బాబుకు బేడీలు?

C

– గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

– దూకుడు పెంచిన ఏసీబీ

– స్టీఫెన్‌ వాంగ్మూలం ఏసీబీ కోర్టులో నమోదు

– ఏకే ఖాన్‌తో సీఎం కేసీఆర్‌ సమావేశం

హైదరాబాద్‌,జూన్‌17(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడుకు కటకటాలు తప్పేలాలేవు. అందుకు కావాల్సిన ఏర్పాల్లు చకచకా జరిగిపోతున్నాయి. తాజాగా ఎన్నికల కమీషన్‌ కూడా ఏసీబికు వెన్నుదన్నుగా నిలిచింది.ఈ మేరకు ఈ కేసు అంతు తేల్చాలని ఆదేశిస్తూ లేఖరాసింది.

రాజకీయాలు వేడెక్కిన దశలో, ఎపి మంత్రులు గవర్నర్‌ నరసింహన్‌  తప్పుకోవాలన్న డిమాండ్‌ వస్తున్న నేపథ్యంలో తెలంగాణ సిఎం కెసిఆర్‌ బుధవారం మరోమారు గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. దాదాపు గంటపాటు సుదీర్ఘంగా చర్చించారు. ఓటుకునోటు రాజకీయ వ్యవహరాలు హీటెక్కిస్తున్న తరుణంలో కెసిఆర్‌ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు మధ్యాహ్నం రాజ్‌భవన్‌ వెళ్లి గవర్నర్‌ నరసింహన్‌తో  సమావేశం అయ్యారు. ఓటుకు కోట్లు కేసు పురోగతిని కేసీఆర్‌ గవర్నర్‌కు  వివరించారని సమాచారం. ఈ కేసులో ఏసీబీ నోటీసులు జారీ చేసే విషయం గురించి కేసీఆర్‌ చర్చించినట్టు సమాచారం. ఈ కేసును పక్కదారి పట్టించేందుకు ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు హైదరాబాద్లో శాంతిభద్రతల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిన విషయం గురించి కూడా గవర్నర్‌కు  వివరించినట్టు తెలుస్తోంది. అలాగే ఆంధప్రదేశ్‌లో కేసీఆర్‌పై నమోదైన కేసుల గురించి చర్చించినట్టు సమాచారం. తాజా పరిణామాలపై చర్చించిన్నట్లు సమాచారం.  హైదరాబాద్లో  శాంతిభద్రతలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోందని కేసీఆర్‌ ఈ సందర్భంగా గవర్నర్‌ దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చంద్రబాబుతో పాటు మరో ముగ్గురు ఎంపీలకు ఏసీబీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక అంతకు ముందు క్యాంప్‌ కార్యాలయంలో సిఎం కెసిఆర్‌తో ఎసిబి డిజి ఎకె ఖాన్‌ భేటీ అయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. ఎసిబి నోటీసులు, ఓటుకునోటు వ్యవహారంపై తీసుకుంటున్న చర్యలను చర్చించారు.

ఓటుకు నోటు కేసు కీలక దశకు చేరుకుంది. బుధవారం నాంపల్లి కోర్టులో నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్సన్‌ వాంగ్మూలం ఇచ్చారు. స్టీఫెన్‌సన్‌తో పాటు ఆయన కుమార్తె జెస్సికా, స్నేహితుడు మార్క్‌ టేలర్‌ న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా స్టీఫెన్‌ సన్‌కు  తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి 50 లక్షల రూపాయలు ముడుపులిస్తూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. మార్క్‌ టేలర్‌ ఇంట్లోనే రేవంత్‌ రెడ్డి.. స్టీఫెన్ను కలిశారు.ఓటుకు నోటు కేసు వ్యవహారంలో ఎసిబి కోర్టు.. స్టీఫెన్‌ సన్‌ వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. దాదాపు గంటన్నరపాటు స్టీఫెన్‌ సన్‌ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. అనంతరం స్టీఫెన్‌ సన్‌ కూతురు జెసికా సాక్ష్యాన్ని కోర్టు నమోదు చేసింది. ఆ… సమయంలో ఎవరెవరు వచ్చారు.., వారికి ఏమేవిూ అందించారని కోర్టు జెసికాను అడిగారు. అయితే వాంగ్మూలం రికార్డును సీల్డు కవర్‌ లో పెట్టి ఎసిబి ప్రిన్సిపల్‌ కోర్టుకు సమర్పిస్తారు. అయితే ఓటుకు నోటు కేసులో స్టీఫెన్‌ సన్‌ వాంగ్మూలం కీలకం కానుంది. ఈ కేసులో తన వాంగ్మూలాన్ని న్యాయమూర్తి ఎదుట ఇచ్చేందుకు ఆయన బోయిగూడ లోని తన నివాసం నుంచి నాంపల్లి లోని ఏసీబీ కోర్టుకు బయల్దేరి మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కోర్టు వద్దకు చేరుకున్నారు. పోలీసులు ఆయనకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించారు. బుల్లెట్‌ ప్రూఫ్‌ కారులో ఆయనను పటిష్ఠమైన భద్రత నడుమ కోర్టుకు తరలించారు. ఈ కారులో స్టీఫెన్సన్‌ ఒక్కరే బయల్దేరారు. టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు ఆయనకు భద్రత కల్పించారు. ముందుగానే దారి మొత్తం భద్రతా చర్యలు చేపట్టారు. ఈ కేసులో స్టీఫెన్సన్‌ వాంగ్మూలం అత్యంత కీలకం కావడంతో అంతా దీనిపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. న్యాయమూర్తికి ఆయన చెప్పే విషయాలు కేసు దర్యాప్తులో కూడా కీలక పాత్ర పోషించబోతున్నాయి. తనతో బేరసారాలు జరిపినవారి పేర్లను ఆయన కోర్టుకు వెల్లడించబోతున్నారు. ఈ సందర్భంగా నాంపల్లి కోర్టు బయట భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు.  స్టీఫెన్‌ సన్‌కు లంచం ఇవ్వజూపిన సందర్భంలో రేవంత్‌రెడ్డి తాను వేం నరేందర్‌రెడ్డికి ఫైనాన్స్‌ చేస్తున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఎల్లుండి సాయంత్రం 5గంటల్లోగా విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది.