బయ్యారం ఉక్కు – జిల్లా ప్రజల హక్కు
ఖమ్మం, అక్టోబర్ 30 : బయ్యారం ఉక్కు- ఖమ్మం జిల్లా ప్రజల హక్కు అని ప్రభుత్వ రంగంలో బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించాల్సిందే నని ఎఐటియుసి జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ డిమాండ్ చేశారు. ఎఐటియుసి, ఎఐవైఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం నాడు జరగనున్న కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని కోరారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తే ప్రత్యక్ష్యంగా, పరోక్ష్యంగా లక్ష్యలాది కుటుంబాలు ఉపాధి పొందుతాయని అన్నారు. ఖమ్మం అర్బన్ మండలం నెలకొండపల్లి, బయ్యారం, గార్లా తదితర మండలాల్లోని 1.25 లక్షల ఎకరాల్లో అపారమైన ఇనిప ఖనిజం ఉందన్నారు. ఇటీవల సిఎం పర్యటన సందర్భంగా పరిశ్రమ స్థాపన గురించి వినతి పత్రం అందించామని దానికి ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. జిల్లాకు చెందిన మంత్రి, ఉప సభాపతిల నిర్లక్ష్యం కారణంగానే ఉక్కు కర్మాగారం నిర్మాణానికి నోచుకోలేదని విమర్శించారు. 31న జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడం ద్వారా జిల్లా ప్రజల కోరికను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.