బర్డ్ ఫ్లూ వచ్చింది..జరభద్రం!
రాజధాని శివారు హయత్‌నగర్‌లో వ్యాధి లక్షణాలు
నిర్థారించిన భోపాల్‌లోని పరిశోధనా సంస్థ
2 లక్షల కోళ్ల వధ, పూడ్చివేత
చికెన్, గుడ్లు తినొద్దని అధికారుల సూచన
అప్రమత్తంగా ఉండకుంటే ప్రమాదం
హైదరాబాద్, ఏప్రిల్15(జనంసాక్షి): తెలంగాణలో బర్డ్‌ఫ్లూ వ్యాధి వ్యాపించింది. రాజధాని శివారురోని హయత్ నగర్ ప్రాంతంలో కోళ్లకు బర్డ్‌ఫ్లూ లక్షణాలున్నట్లు నిర్ధారణ అయ్యింది. హయత్‌నగర్ మండలం తొర్రూరు గ్రామంలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు అధికారులు ధ్రువీకరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండకుంటే వ్యాధి సోకే ప్రమాదం ఉంది. ప్రస్థుతానికి కొంత కాలం వరకు కోళ్లు, గుడ్ల జోలికెళ్లకుంటే మంచిది. వ్యాధి పట్ల జర జాగ్రత్త వహించాలి. తొర్రూరు గ్రామానికి చెందిన కోళ్ల ఫారాల్లో.. వారం రోజులుగా కోళ్లు చనిపోతుండటంతో యజమానులు వెటర్నరీ డాక్టర్లను సంప్రదించారు. చనిపోయిన కోళ్ల నమూనాలను వైద్యులు పరీక్షల నిమిత్తం భోపాల్‌కు పంపించారు. ఈ కోళ్లకు ‘బర్డ్ ఫ్లూ’ సోకినట్లు నిపుణులు నిర్ధారించారు. దీంతో రంగారెడ్డి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తొర్రూరు గ్రామానికి పది కిలోవిూటర్ల పరిధిలో కోళ్లు, గుడ్ల ఉత్పత్తి ఆపేయాలన్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఎవరూ చికెన్, గుడ్లు తినవద్దని హెచ్చరికలు జారీ చేశారు. బర్డ్ ఫ్లూ సోకినట్లు గుర్తించిన ఫారానికి కిలోవిూటర్ దూరంలోని అన్ని కోళ్ల ఫారాల్లో దాదాపు 2 లక్షల కోళ్లను చంపేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు ఇతర ప్రాంతాలకు ఫ్లూ సోకిందా లేదా అనే విషయంపై కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు. కోళ్ల ఫారాల యజమానులతో మాట్లాడుతున్నారు. మరోవైపు హయత్‌నగర్‌తోపాటు కందుకూరు, యాచారం, ఇబ్రహీంపట్నం, సరూర్‌నగర్ మండలాల నుంచే హైదరాబాద్‌కు ఎక్కువగా కోళ్లు, గుడ్లు సరఫరా అవుతాయి. దీంతో ఆ ప్రాంతాల్లో పరిస్థితి పైనా అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. శాంపుల్స్ తీసుకుని భోపాల్‌కు పరీక్ష కోసం పంపుతున్నారు.
పక్షులలో వ్యాపించే ప్రాణాంతక ఎవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌కు మరోపేరు ‘బర్డ్‌ఫ్లూ హెచ్5ఎన్1’. పక్షులలో వేగంగా వ్యాపించే ఈ వైరస్ మనుషులకు సోకడం అరుదు. పౌల్ట్రీలలో పనిచేస్తున్న వారికి, పెంపుడు పక్షులతో సన్నిహితంగా మెలిగే వారికి వైరస్ సోకే ప్రమాదం ఉంది. వైరస్ సోకిన వ్యక్తి ద్వారా ఇతరులకు వ్యాపించే ప్రమాదం చాలా తక్కువ. ఇది సోకితే.. తీవ్రమైన జ్వరం, ఒళ్లు, కండరాల నొప్పులు, శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడడం, దగ్గు, గొంతు నొప్పి తదితర లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి ముదిరితే న్యుమోనియాకు దారితీస్తుంది. బర్డ్‌ఫ్లూ బాధితుల చికిత్సలో యాంటీ వైరల్ ట్రీట్‌మెంట్‌తోపాటు అవసరమైతే ఇంటెన్సివ్ సపోర్ట్ అందించాల్సి ఉంటుంది. ఫౌల్ట్రీలు, పెంపుడు పక్షులకు వ్యాక్సిన్లు వేయించడం ద్వారా వ్యాధిని అదుపు చేసే అవకాశం ఉంది. బర్డ్‌ఫ్లూ పట్ల అప్రమత్తమైన పశుసంవర్థక శాఖ ఇప్పటికే నివారణ చర్యలు చేపట్టింది. ఈ వ్యాధి ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు, సూచనలు చేసింది. హైదరాబాద్ చుట్టూ రంగారెడ్డి జిల్లాలో ప్రస్థుతం దాదాపు 48.83 లక్షల కోళ్లున్నాయి.
బర్డ్ ఫ్లూ ప్రభావం మనుషులపైనా ఉంటుంది. కానీ ఇప్పటి వరకు మనుషుల్లో ఈ వ్యాధికి సంబంధించి ఎలాంటి లక్షణాలు బయటపడలేదు. కోళ్ల ఫారాల యజమానులు, పెంపకం రైతులు, చికెన్ షాప్ యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉంటే వ్యాధి వ్యాప్తి చెందకుండా నివారించొచ్చు. బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిన కోళ్లలో ముక్కు, నోటి నుంచి ద్రవాలు కారుతూ సాధార ణ జలుబు లక్షణాలు, తల కొప్పు, వాటిల్స్ నీలం రంగుగా మారటం, కాళ్ల విూద వాపు వచ్చి ఎర్రగా మారతాయి. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పచ్చగా విరేచనాలు, రక్తంలా ద్రవాలు నోటి నుంచి ముక్కు నుంచి కారతాయి. కోళ్ల ఫారంలో, చికెన్ షాపులలో పనిచేసే వ్యక్తులకు వ్యాధి సోకిన కోళ్ల పెంట ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫారం యజమానులు తగు చర్యలు తీసుకుంటే వ్యాధిని అరికట్టవచ్చు. వ్యాధి సోకిన మనుషులలో అయితే సాధారణ జలుబు లక్షణాలుండి జ్వరం వస్తుంది. కోళ్ల మాంసం విక్రయదారులు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిన ప్రాంతాల నుండి కోళ్లను దిగుమతి చేసుకోవద్దు. కోళ్లను నిరంతరం గమనిస్తూ ఉండాలి. బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. ఫారంలో పని చేసే వ్యక్తులు పరిసరాలు, వాహనాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చికెన్ షాప్ వ్యర్థాలను సక్రమంగా కాల్చివేయడం లేదా బొంద తీసి పాతి పెట్టాలి. షాప్‌లో పని చేసే వ్యక్తులు, కోళ్లను తీసుకువచ్చే వాహనాలతోపాటు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.