బలిదానాలపై ఏం చెప్తారు?

ఉత్తరాఖండ్‌లో ప్రకృతి సృష్టించిన పెను ప్రళయం ధాటికి సర్వం కోల్పోయి తెగిన గాలిపటాల్లా చెట్టుకొకరు, పుట్టకొకరు అయిన తెలుగువాళ్లను స్వస్థలాలకు తరలించామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గొప్పగా చెప్పుకుంటున్నారు. ప్రత్యేక విమానాదాల ద్వారా ఉత్తరాఖండ్‌ యాత్రికులను హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాలకు చేర్చి వారి కన్నీళ్లు తుడిచారు. పెను విషాదంలో చిక్కుకున్న వారికి ఓదార్పునిచ్చారు. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. వేల కిలోమీటర్ల దూరంలో విరిగిపడుతున్న కొండచరియలు, హోరెత్తుతున్న నదుల ప్రవాహాలు, ఎముకలు కొరికే చలి, అడుగుతీసి అడుగు వేసేందుకు అనువుగా లేని పరిస్థితులు, ఆనవాళ్లు లేని రహదారులు, తిండి లేదు.. దప్పిక తీర్చుకుందామంటే గుక్కెడు నీరు దొరకదు.. చుట్టూ తమ వంటి అభాగ్యులే ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్న వారిని ఎవరు ఆదుకున్నా వారు అభినందనీయులే. అయితే ఇక్కడ టీడీపీ అవలంబించింది ఫక్తు ఎన్నికల ఫార్ములా. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ అంశాన్ని తమకు లబ్ధి చేకూర్చేది తనకు అనుకూలంగా ఉన్న మీడియా ద్వారా ప్రమోట్‌ చేయించే పనిలో ఉంది తెలుగుదేశం పార్టీ. రాజకీయ పార్టీగా ఆ ప్రయత్నాలను తప్పు బట్టడం లేదు. కానీ తెలంగాణ విషయంలో టీడీపీ అనుసరిస్తున్న దుర్మార్గపు వైఖరినే ఈ సందర్భంగా నిలదీస్తున్నారు పది జిల్లాల ప్రజలు. ఉత్తరాఖండ్‌లో దయనీయ పరిస్థితుల్లో చిక్కుకున్న తెలుగువారిని ఆదుకునేందుకు ప్రాంతాలకతీతంగా చేయూతనిస్తున్నారు. ఎవరికి తోచిన రీతిలో వారు సాయమందిస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ తెలంగాణపై చూపే వివక్షను మాత్రం ఎత్తిచూపుతూనే ఉన్నారు. ఇది సమయం కాకున్నా సరే ఇప్పుడే ప్రశ్నించి తీరాలనే దృఢచిత్తంతో ఉన్నారు. అందుకు సీమాంధ్ర పార్టీలు గతంలో తెలంగాణపై అనుసరించిన నిర్లక్ష్యపూరిత వైఖరే కారణం. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న రోజుల్లో ఒక్క వేదికపై నుంచి తెలుగుదేశం పార్టీ గొంతెత్తి జై తెలంగాణ అనలేదు. టీ టీడీపీ ఫోరం పేరిట తెలంగాణ నేతలు మినహా ఆ పార్టీ అధినేతగా ఉన్న చంద్రబాబునాయుడు ఒక్కటంటే ఒక్కరోజు తెలంగాణ ఉద్యమకారులకు కనీసం సంఘీభావం చెప్పే ప్రయత్నం చేయలేదు. ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసుల దమనకాండ సాగినపుడు కనీసం ఖండించలేదు. విద్యార్థులపై రబ్బరు బులెట్లు ప్రయోగించినప్పుడు, బాష్పవాయు గోళాలు కొట్టి గాయపర్చినపుడు, ముళ్లకంచెల్లో పడేసి లాఠీలు విరిగేలా కొట్టినప్పుడు, పోలీసులు ఇనుప బూట్లతో తొక్కినప్పుడు ఈ చంద్రబాబునాయుడు స్పందించలేదు. పెదవి విప్పి మాట మాట్లాడలేదు. పోలీసుల చర్యను కనీసం ఖండించలేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష సరైనేదనని పేర్కొనలేదు. 2009 డిసెంబర్‌ 9న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించగానే చంద్రబాబు అడ్డం తిరిగారు. ఎవరిని అడిగి అర్ధరాత్రి తెలంగాణపై నిర్ణయం తీసుకున్నారంటూ నిలదీశారు. తన పార్టీలోని తన సామాజికవర్గ ప్రజాప్రతినిధులతో పాటు కాంగ్రెస్‌ పార్టీ వారిని కూడగట్టి స్పీకర్‌ ఎదుట క్యూ కట్టించి మరీ రాజీనామాలు చేయించారు. తర్వాత అన్ని పార్టీల సీమాంధ్ర ప్రతినిధులు బాబు మార్క్‌ రాజీనామాలను కాపీ కొట్టారు. తర్వాత సీమాంధ్ర ప్రాంతంలో పెట్టుబడిదారులు నిర్మించిన స్పాన్సర్డ్‌ ఉద్యమం 12 రోజుల పాటు అతికష్టమ్మీద సాగింది. దానిని సీమాంధ్ర మీడియా చిలువలు పలువలు చేసి చూపించి రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందంటూ అభద్దపు ప్రచారాన్ని వల్లెవేసింది. ఫలితంగా కేంద్రం ఇచ్చిన ప్రకటనను వెనక్కు తీసుకుంది. ఆ రోజు మొదలైన సీమాంధ్ర కుఠిల రాజకీయాలు ఇంకా కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర ప్రాంతంలో సంభవించే విపత్తులపై స్పందించిన విధంగా తెలంగాణ ప్రజలకు కలిగే కష్టనష్టాలపై మాట్లాడటం లేదు. నీలం తుపాన్‌ బాధితుల ఇళ్లకు, చేలకు వెళ్లి పరామర్శించిన బాబు అదే తుపాన్‌లో నష్టపోయిన తెలంగాణ రైతాంగాన్ని మాత్రం పట్టించుకున్న పాపానపోలేదు. చంద్రబాబు, సీమాంధ్ర పెట్టుబడిదారుల అడ్డగోలు ప్రకటనలతో గుండె చెదిరి వేయికి పైగా తెలంగాణ విద్యార్థులు, యువత ఆత్మబలిదానాలు చేసుకున్నారు. మేధావుల పురిటిగడ్డగా చెప్పుకునే ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో మరణ మృదంగం మార్మోగింది. ఉజ్వల భవిష్యత్‌ ఉన్న విద్యార్థులెందరో తమను తాము దహించుకొని జై తెలంగాణ అని నినదిస్తూ ఆత్మ బలిదానం చేశారు. ఉరికొయ్యలపై వేలాడారు. కానిస్టేబుల్‌ కిష్టయ్య సర్వీస్‌ తుపాకీతో కాల్చుకొని తెలంగాణ కోసం ప్రాణాలర్పించారు. పది జిల్లాల్లో యువత కేంద్రం తీరును నిరసిస్తూ, సీమాంధ్రుల కుట్రలు భరించలేక బలిదానం చేసుకున్నారు. వారిలో ఏ ఒక్కరి శవాన్ని చంద్రబాబు చూడలేదు. ఏ ఒక్క కుటుంబాన్ని ఓదార్చలేదు. కనీసం సానుభూతి తెలుపలేదు. చేతికందివచ్చిన బిడ్డలను కోల్పోయిన రోదిస్తున్న తల్లులెవ్వరికీ నేనున్నాననే భరోసా ఇవ్వలేదు. తెలంగాణ కోసం చేసుకున్నవి బలిదానాలే కావనే అర్థం ధ్వనించేలా తన మంది మాగదులు అవాకులు చెవాలకులు పేలుతుంటే కనీసం వారించే ప్రయత్నం చేయలేదు. తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజల ఆకాంక్షను అగౌరవ పరిచేలా టీడీపీ శ్రేణులు విపరీత ప్రయత్నాలు సాగించినప్పుడు ఇవేమిటని నిలదీయలేదు. ఎందుకంటే ఆయనకు తెలంగాణ ప్రజలంటే ఓట్లేసే యంత్రాలు తప్ప ఇంకేమి కాదు. వారి ప్రాణాలకు విలువ లేదు. ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న బాధితులను ఆదుకోవడంలో టీడీపీ చేసిన బురద రాజకీయం అందరికీ తెలిసిందే. కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు మాత్రం కనీస ప్రయత్నాలు చేయలేదు. అలాంటి పార్టీని, ఆ పార్టీ అధినేతను తెలంగాణ ప్రజలు ఎలా ఆదరించాలో టీ టీడీపీ నేతలు చెప్పరు. ప్రశ్నించే వారిపై ఎదురుదాడికి దిగడం.. తామే వీర తెలంగాణవాదులం అంటూ బిల్డప్‌ ఇవ్వడం మినహా టీ టీడీపీ తెలంగాణ కోసం చేసిన ప్రయత్నాలేమీ లేవు. పార్టీ వేదికపై తెలంగాణ తీర్మానం చేశామని చెప్తూ ఓట్లు కొళ్లగొట్టే ప్రయత్నం చేస్తుంది. నిజంగా టీడీపీకి తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబుతో జై తెలంగాణ అనిపించాలి. తెలంగాణ ప్రజల ఆకాంక్ష సాకారం అయేందుకు చేసే పోరాటంలో ముందుండేలా చూడాలి. అవి చేయనంతకాలం టీడీపీని సీమాంధ్ర పక్షపాత పార్టీగా చూడాల్సి వస్తుంది.