బాధ్యులపై చర్యలు తీసుకుంటాం

4

– గాయపడ్డ మెడికోలను పరామర్శించిన మంత్రి లక్ష్మారెడ్డి

– వైద్య విద్యార్థుల మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్‌

విజయవాడ,మార్చి15(జనంసాక్షి):విజయవాడ సవిూపంలోని గొల్లపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వైద్య విద్యార్థులను తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి పరామర్శించారు.విజయవాడ సవిూపంలోని గొల్లపూడి వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్‌ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు, ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ మృతి చెందారు. మరో 17 మంది విద్యార్థులకు తీవ్రగాయాలైన విషయం తెలిసిందే.గొల్లపూడిలోని ఆంధ్రా ఆసుపత్రికి చేరుకున్న మంత్రి వివిధ వార్డుల్లో, ఐసీయూలో చికిత్స పొందుతున్న 31 మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.  ప్రభుత్వాసుపత్రి మార్చురిలో ఉన్న వైద్య విద్యార్థుల మృతదేహాలను పరిశీలించి, మృతుల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ఉస్మానియా మెడికల్‌ కాలేజీ విద్యార్థులు స్పోర్ట్స్‌ కోసం అమలాపురం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని  తెలిపారు. గాయపడిన వారికి వైద్య ఖర్చులను పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేశారు. జరిగిన ప్రమాదంపై విచారణ జరిపించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు చెట్టుకు ఢీకొని ఈ ఘటన జరిగిందని చెప్పారు. ప్రస్తుతం ఆరుగురు విద్యార్థులు ఐసీయూలో ఉన్నారని, మరో ఇద్దరు విద్యార్థులకు సర్జరీలు జరిగాయని ఆయన వెల్లడించారు. ఇప్పటికీ ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని, చనిపోయిన విద్యార్థులను ఆదుకోవడానకి సీఎం కేసీఆర్‌ తో మాట్లాడి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన వివరించారు. స్పోర్ట్స్‌ ఈవెంట్‌ సజావుగానే సాగిందని, చివర్లో ట్రావెల్స్‌ అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందన్నారు. వైద్యులు అనుమతిస్తే విద్యార్థులను హైదరాబాద్‌ కు తీసుకొచ్చి చికిత్స అందించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.

వైద్య విద్యార్థుల మృతిపట్ల సీఎం కేసీఆర్‌ దిగా్భంతి

విజయవాడ సవిూపంలోని గొల్లపూడి వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ఉస్మానియా వైద్యవిద్యార్థులు మృతిచెందడం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగా్భంతి వ్యక్తం చేశారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం, సహాయక చర్యలను పర్యవేక్షించాలని ¬ం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని సీఎం ఆదేశించారు. అవసరమైతే క్షతగాత్రులను హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. దుర్మరణం చెందిన విద్యార్థుల తల్లిదండ్రులకు సీఎం సానుభూతి తెలిపారు.

గాయపడిన మెడికోలను పరామర్శించిన వీసీ రవిరాజా

డ్రైవర్‌ నిర్లక్ష్యంతో తీవ్రంగా గాయపడి విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స పొందతున్న  ఉస్మానియా మెడికల్‌ కాలేజిక చెందిన మెడికోలను మంగళవారం ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వీసీ ప్రొ. టి. రవిరాజు  పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా వీసీ అడిగి తెలుసుకున్నారు. అలాగే వైద్యులను కూడా వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.అనంతరం వీసీ రవిరాజు మాట్లాడూతూ, విద్యార్థులకు చికిత్స అనంతరం మెడికోలను హైదరాబాద్‌ తరలించేందుకు రెండు బస్సులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే మృతి చెందిన మెడికోలకు పోస్టుమార్టం అనంతరం మృతదేహాల తరలింపునకు ప్రత్యేక ఆంబులెన్‌స్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ ప్రమాద ఘటనపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందని వీసీ రవిరాజు వెల్లడించారు.

విద్యార్థులు, వైద్యుల ఆందోళన

ఉస్మానియా మెడికల్‌ కాలేజీ వద్ద విద్యార్థులు, వైద్యులు మంగళవారం ఆందోళనకు దిగారు. విద్యార్థుల కోసం కాలేజి బస్సు ఉండగా ప్రైవేట్‌ బస్సులో విద్యార్ధులను అమలాపురం ఎందుకు పంపారని విద్యార్థులు, వైద్యులు కాలేజీ ప్రిన్సిపల్‌ను ప్రశ్నించారు. విజయవాడలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ప్రమాదం జరిగి నలుగురు మృతి చెందిన ఘటనకు కాలేజీ ప్రిన్సిపల్‌, వైస్‌ ప్రిన్సిపల్‌తో పాటు పీడీనే బాధ్యులు అని వారు ఆరోపించారు. రోడ్డు ప్రమాద ఘటనకు బాధ్యత వహిస్తూ ఉద్యోగాలకు రాజీనామా చేయాలని వారిని విద్యార్థులు, వైద్యులు డిమాండ్‌ చేశారు. దీంతో ఉస్మానియా మెడికల్‌ కాలేజీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ అంశంపై కాలేజీ ఉన్నతాధికారులు విజయవాడలో ఉన్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సీహెచ్‌.లక్ష్మారెడ్డికి సమాచారం అందించారు. ఆయన వెంటనే స్పందించి ఈ ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణ జరుపుతుందని కాలేజీ విద్యార్థులు, వైద్యులకు హావిూ ఇచ్చారు.

ఆందోళనకు దిగిన వైద్యులు

దేశంలోనే అత్యంత పేరున్న వైద్యశాలగా, వైద్య కళాశాలగాపేరున్న ఉస్మానియా వైద్య విద్యార్థులను అక్రమంగా ప్రైవేట్‌ బస్సుల్లో ఎందుకు పంపించారని, ప్రమాదానికి బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తూ అటు వైద్యులు, ఇటు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అధికారిక కార్యక్రమమే అయినప్పుడు కళాశాలకు చెందిన బస్సులను ఎందుకు పంపలేదని వారు ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. అమలాపురం ప్రైవేట్‌ బస్సులో పంపడం వల్లనే నేడు ఉజ్వల భవిష్యత్‌ ఉన్న వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. ఈఘటనకు కళాశాల ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌తోపాటు పిడీనే బాధ్యులని వారు ఆరోపిస్తున్నారు. ఈఘటనకు బాధ్యత వహిస్తూ వారంతా రాజీనామా చేయాలని లేనిపక్షంలో ఆందోళనను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. ఆందోళనకారులు ఎంతకే వినకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే ఉన్నతాదికారులు స్పందించి అదనపు బలగాలను రప్పించారు. ఈవిషయంపై విజయవాడలో  ఉన్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి దృష్టికి కళాశాల ఉన్నతాధికారులు తీసుకెల్లారు. దీంతో ఆయన నేరుగా ఆందోళనకారులతో ఫోన్‌లో మాట్లాడుతూ ఘటనపై ప్రభుత్వం విచారణ చేస్తుందన్నారు. బాధ్యులను వదిలే ప్రసక్తేలేదని మంత్రి ఆందోళనకారులకు హామి ఇచ్చారు. దీంతో మెత్త పడ్డ ఆందోళనకారులు హామి నెరవేరని పక్షంలో మాత్రం చూస్తూ ఊరుకోమని ఖచ్చితంగా ఆందోళనలు చేపడుతామని విద్యార్థులు, వైద్యులు హెచ్చరించారు.

డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లనే : బాధిత విద్యార్థులు

గొల్లపూడి ప్రమాద ఘటనలో ప్రాణాలతో బయటపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను విూడియా సంప్రదించింది. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఓ విద్యార్థి మాట్లాడుతూ.. తాను రెండో వరుస సీట్లో కూర్చున్నానని, తన ముందు, పక్కన కూర్చున్న ఇద్దరు చనిపోయారని చెప్పాడు. తన ముందు కొందరు సీనియర్స్‌ నిల్చున్నారని, వారి వెనకాల తాను రెండో సీట్లో కూర్చున్నా ప్రాణాలతో బయటపడ్డాడని తెలిపాడు. డ్రైవర్‌ మద్యం తాగి బస్సు నడుపుతున్నట్లు అనిపించిందని, దానిపై అనుమానంతో కొందరు విద్యార్థులు ట్రావెల్స్‌ యాజమాన్యానికి ఫోన్‌ చేస్తే..  డ్రైవర్‌ను మారుస్తామని హావిూ ఇచ్చారని.. అయినా మార్చకపోవడంతో సూరయ్యపాలెం వద్ద బస్సును ఆపాలని కోరినా డ్రైవర్‌ పట్టించుకోలేదని విద్యార్థులు చెబుతున్నారు. తాము ప్రయాణిస్తున్న ధనుంజయ ట్రావెల్స్‌ బస్సు గొల్లపూడికి రాగానే డ్రైవర్‌ కంట్రోల్‌లో లేడని అర్థమయిందన్నాడు. మరో విద్యార్థి మాట్లాడుతూ.. తమ సీనియర్లు డ్రైవర్‌ ను వేగంగా వెళ్లవెద్దని వారించినా అతడు వినపించుకోలేదని చెప్పాడు. డ్రైవర్‌ కంట్రోల్‌ తప్పినట్లు గ్రహించిన సీనియర్స్‌ ముందుగానే వేరే డ్రైవర్‌ ను ఏర్పాటుచేసుకున్నారని, కానీ అతడు వచ్చేలోపే ఘోరం జరిగిపోయి తమ కాలేజీ మిత్రులు నలుగురు చనిపోయారని ఆవేదన వ్యక్తంచేశాడు. బస్సును ఆపాలని సీనియర్లు డ్రైవర్‌ను కోరగా, తనకు పదేళ్ల అనుభవం ఉందంటూ బస్సు వేగాన్ని మరింత పెంచడంతోనే చెట్టును ఢీకొని ఈ ఘటన జరిగిందని చెప్పుకొచ్చాడు. తన మిత్రులు మరికొంత మంది పరిస్థితి ఇప్పటికీ విషమంగా ఉందని వివరించాడు.

మృతుడి కళ్లు దానం

విజయవాడ సవిూపంలో మంగళవారం తెల్లవారు జామున జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వారిలో ఒకడిగా ఉన్న ప్రణయ్‌రాజ్‌ కల్లను బాధాతప్త హృదయంలో ఉన్నప్పటికి కూడా ఆయన తల్లి దండ్రులు కళ్లను దానం చేసేందుకు ఆంగీకరించారు. గొల్లపూడి వద్ద జరిగిన ప్రమాదంలో చనిపోయిన అయిదుగురి శవాలను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. ఈఘటనలో బస్‌ డ్రైవర్‌తోపాటు ఓయూ విద్యార్థులు లక్ష్మణ్‌, ఉదయ్‌తేజ, విజయ్‌కృష్ణమోహన్‌, ప్రణయ్‌రాజులు మృతి చెందారు. చేతికొచ్చిన కుమారుడు విగతజీవులుగా మారడాన్ని చూసి బాధిత తల్లిదండ్రులు తల్లడిల్లి పోతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల రోదనలతో విజయవాడ అసుపత్రి ప్రాంగణం విషాదంగా మారింది.  ఈప్రమాదంలో గాయపడిన విద్యార్థులు ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రణయ్‌రాజు తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం అక్కడున్న ప్రతి ఒక్కరికి ఆనందాన్ని కలిగించడమేకాక వారి ఉదారతను మెచ్చుకున్నారు.