బడ్జెట్ అంకెల గారడీ..ఉత్తమ్
హైదరాబాద్,మార్చి11(జనంసాక్షి): ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర ప్రజలను అగౌరవపర్చేలా ఉందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఇది ఆచరణ సాధ్యం కాని బడ్జెట్ అని అంకెల గారడీతో ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హావిూల మేరకు కేటాయింపులు చేపట్టలేదన్నారు. వివిధ రంగాలకు హావిూలు గుప్పించి ఇప్పుడు వాటి ప్రస్తావన కూడా చేయలేదన్నారు. బుధవారం గాంధీ భవన్‌లో విూడియాతో మాట్లాడిన ఆయన.. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2015-16 బడ్జెట్‌పై విమర్శలు గుప్పించారు. ఎలాంటి ముందస్తు కసరత్తు చేయకుండా బడ్జెట్ రూపొందించారని ఉత్తమ్ ఆరోపించారు. ఇది టీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. బడ్జెట్ ప్రసంగంలో దళితులకు మూడు ఎకరాల భూమి ఊసే లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు సరిగా ఖర్చు చేయలేదని ఉత్తమ్ కుమార్ ఆరోపించారు. ప్రభుత్వం ప్రవేశపట్టిన బడ్జెట్ చంద్రబాబుని కాపీ కొట్టినట్లుగా ఉందని, ఏపీలో లక్ష కోట్ల బడ్జెట్ పెట్టారు కాబట్టి ఇక్కడా లక్ష కోట్ల బడ్జెట్ పెట్టినట్లుందని వ్యాఖ్యానించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మొదలుకుని ఇతర రంగాలకు కేటాయింపులు చేయలేదన్నారు.