బంగారు ఆభరణాలు, నగదు దోపిడీ

నెల్లూరు, జూలై 5 : ఒకవైపు పోలీసులు దారిదోపిడీలను, దొంగతనాలను నియంత్రించేందుకు  పెద్ద ఎత్తున చర్యలు చేపడుతుండగా మరోవైపు దొంగతనాలు యథేచ్ఛగా కొనసాగుతుండడం ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం నాయుడుపేట పట్టణంలోని ఓ ఉపాధ్యాయుడు ఇంట్లో  బంగారు ఆభరణాలు, 6 లక్షల నగుదు దోపిడీకి గురైన సంఘటన నుంచి పోలీసులు తేరుకోకపోముందే గత రాత్రి తాజాగా నెల్లూరు నగరంలోని ముడవ నగర పోలీస్టేషన్‌ పరిధిలోగల చిన్నబజార్‌ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు 20 గ్రాముల బంగారు ఆభరణాలు, 50 వేల నగుదును దోచుకువెళ్లారు. ఈమేరకు చిన్నబజార్‌ ప్రాంతానికి చెందిన సుశీల పోలీసులకు చేసిన ఫిర్యాదు ప్రకారం బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో తాము ఇంటికి తాళ్లం వేసి  ఏసీనగర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లి వచ్చామని రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చి చూడగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి దోపిడీకి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. వేలు ముద్ర నిపుణలు సంఘటన స్థలానికి  చేరుకుని ఆధారాలను సేకరించారు. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో అంటే ఒక్క జూన్‌ నెలాఖరు వరకు నెల్లూరు నగరంలోని భక్తవత్సలనగర్‌, ఆటోనగర్‌, చిన్నబజార్‌, గాంధీనగర్‌ వంటి రద్దీగా ఉండే ప్రాంతాలలోనే దొంగతనాలు జరగడం సంచలనం కలిగిస్తోంది. ఒకవైపు శాంతి భద్రతల సమస్యలతో సతమతమవుతున్న  పోలీసులకు తాజాగా విచ్చలవిడిగా జరుగుతున్న దొంగతనాలు పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.