బంగారు తెలంగాణ దిశగా అడుగులు
సాంస్కృతిక పునరుజ్జీవనం మొదలయ్యింది
పరిశ్రమలకు అవసరమైన విద్యుత్, మౌలిక సదుపాయాలు
ఏటా 9వేల చెరువుల్లో మరమ్మతుల లక్ష్యం
ప్రకటించిన విధంగా జలాశయాలన్నీ పూర్తి చేస్తాం
కృష్ణా నుంచి నీటి సరఫరాతో పాలమూరు జిల్లా దాహర్తి తీరుస్తాం
ఇంటింటికీ శుద్ధనీరు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగం
ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రోరైలు నిర్మాణ మార్గాన్ని పొడుగిస్తాం
హైదరాబాద్ నగరంలో వెయ్యి మార్కెట్లు అవసరం
టిఆర్‌ఎస్ ప్లీనరీ వేదికగా సిఎం కెసిఆర్ ప్రసంగం
హైదరాబాద్, ఏప్రిల్ 24 (జనంసాక్షి):
బంగారు తెలంగాణ నిర్మాణదిశగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు, సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలు చేపట్టబోయే కార్యక్రమాలను ఆయన ప్లీనరీ వేదిక ఎల్బీ స్టేడియం నుంచి వివరించారు. టిఆర్‌ఎస్ అధ్యక్షుడిగా 8వ సారి ఆయన ఎన్నికయ్యాక అధ్యక్షోపన్యాసం చేసారు. తెలంగాణ ఉద్యమంలో నాటి జలదృశ్యం నుంచి నేటి జనదృశ్యం వరకు జరిగిన ఘటనలు వివరిస్తూ, ప్రభుత్వం ఏర్పడ్డ తరవాత బంగారు తెలంగాణ లక్ష్యంగా సాగుతున్న తీరును విడమరచి చెప్పారు. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం మొదలయ్యిందన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డలను తలచుకుంటూ వారిపేరు విూద అనేక సంస్థలను పెట్టుకున్నామని అన్నారు. పివి నర్సింహారావును కాంగ్రెస్ కూడా గుర్తించలేదని, ఆయన జయంతిని అధికారికంగా జరుపుకున్నామన్నారు. అలాగే జయశంకర్, కాళోజీ, బాపూజీ తదితరుల పేరువిూద ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయాల గురించి వివరించారు. ఈ మొత్తం క్రమంలో తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టింది తెరాస కార్యకర్తలేనని సీఎం కేసీఆర్ అన్నారు. గల్లీ నుంచి దిల్లీ వరకు పోరాడిన ఘనత కార్యకర్తలదేనన్నారు. గులాబీ కండువా కప్పుకున్న వారిని హేళన చేశారు.. ఎన్నో అవమానాలు ఎదురొడ్డి రాష్టాన్న్రి సాధించుకున్నామన్నారు. రాజ్యాంగబద్దంగా పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామని అన్నారు. ఈ దశలో తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రకటించారు.
అమరవీరుల కుంటుంబాలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని తెలిపారు. ఉమ్మడిరాష్ట్రంలో మనకు బాష రాదని సంసృతి తెలియదని హేళన చేసారని, మనం గోల్కొండలో తొలిసారిగా జాతీయ జెండాను ఎగరవేసినం. బతుకమ్మ బోనాలను రాష్ట్ర పండుగలుగా ప్రకటించుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణ సంస్కృతికి పునర్ వైభవం తెచ్చే పక్రియ కొనసాగుతోందన్నారు. తంగేడుపువ్వను, జమ్మిచెట్టును, పాలపిట్టను, జింకను అధికారిక చిహ్నాలుగా చేసుకున్నామని అన్నారు. గతంలో అధికారంలో ఉన్న వారు ఏనాడూ ఊహించని విధంగా కార్యక్రమాలు చేపట్టి ముందుకు పోతున్నామని అన్నారు. తెలంగాణకు ఏమి అవసరమో, ఏం చేస్తే తెలంగాణ అభివృద్ది చెందుతుందో తమకు తెలుసన్నారు. తెలంగాణ వస్తే విద్యుత్ కోతలతో వ్యవసాయం దెబ్బతిన, పరిశ్రములు మూతపడతాయని ఒకాయన కట్టెపెట్టి చూపాడని పరోక్షంగా ఆనాటి సిఎం కిరణ్ కుమార్ రెడ్డి గురించి చెప్పారు. అయితే పదినెలల్లోనే తెలంగాణలో కరెంట్ కోతలు లేకుండా చేశామన్నారు. గతంలో అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఎండిపోయిన కంకులు, కందిన్లు పట్టుకుని
వచ్చి నిరసనలు చెప్పేవారని, కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. అంటే కరెంట్ కోతలు లేకుండా చేయగలిగామన్నారు. అలా చేస్తే అద్భుతమే అని విపక్షనేత జానారెడ్డి సైతం అన్నారని, తెలంగానలో అద్భుతాలే ఉంటాయని చెప్పానన్నారు. తెలంగాణలో ఆషామాషీ పనులు ఉండవని , అధ్భుతాలే ఉంటాయన్నారు. గతంలో ఎవరూ ఊహించని విధంగా పనుఉల సాగుతాయని అన్నారు. నల్లగొండ జిల్లా దామరచర్ల వద్ద 6600 మెగావాట్ల థర్మల్ పవర్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టామని, దీంతో ఇక కరెంట్ కోతలన్న ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు. దీనికి త్వరితంగా అనుమతులు ఇచ్చినందుకు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కరెంట్ కోతలు ఉండబోవని, అద్భుతమైన పాలసీ రూపొందించామని, మంచి భూమి ప్రోత్సాహం కల్పిస్తున్నామని అన్నారు. అందువల్ల పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్నారు. ఉన్నవారు విస్తరణ చేపట్టాలన్నారు. కోతలు లేకుండా విద్యుత్ అందిస్తున్నాం… అదే మా చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో 24వేల మెగావాట్ల విద్యుదుత్పత్తికి రూ.91,500 కోట్లు ఖర్చవుతోంది. దామరచర్ల వద్ద యాదగిరి నర్సన్న పవర్ ప్లాంట్‌కు 10 రోజుల్లో శంకుస్థాపన చేస్తాను. పరిశ్రమలకు అవసరమైన విద్యుత్, మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. సన్నబియ్యం ఘనత ఈటెలదే
దొడ్డ దొరల పాలనలో హాస్టళ్లకు సన్నబియ్యం కలగానే మిగిలిందని, టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత హాస్టళ్ల పిల్లలకు సన్నబియ్యం పెట్టిన ఘటన ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌దేనని సీఎం తెలిపారు. పేదల గురించి ఆలోచించే వారంతా టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారన్నారు. ఈ ప్రతిపాదన తెచ్చి ఈటెల తనను ఒప్పించారని అన్నారు. దీనివల్ల ఇప్పుడు పిల్లలకు సన్నబియ్యం అందుతున్నాయన్నారు. హాస్టళ్లకు సన్నబియ్యం ఇస్తే అసెంబ్లీ అంతా సంతోషపడింది. ఇక పేదలకు కూడా లెక్క లేకుండా కనీసం ఆరుకిలోల చొప్పున వారికీ సన్నబియ్యం అందచేస్తున్నామని అన్నారు. పేదల కడుపు నిండేలా ఒక్కొక్కరికి 6కిలోల బియ్యం అందిస్తున్నామని, రేషన్ బియ్యం పంపిణీ కోసం రూ.3వేల కోట్లు కేటాయించామన్నారు. గతంలో అంగన్‌వాడీలు జీతాలు అడిగితే గుర్రాలతో తొక్కించారని. కాని తాము అంగన్‌వాడీలను పిలిచి జీతాలు పెంచిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ఆరోగ్య లక్ష్మీ పేరుతో గర్భిణిలకు పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పారు.బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు రావాలి. వెనకబడిన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేశామని చెప్పారు.
ధర్మపురి మొక్కు తీర్చుకుంటా
గతంలో గోదావరి పుష్కరాలు ఆంధ్రాలోనే జరిగేవి. మన దగ్గర గోదావరి ప్రవహించదా.. పుణ్యక్షేత్రాలు లేవా.. నేను అనాడు వాదన తెస్తే తెలంగాణ సమాజం కొంచెం తేటపడ్డది. కొందరు తనను విమర్శించారన్నారు. దీంటలో రాజకీయం ఎందుకని అన్నారు. ఆ పుష్కరాల నుంచి ఈ పుష్కరం వరకు తెలంగాణ రాష్ట్రం సాక్షాత్కారమైంది. జూన్‌లో జరగబోయే గోదావరి పుష్కరాలను కుంభమేళాను తలపించే రీతిలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ధర్మపురి, కాళేశ్వరం, బాసర తదితర క్షేత్రాల వద్ద ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సారథ్యంలో బ్రహ్మాండగా జరుపుకుంటామని అన్నారు. యాదగిరి గుట్టను దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. దీని కోసం కావాల్సిన నిధులు ఇప్పటికే కేటాయించామని చెప్పారు.
హావిూ మేరకు రుణమాఫీ చేశాం
రైతులకు ఇన్‌ఫుట్ సబ్సీడీ రూ.480 కోట్లు ఇచ్చినం. 34 లక్షల మంది రైతలకు లక్షరూపాయల రుణాలు మాఫీ చేసినం. రైతు రుణమాఫీకి రూ. 17 వేల కోట్లు ఖర్చు పెట్టినం. కాళ్ల కింద భూమి కంపించి కాంగ్రెస్, టీడీపీ నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారు. గతంలో కేంద్రం ఇచ్చిన రూ.200 పించన్‌ను కాంగ్రెస్ కిందికి ఇచ్చింది. ఏ ఆసరా లేని పేదవారు రెండు పూటలా తినాలనే ఉద్దేశంతో రూ. వెయ్యి పింఛను ఇస్తున్నామని తెలిపారు. బీడి కార్మికులకు వేయి భృతి ఇస్తున్నామని అన్నారు. ఇలా ప్రతి ఒక్కరిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామని కెసిఆర్ అన్నారు. కాగ్రెస్, తెదేపా బీడీ కార్మికులను ఎప్పుడైనా పట్టించుకున్నాయా అని ప్రశ్నించారు. దళితులకు భూ పంపిణీ అనేది నిరంతర పక్రియ, ప్రతి దళితుడికి భూమి అందించి ఆర్థిక స్వావలంబన చేకూరుస్తామన్నారు. దళితులకు భూపంపిణీ పథకం కింద 2400 ఎకరాలు పంపిణీ చేశామని, మాటలు చెప్పడం, మోసాలు చేయడమే కాంగ్రెస్‌కు అలవాటన్నారు.
బంగారు తల్లి, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు తెచ్చామని, అంగన్‌వాడీ కార్యకర్తలకు రూ.7వేలు, ఆయాలకు రూ.4,500 ఇస్తున్నామన్నారు. కళాకారులను సాంస్కృతిక సారథబిలుగా నియమించాం
బంగారు తెలంగాణ నిర్మాణమయ్యే వరకు కళాకారుల ఆట, పాట డప్పుల మోత ఆగొద్దని రసమయికి సూచించానన్నారు.
మిషన్ కాకతీయతో చెరువులకు మహర్దశ
మిషన్ కాకతీయతో చెరువలకు మహర్దశ పట్టబోతోందన్నారు. కాతీయ రెడ్డిరాజులు, గోల్కొండ నవాబులు చెరువులను అందిస్తే వాటిలో తట్టెడు మట్టి కూడా ఎత్తి పోయలేదన్నారు. ఏటా 9వేల చెరువుల్లో మరమ్మతులు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాం, ప్రకటించిన విధంగా జలాశయాలన్నీ పూర్తి చేసి తీరుతామన్నారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులారా విూకు సోయి లేదు కాబట్టే చెరువులను పట్టించుకోలేదు. మాకు ముందు చూపు ఉంది కాబట్టే మిషన్ కాకతీయ చేపట్టాం. నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నాయకత్వంలో మిషన్ కాకతీయ పనులు బ్రహ్మాండంగా సాగుతున్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు చెరువులు బాగు చేసే పనిలో ఉన్నరు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ఎత్తి వేస్తున్నట్లు కొన్ని ఆంధ్రా పత్రికలు విషం కక్కుతున్నాయి. ఆ ప్రాజెక్టును ఎత్తివేయం. దానికదే కొనసాగుతుంది. కాళేశ్వరం వద్ద మరో ప్రాజెక్టును కట్టుకుంటామని తెలిపారు. రాబోయే నాలుగేళ్లలో ఒక్క ప్రాజెక్టు పెండింగ్‌లో ఉండదు. ఎస్సెల్‌బీసీతో సహా ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులన్నీ ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని ప్రకటించారు. కృష్ణా నుంచి నీటి సరఫరాతో పాలమూరు జిల్లా దాహర్తి తీరుస్తామన్నారు. ఇంటింటికీ శుద్ధనీరు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని బాజాప్తా చెప్పిన పార్టీ ప్రపంచంలో లేదన్నారు. వచ్చే ఐదేళ్లలో ఇంటింటికీ నీళ్లు ఇస్తం. మంచి నీళ్లు ఇవ్వేలేని పక్షంలో ఓట్ల అడగమని దైర్యంగా చెప్పిన ఏకైక పార్టీ టీఆర్‌ఎస్ అని ప్రకటించారు. తెలంగాణ డ్రింకింగ్ వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు అద్భుతంగా రూపుదిద్ధుకుంటుంది. వాటర్ గ్రిడ్‌ను విమర్శించే కాంగ్రెస్ నాయకులారా విూరు ఇన్ని రోజులు ఎందుకు మంచినీళ్లు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు చేయరు. చేసేవాళ్లను చేయనియ్యరని సీఎం ఎద్దేవా చేశారు.
ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రోరైలు నిర్మాణ మార్గాన్ని పొడుగిస్తామన్నారు. మరిన్ని ప్రాంతాలకు దీనిని విస్తరించే ఆలోచన ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో వెయ్యి మార్కెట్లు అవసరం హైదరాబాద్ అభివృద్ధి ఘనత మాదేనని చెప్పుకునేవాళ్లు సిగ్గుపడాలి. వానపడితే కార్లు పడవలైతున్నయన్నారు. నిజాం కాలంనాటి డ్రైనేజీ వ్వయస్థ కూడా ధ్వంసం చేసారని మండపిడ్డారు. ఇక రూ. 6వేల 500 కోట్ల భారం పడ్డా ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చినం. కళాకారులందరికీ సాంస్కృతిక సారధులుగా
గుర్తించి గౌరవించినం. లాయర్ల సంక్షేమం కోసం రూ.100 కోట్లు, జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ. 10 కోట్లు కేటాయించామని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి ఘనత మాదేనని చెప్పుకునేవాళ్లు సిగ్గుపడాలి
ప్లీనరీ సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర పాలనలో తనకు ప్రజలే ‘బాస్’లు అని ప్రశంసించారు. లాఠీ దెబ్బలు తిన్నారు.. జైళ్లకు వెళ్లారు. తెలంగాణ కోసం పాటుపడ్డారు.
కష్టంలో భాగమైన ప్రతి ఒక్కరినీ కృతజ్ఞతలు అంటూ 2001 లో పార్టీ ప్రారంభమైనప్పుడు నేను ఒక్కడినే.
తర్వాత లక్షల మంది వచ్చి చేరారన్నారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా నాతో కలిసి పని చేశారు.
ఉద్యమాలతో ప్రారంభమైన పార్టీని నిలబెట్టింది మాత్రం ప్రజలే. పార్టీకి అధ్యక్షుడినే అయినా ప్రతి ఒక్క కార్యకర్త సలహాని స్వీకరించాం.ఎన్నో జయాలు చూశాం.. అపజయాలూ చూశాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా 14 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతూనే ఉన్నారు. పోరాటం అంటే ఎన్నడూ వెన్ను చూపలేదు మన ప్రజలు.ఎన్ని కష్టాలొచ్చినా ఉద్యమాన్ని వీడలేదు. అందుకే వారికి రుణపడి ఉన్నానని వారి రుణాన్ని తీర్చుకుంటానని కెసిఆర్ అన్నారు.