ఫలించని చర్చలు
– కొనసాగుతున్న ప్రతిష్టంభన
– నేడు మంత్రి వర్గ ఉపసంఘం మళ్లీ భేటీి
– సమీక్షించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ మే 4 (జనంసాక్షి): తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘంతో ఆర్టీసీ కార్మిక సంఘాల చర్చలు ముగిశాయి. ఆదివారం నాడు సచివాలయంలో జరిగిన ఈ చర్చల్లో కార్మికులు తమకు ప్రభుత్వుద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై చర్చించిన మంత్రివర్గం మరోసారి కార్మికులతో భేటీ కావాలని నిర్ణయించింది. చర్చలకు సంబంధించిన సారాంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిస్తామని ¬ం మంత్రి నాయిని నిర్సింహా రెడ్డి తెలిపారు.
భేటీ అనంతరం మంత్రి నాయిని విూడియాతో మాట్లాడుతూ సానుకూల వాతావరణంలో కార్మికులతో చర్చలు జరిగాయని చెప్పారు. కార్మికులకు అన్యాయం చేయాలని తమ ప్రభుత్వానికి లేదని, కార్మికులు పట్టువిడుపులకు పోవద్దని మంత్రి హితవు పలికారు. చర్చల సారాంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని, సోమవారం ఉదయం కార్మిక సంఘాలతో మరోసారి భేటీ అవుతామని చెప్పారు. కార్మిక సంఘాలు 43 శాతం ఫిట్‌మెంట్ అడుగుతున్నారని, ఫిట్‌మెంట్‌పై కొంతమేర తగ్గాలని కోరామని మంత్రి తెలిపారు. ఆర్టీసీకి ఇస్తే మిగతా కార్పోరేషన్లు కూడా అడుగుతాయని నాయిని పేర్కొన్నారు.
మరోవైపు ఫిట్‌మెంట్ విషయంలో తగ్గే ప్రసక్తే లేదని టీఎంయూ, ఈయూ నేతలు తేల్చి చెప్పారు. మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ అనంతరం టీఎంయూ నేత అశ్వత్థామ రెడ్డి విూడియాతో మాట్లాడారు. సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. కొంతమంది అధికారులు ఫిట్‌మెంట్ పెంచితే చార్జీలు పెంచాలని అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. కార్మికుల సమస్యపై ఆర్థిక మంత్రి ఈటెల సానుకూలంగా ఉన్నారని, ఆయన చొరవతోనే చర్చలు జరిగాయని కార్మిక నేతలు తెలిపారు. సమస్య పరిష్కారంపై తమకు ప్రభుత్వంపై నమ్మకముందని విశ్వాసం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలపై న్యాయనిపులను సంప్రదిస్తున్నామని, న్యాయస్థానంలో తమ వాదనలు కూడా వినిస్తామని అశ్వత్థామ రెడ్డి తెలిపారు.
సమ్మెపై వెంటనే పరిష్కార నిర్ణయం తీసుకుంటం:సీఎం కేసీఆర్
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెను ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వం చర్యలను ప్రారంభించింది. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు వెంటనే పరిష్కార నిర్ణయం తీసుకుంటమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం ఇవాళ మంత్రులతో సవిూక్షను నిర్వహించారు. సమ్మె విషయంలో అన్ని వర్గాలతో చర్చించి ప్రభుత్వానికి తగిన సిఫారుసులు చేయడానికి కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో సభ్యులుగా మంత్రులు ఈటల రాజేందర్, మహేందర్‌రెడ్డి నియమితులయ్యారు. కార్మికులు, ఆర్టీసీ యాజమాన్యం, అధికారులతో చర్చలు జరిపి తగిన సూచనలు చేయాలని సీఎం కేసీఆర్ సబ్‌కమిటీని ఆదేశించారు. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని సామరస్యపూర్వకమైన, సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలని కమిటీని ఆదేశించారు. ఈ అంశంపై కేబినెట్ సబ్‌కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. 43శాతం ఫిట్‌మెంట్ అమలు చేయాలని ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.