బాబుది బడాయే
ఆది నుంచి తెలంగాణ మిగులు బడ్జెట్
మీట్ ది ప్రెస్‌లో కేటీఆర్
హైదరాబాద్,మే28(జనంసాక్షి): తెలంగాణ అభివృద్ధిపై బాబు బడాయి మాటలు మాట్లాడుతున్నారని తెలంగాణ ఐటీ పంచాయితీరాజ్ మంత్రి కేటీ రామారావు విమర్శించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డనాటి నుంచే మిగులు బడ్జెట్ రాష్ట్రంగా అవతరించిందని మంత్రి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తుందని మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. తమకు భవిష్యత్‌పై సమగ్ర అవగాహన ఉందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ విజన్ ఉన్న వ్యక్తని అన్నారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో విూట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భవించడం ప్రజాస్వామ్య విజయమన్నారు. మొదటి ఏడాది పాలనలో దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించేందుకు తొలి అడుగుపడిందన్నారు. విద్యుత్ కోతలు లేకుండా చేయడంలో విజయం సాధించామని స్పష్టం చేశారు. గృహ,వ్యవసాయ, పరిశ్రమలకు కోతలు లేకుండా చేశామన్నారు. కరెంట్ సమస్యలు వస్తాయని భయపెట్టిన కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. పంచాయతీరాజ్ సంస్థల పనితీరు సంతృప్తికరంగా ఉందని తెలిపారు. బంగారు తెలంగాణ కోసం సీఎంతోపాటు అందరం అవిశ్రాంతంగా పనిచేస్తున్నమని వెల్లడించారు. దీర్ఘకాలిక ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నరని పేర్కొన్నారు. తన అమెరికా పర్యటన నాలుగు లక్ష్యాలతో కొనసాగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. దీంతో 3వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా 31కంపెనీల ప్రతినిధులను కలిశామని అన్నారు. ఐటీ రంగంలో దేశంలోనే హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని తెలిపారు. కంపెనీలు పెట్టాలన్న తపన యువకుల్లో కనబడుతోందని అన్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నమని..హైదరాబాద్‌లో గూగుల్ క్యాంపస్‌ను ప్రారంభించబోతున్నమని అన్నారు. యూఎస్ పర్యటనలో భాగంగా రూ.3వేల కోట్ల పెట్టుబడులను తీసుకురాగలిగామని పేర్కొన్నారు. హైదరాబాద్ ను నంబర్‌వన్ ఐటీ డెస్టినేషన్‌గా మార్చేందుకు కృషిచేస్తున్నమని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ కంపెనీలు ముందుకొస్తున్నాయన్నారు. అవినీతి రహితంగా, ఏడాది కాలంలో ఎన్నో సవాళ్లను తెలంగాణ ప్రభుత్వం అధిగమించిందని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళికలు రచించామని, అన్ని రంగాల సమన్వయంతో ముందుకు వెళుతున్నామన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా విూట్ ది ప్రెస్‌లో పాల్గొన్నట్లు ఆయన అన్నారు. సంవత్సరం కిందట ఎన్నో రకాలు అనుమానాలు, అపోహలు, ఉత్సాహం, రకరకాల భావోద్వేగాల మధ్య తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అసాధారణ పరిస్థితుల మధ్య ఏర్పడ్డ రాష్ట్రమని, కొత్త రాష్ట్రం విూద తెలంగాణ ప్రజలకు కోటి ఆశలు, మరోవైపు రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినవారికి కోటి అనుమానాలు ఉన్నాయన్నారు. దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా తొలి ఏడాదిలో ఎలా నిలదొక్కుకుంటుందనే అనేక సంశయాల మధ్య తాము మొదటి అడుగు వేయటంలో విజయం సాధించామన్నారు. ఇక తన శాఖకు సంబంధిస్తే ఐటీ, పంచాయతీ రాజ్ శాఖల విషయంలో రెండు శాఖలను మేళవించుకుని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు పోయామన్నారు. దేశంలోనే ఓ మోడల్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్, ఐటీ ఇండస్టీప్రై ఎన్నో ప్రచారాలు జరిగినా, అవన్నీ ఒట్టి అపోహలే అని తేలిపోయిందన్నారు. సంవత్సర కాలంలో హైదరాబాద్ నగరంలో ఒక చిన్న అవాంఛనీయ ఘటనలు లేకుండా శాంతిభద్రతలను పరరక్షించామన్నారు. ఐటీ రంగంలోకి వస్తే నాలుగు లక్ష్యాలతో ముందుకు వెళ్లామని, హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని విస్తరించటంతో పాటు, రాబోయే అయిదేళ్లలో ఐటీ ఎగుమతులను రెట్టింపు చేయాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు. భారతదేశంలోనే అతిపెద్ద టెక్నాలజీని ప్రారంభిస్తామన్నారు. సంక్షేమ రంగంలోనే తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 61 ఏళ్ల యువకుడని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ మహావృక్షంలాంటి వారని అభివర్ణించారు. ఆయనుంటేనే తామందరం ఉంటామన్నారు. విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. పార్టీలో నెంబర్ 2 అంటూ ఎవరూ లేరన్నారు. ప్రజలిచ్చిన అవకాశాన్ని తాము సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. కేసీఆర్ ఇంకా 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా… పార్టీ అధ్యక్షుడిగా పని చేయాలని తామంతా కోరుకుంటున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.