‘ప్రోత్సాహం’ పథకానికి జిఎస్‌పిసి సాయం

కాకినాడ, జూన్‌ 27 : తూర్పు గోదావరి జిల్లాలో ప్రతిభావంతులైన పేద విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థిక అవరోధాలు తొలగించేందుకు అమలు చేస్తున్న ‘ప్రోత్సాహం’ పథకానికి వివిధ సంస్థల నుంచి ఆర్ధిక సహాయం అందుతూనే ఉంది. తాజాగా గుజరాత్‌ స్టేట్‌ పెట్రోలియం కార్పోరేషన్‌ (జిఎస్‌పిసి) 50లక్షల రూపాయల నిధులు సమకూరుస్తున్నట్లు ప్రకటించింది. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్‌ నీతూప్రసాద్‌ ధ్రువీకరించారు. ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపిన 86 మంది మత్స్యకార కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఉన్నత విద్య అందించేందుకు ఈ నిధులను జిఎస్‌పిసి సంస్థ అందిస్తోందన్నారు. పేద విద్యార్థుల పట్ల ఔదార్యంతో స్పందించిన జిఎస్‌పిసి సంస్థను జిల్లా కలెక్టర్‌ అభినందించారు. ఇదే తరహాలో జిల్లాలోని మిగిలిన కార్పోరేట్‌ సంస్థలు ముందుకు వచ్చి మరింత పేద విద్యార్థులకు విద్యా ప్రోత్సాహానికి నిధులు అందించాలని విజ్ఞప్తి చేశారు.