ఫెస్‌బుక్‌లో మోదీకి షాక్‌

6

-పెరుగుతున్న అన్‌లైక్స్‌

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 10 (జనంసాక్షి)

ప్రధాని మోదీకి కొంతకాలంగా మద్దతు పలుకుతూ వస్తున్న ఫేస్‌ బుక్‌ వినియోగదారులు.. ఒక్కసారిగా ఆయనకు షాక్‌ ఇచ్చారు. దాదాపు లక్షమంది ఫేస్‌ బుక్‌ యూజర్లు మోదీ ఫేస్‌ బుక్‌ పేజీని అన్‌ లైక్‌ చేశారు. ఇటీవల దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న రైతుల ఆత్మహత్యలు, వివాదాస్పద భూసేకరణ బిల్లుపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. ‘అన్‌ లైక్స్‌’ రూపంలో తమ అసంతృప్తి తెలిపారు. మార్చి నెలాఖరు వరకు 2.79 కోట్ల మంది మోదీ ఫేస్‌ బుక్‌ పేజీని లైక్‌ చేసేవారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన భూసేకరణ బిల్లుకు సవరణలు, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఏప్రిల్‌ 7నాటికి మోదీ ఫేస్‌ బుక్‌ పేజీని లైక్‌ చేసేవారి సంఖ్య 2.78 కోట్లకు పడిపోయింది. దీనిపై బీజేపీ నేషనల్‌ కమ్యూనికేషన్‌ సెల్‌ కన్వీనర్‌ అ రవింద్‌ గుప్తా స్పందించారు. ”ఇది మాపై ఎలాంటి ప్రభావం చూపబోదు. టెక్నికల్‌ సమస్య లేదా.. ఫేస్బుక్‌ చేపట్టే క్లీన్‌ నెస్‌ డ్రెవ్‌ వల్ల ఇలా జరిగి ఉండొచ్చు” అన్నారు. కాగా, లక్షమంది ‘అన్‌ లైక్‌’ చేసినా ఇప్పటికీ ఎక్కువ మంది ఫాలోయర్స్‌ కలిగిన నేతల్లో మోదీ తొలి వరుసలోనే ఉన్నారు.