బస్సులోనే ప్రయాణీకులతో ఆర్టీసీ ఎండి భేటీ
విజయనగరం జూన్ 30 : నష్టాల బాటలో నడుస్తున్న ఆర్టీసీని సమగ్రంగా సంస్కరించాలన్న ఆలోచనతో ఆర్టీసీ నూతన మేనేజింగ్ డైరెక్టర్ ఎ.కె. ఖాన్ సమగ్ర చర్యలకు తెరతీశారు. దీనిలో భాగంగా గతంలో ఏ మేనేజింగ్ డైరెక్టర్ చేయని విధంగా ఆయన అన్ని వర్గాల వారితో సమావేశం అవడమే గాక ఓ సాదాసీదా బస్సులో విజయనగరం నుంచి విశాఖ వరకు ప్రయాణించి ప్రయాణీకులతో సంభాషించారు. సమస్యలను తెలుసుకున్నారు. శనివారం ఉదయం జిల్లా కేంద్రానికి చేరుకున్న ఖాన్ ఇక్కడి ప్రాంతీయ వర్క్‌షాప్, శిక్షణా కేంద్రం , ఆర్టీసీ డిపోలు, కాంప్లెక్స్‌తో సహ అన్నింటిని పరిశీలించారు. ముఖ్యంగా విచారణ కేంద్రంలో కూడా కూర్చొని పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో గమనించారు. అన్ని చోట్ల ప్రయాణీకులు, కార్మికులు, ఉద్యోగులతో మాట్లాడి అవగాహన పెంచుకున్నారు. పనిలో పనిగా 12 మంది ఉత్తమ డ్రైవర్లకు, కండక్టర్‌లకు అవార్డులను అందజేయడమే గాక ఇద్దరు డ్రైవర్ల పనితీరును ప్రశంసించి వెయ్యి రూపాయిల చొప్పున తన సొంత డబ్బును బహుమతిగా అందజేశారు. విజయనగరం నుంచి బయలుదేరిన 211 బస్సులో విశాఖ వరకు వెళ్ళిన ఆయన ప్రయాణీకుల నుంచి సలహాలను స్వీకరించారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ ఆర్టీసీని అభివృద్ధి చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని, ముఖ్యంగా అన్ని ప్రాంతాలలో పర్యటించి పరిస్థితిని అధ్యాయనం చేస్తున్నట్లు చెప్పారు. పర్యటనలో ఆయన వెంట ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌లు అరవింద్, రామకృష్ణ,స్థానిక ఆర్‌ఎం గిడుగు వెంకటేశ్వరరావు, అధికారులు వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.