బాబుకు స్వర పరీక్ష
ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఆడియో,వీడియో టేపులు
ఓటుకు నోటు కేసు విచారణ వేగవంతం
హైదరాబాద్,జూన్12(ఆర్‌ఎన్‌ఎ): ఓటుకు కోట్లు కేసు కీలక ఘట్టానికి చేరుకుంది. ఓటుకు నోటు కేసులో ఏసీబీ తన దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఓటుకు నోటు వ్యవహారంలో ఎన్నికలను అపహాస్యం చేసేలా నిందితుల చర్యలు ఉన్నవని ఏసీబీ కోర్టు పేర్కొంది. ఈ కేసులో దర్యాప్తు చేయాల్సిందేనని ఆదేశించింది. రేవంత్‌రెడ్డి బెయిల్ తిరస్కరణ కాపీలో ఏసీబీ కోర్టు చేసిన వాఖ్యలిలా ఉన్నాయి.. ఎన్నికలను అపహస్యం చేసేలా చర్య ఉంది. వీడియో, ఆడియో ఫుటేజ్‌లను పరిశీలించామని తెలిపింది. . స్టీఫెన్‌సన్‌కు రూ. 5 కోట్ల నగదును రేవంత్‌రెడ్డి ఆఫర్ చేసిండని,. రూ. 50 లక్షలు ఇచ్చి మరో 4.50 కోట్లు తర్వాత ఇస్తమని చెప్పారు. కేసులో దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొంది. కాగా స్టీఫెన్ సన్ ఫోన్‌కు వచ్చిన కాల్ వివరాలను పరిశీలిన నిమిత్తం ఏసీబీ ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపింది. సెల్‌ఫోన్, పెన్‌డ్రైవ్, సీపీయూలతో పాటు ఇతర పరికారాలను అధికారులు ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపారు. మరో రెండు రోజుల్లో పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం. ఈ కేసులో లభించిన ఆడియో, వీడియో టేపులను ఏసీబీ శుక్రవారం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు పంపింది. అలాగే ఈ నిందితులుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహు ఫోనులతో పాటు ఎమ్మెల్యే స్టీవెన్సన్ సెల్‌పోన్ కూడా ఏసీబీ అధికారులు ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు. దీనిపై రెండు, మూడు రోజుల్లో నివేదిక వచ్చే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి స్వాధీనం చేసుకున్న సాక్ష్యాలను మరింత నిర్ధారణ కోసం ఏసీబీ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపింది. రెండు సెల్‌ఫోన్లు, కెమెరాలు, రేవంత్ రెడ్డి ఇంట్లో స్వాధీనం చేసుకున్న సీపీయూలను ల్యాబ్‌కు పంపారు. అలాగే ఆడియో, వీడియో టేపులను కూడా ల్యాబ్‌కుపంపారు. ఆడియోలో ఉన్నది తన గొంతు కాదంటూ సీఎం చంద్రబాబు చేస్తున్న వాదనల నేపథ్యంలో ఆధారాలను ల్యాబ్‌కు పంపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆడియోలో, వీడియో ఉన్న వాస్తవ అంశాలను ల్యాబ్ శాస్త్రీయ రీతిలో నిర్ధారణ చేయనుంది. రెండు రోజుల్లో ల్యాబ్ నిర్ధారించిన అంశాలు ఏసీబీకి, కోర్టుకు చేరనున్నాయి. మరోవైపు ఈ కేసులో కీలక సాక్షి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు ఏసీబీ కోర్టు అనుమతి కోరింది. శనివారం స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని నమోదు చేసే అవకాశాలున్నాయి. సెక్షన్ 164 కింద తీసుకునే ఈ వాంగ్మూలం కేసు దర్యాప్తులో అత్యంత కీలకం కానుంది. తనను ఎవరెవరు ప్రలోభ పెట్టారో, తనతో ఎవరు, ఎన్నిసార్లు మాట్లాడారో, డబ్బు ముట్టజెప్పింది ఎవరో అనే అంశాలను స్టీఫెన్సన్ తన వాంగ్మూలంలో వెల్లడించే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి స్టీఫెన్‌సన్ ఫిర్యాదు దారు కాబట్టి, ఆయన వాంగ్మూలం కేసుకు అత్యంత కీలకమైనదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇదిలావుంటే ఓటుకు నోటు వ్యవహారంలో వెలుగులోకి వస్తున్న కాల్‌డేటా టీడీపీని కలవరపెడుతుంది. విచారణలో నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో టిడిపి నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చితే తమ పేర్లను కూడా జతచేస్తారనే భయంలో టీడీపీ నేతలు ఉన్నారు. బాబుతో పాటు తమను కూడా అరెస్టు చేస్తారనే భయంతో ఇద్దరు ఎంపీలు, ఓ మాజీ ఎంపీ ఉన్నట్లు సమాచారం. వీరికి ఏపీలో పనిచేస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులతో వ్యాపార లావాదేవీలున్నట్లు ఆధారాలు సైతం లభించాయి. వీరి కంపెనీల నుంచే రేవంత్, సెబాస్టియన్, ఉదయ్‌సింహాలకు నిధులు సమకూరినట్లు బ్యాంకు లావాదేవీలు, సాక్ష్యాధారాలను ఏసీబీ సేకరించింది. తమ కంపెనీల నుంచి నిధులు విడుదల చేయడంతో పాటు ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రలో పాలు పంచుకున్న ఎంపీలు ఢిల్లీకి పరారైనట్లు సమాచారం.