేంద్రంలో, ఏపీలో, మహారాష్ట్రలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉందని మరి అప్పుడు ప్రాణహిత-చేవెళ్ల ఎత్తును 152 విూటర్లకు ఎందుకు పెంచలేక పోయారని నిలదీశారు. ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. వాళ్లకు వాళ్లు ప్రాజెక్టు ఎత్తును 152 విూటర్లుగా ఊహించుకని ఇష్టమొచ్చినట్టు వ్యవహరించారని ధ్వజమెత్తారు. ప్రాణహిత పేరుతో రూ.1400 కోట్ల దొంగ బిల్లులు సృష్టించారని ఆరోపించారు. ఒక ప్రాజెక్టు కడుతున్నపుడు కనీసం సంబంధిత రాష్ట్రం, పొరుగు రాష్ట్రంతో చర్చించాలన్న ఇంగితజ్ఞానం కూడా వాళ్లకు లేదని మండిపడ్డారు. ఇప్పడు తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోన్న జానారెడ్డి, చిన్నారెడ్డి అపుడు కిరణ్‌ కుమార్‌ రెడ్డి సర్కారులో ఉండి ఏంచేశారని నిలదీశారు. ప్రాణహిత ఆలస్యానికి కాంగ్రెస్‌ పార్టీ కారణమని ఆరోపించారు. పదకొండు టిఎంసిలతో పదహారు లక్షల ఎకరాలకు నీటిని ఇవ్వడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిపాదిస్తే సిడబ్ల్యుసి కూడా సందేహాలు వ్యక్తం చేసిందని హరీష్‌ రావు అన్నారు. గతంలో నీళ్లు రాని దేవాదుల ప్రాజెక్టును పాలకులు నిర్మించారని ఆయన అన్నారు.  కోటి ఎకరాలకు సాగు నీరు ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రణాళకి తయారు చేశారని ఆయన అన్నారు.తెలంగాణ ప్రభుత్వం మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ లను రద్దు చేసిందని ,గతంలో కాంగ్రెస్‌ అచ్చంగా మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ లు ఇచ్చారని ఆయన అన్నారు. కమిషన్ల కోసమే కాలువలు తవ్వారని నిజంగా సాగునీరును తేవాలనే ఉద్దేశ్యం వారికి లేదని వివరించారు. చర్చలు లేకుండానే టెండర్లు పిలిచారని ధ్వజమెత్తారు. మహారాష్ట్రతో వ్యూహాత్మకంగా చర్చలు జరిపి సాగునీరు తేవడానికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తోంటే ప్రతిపక్షాలు ఏదేదో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని తెలిపారు.  కాంగ్రెస్‌ పార్టీ తప్పిదం వల్లే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ఆలస్యమైందని విమర్శించారు.  తెలంగాణలోని 16 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీ ఇంజినీరింగ్‌ చేస్తున్నామని చెప్పారు. గోదావరి నదిపై ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్రతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను కాంగ్రెస్‌ పార్టీ విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు.  మహారాష్ట్రతో ప్రాజెక్టుల విషయంలో అనవసరంగా రాద్ధాంతం చేయవద్దని కాంగ్రెస్‌ నేతలకు సూచించారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీళ్ల అందిస్తామని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలో రంగారెడ్డి జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కోసం కేవలం మొబలైజేషన్‌, సర్వేల పేరిట 125 కోట్లు వసూలు చేసి.. అసలు పనులకు మాత్రం రూ. 26 కోట్లు ఖర్చు చేశారని, ఇది రంగారెడ్డి జిల్లాపై కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న ప్రేమ అని ఆయన ఎద్దేవా చేశారు.