బడ్జెట్‌ అంకెల గారడీ

4

– అభూత కల్పనలు

– ప్రజాస్వామ్య ముసుగులో నియంతృత్వ పాలన

– విపక్షనేత జానారెడ్డి

హైదరాబాద్‌,మార్చి16(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంతా గందరగోళంగా, అంకెల గారడీగా ఉందని కాంగ్రెస్‌ సభాపక్షనేత జానారెడ్డి అన్నారు. ఇదో అభూత కల్పనగా ఉందన్నారు. శాసనసభలో బడ్జెట్‌పై చేపట్టిన చర్చను ఆయన ప్రారంభించారు. బడ్జెట్‌ తీరుపై తాను ఆవేదన చెందుతున్నట్లు చెప్పారు. బడ్జెట్‌ కేటాయింపులన్నీ ఆవేశంగా చేస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు.  తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఆశలపల్లకిలో ఊరేగుతున్నట్లు ఉందని  వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం అంకెలతో ఆటలాడుకుంటోంది… మాటలతో గారడి చేస్తోందని మండిపడ్డారు. ప్రజలను భ్రమింపజేయాలని నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. మూడోసారి అవగాహనరాహిత్యంతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారన్నారు. బడ్జెట్‌ అంతా గందరగోళంగా ఉందని తెలిపారు. తెలంగాణ ఏర్పడితే ఒక నూతన సంప్రదాయం ఏర్పడుతుందని, దేశంలోనే మంచి రాష్ట్రం అవతుందనుకుంటే పరిస్థితులు భిన్నంగా ఏర్పడుతున్నాయని .జానారెడ్డి అన్నారు. శాసనసభలో బడ్జెట్‌ పై చర్చలో ఆయన మాట్లాడారు.శాసనసబలో ఇతర పార్టీలవారిని చేర్చుకోవడం, ఇతర పార్టీలు లేకుండా చేయాలని జరుగుతున్న ప్రయత్నం ప్రజాస్వామ్య విరుద్దంగా ఉందని అన్నారు. ప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వం మంచిది కాదని అన్నారు. మిషన్‌ కాకతీయలో కేటాయింపులన్నీ ఖర్చు చేయడం లేదని జానారెడ్డి పేర్కొన్నారు. ఇంతటి ఊహాజనిత బడ్జెట్‌ను గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఎన్నికల సమయంలో అనేక హావిూలతో వివిధ పార్టీలు ప్రజల్లోకి వెళ్లాయని జానారెడ్డి అన్నారు. నూతన ఒరవడితో ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడుతుందని ప్రజలు ఆశించారని… ఆ విశ్వాసంతేనే ప్రజలు తెరాసను ఆదరించారన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా నడిచే పార్టీకే తాము సహకరిస్తామని… అలా కాని పక్షంలో ప్రతిపక్షంగా తమ పాత్ర నిర్వహిస్తామన్నారు. పాలనలో లోపాలను తెలియజేసి సరైన మార్గంలో వెళ్లేలా ఒత్తిడి తీసుకొస్తామని జానారెడ్డి అన్నారు.కాంగ్రెస్‌ పార్టీ నేత జానారెడ్డి తెలంగాణ అసెంబ్లీలో నవ్వులు పూయించారు. బడ్జెట్‌ అంటేనే సాధారణంగా గందరగోళ అంశమని, అలాంటి బడ్జెట్‌ లెక్కలను చేతులకు ఇచ్చి మంత్రి ఈటల రాజేందర్‌ మరింత గందరగోళంలో పడేశారని అన్నారు. ఈ లెక్కలు చాలా జాగ్రత్తగా ఎమ్మెల్యేలు చదువుకోవాలని చెప్పారు. దీంతో అందరూ నవ్వారు. సభలో చాలామంది సభ్యులు లేరు. మంత్రులు ఎవరు లేరు. మండలికి పోయినరా అని చక్కగా తెలంగాణ మాండలికంలో మాట్లాడుతూ సభలో నవ్వులు విరభూయించారు. తాను ఎంతమేరకు అంచనా వేసి చెప్పానో అంతమేరకే ఈటల బడ్జెట్‌ కేటాయింపు చేశారని అన్నారు. మిషన్‌ కాకతీయ నిధుల విషయంలో కూడా అదే జరిగిందని తెలిపారు. తాను పారదర్శకంగా ఉంటానని, అలాంటి పాలనను అందించాలని కోరుకుంటానని జానా అన్నారు. ఈటల బడ్జెట్పై చిన్న కవిత లాంటిది కూడా జానా చదివారు. బడ్జెట్‌ అంకెలతో ఆటపట్టించారని, లెక్కలతో గారడీ చేశారని, ప్రజలను భ్రమింపజేయడానికి ప్రయత్నించారని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే చాలా మార్పు వస్తుందని ప్రజలు ఆశించారని  జానారెడ్డి అన్నారు. ఆ విధంగానే కొత్తగా ఏర్పడిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందుకుపోవాలని సూచించారు. గతంలో అనేక పార్టీలు అధికారంలోకి వచ్చాయన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ తమ ఆకాంక్షలను నెరవేరుస్తుందని ప్రజలు పట్టంకట్టారని, దాన్ని తాము కూడా స్వాగతించామని చెప్పారు. ప్రజలు ఆశించినట్లుగా ప్రభుత్వ పనిచేస్తే సహకారం ఇస్తామని, లేదంటే ప్రజల పక్షాన ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేస్తామని తెలిపారు. ఈ రాష్ట్రంలో మరో పార్టీ ఉండకూడదని

పలువురు మంత్రులు మాట్లాడతారని, అసలు అలా ఎలా మాట్లాడుతారని, ఇలా చేయడానికి వచ్చారా, లేక ప్రజలకోసం వచ్చారా అని ప్రశ్నించారు. ఎన్నికలు ఉన్నా లేకపోయినా అవే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారని నిలదీశారు. ప్రజాస్వామ్య ముసుగులో ఇది నియతృత్వం అని అన్నారు. అయినా సర్దుకుపోతున్నామని చెప్పారు. వారెన్ని మాట్లాడితే అంతకు రెట్టిపు మాట్లాడగలం అని, కానీ దానివల్ల ఏం ప్రయోజనం కలుగుతుందని ప్రశ్నించారు. ఏపీ అసెంబ్లీలో ఉన్న లొల్లి మాదిరిగా తెలంగాణ అసెంబ్లీలో ఉండకూడదని సంయమనంతో వ్యవహరిస్తున్నామని జానారెడ్డి అన్నారు. పక్క శాసనసభలో జరుగుతున్న తీరును గమనించాలని,తాము ఆ పరిస్థితిని సృష్టించడం లేదని అన్నారు. తెలంగాణలో మరో పార్టీ ఉండరాదనే భావన మంచిదేనా అని జానారెడ్డి అన్నారు.