బిజెపికి అంత సీన్‌ ఉందా?

తెలంగాణలో దూకుడు పెంచిన బిజెపి అధికారం తమే అని ఘీంకరిస్తోంది. కెసిఆర్‌ కుటుంబ పాలనపై అందరూ విమర్శిస్తున్నట్లుగా బిజెపి కూడా విమర్శలకు దిగుతోంది. మిషన్‌ 2019లో భాగంగా తమ తదుపరి లక్ష్యం తెలంగాణెళి అని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ప్రకటించారు.  దక్షిణ భారతంలో ‘కాంగ్రెస్‌ ముక్త్‌’ భారత్‌ బిజెపి వల్లే సాధ్యమని, తెలుగు రాష్ట్రాల్లో తెరాస, తెదేపాలతో ఏదీ కాదని విమర్శించారు. కర్ణాటకలో కుమారస్వామి నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తికాలం కొనసాగలేదన్నారు. భాజపా కీలక బాధ్యతలు తీసుకోవడమో లేదంటే మధ్యంతర ఎన్నికలు రావడమో జరుగుతుందన్నారు. తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్లి పోటాపోటీ ప్రచారాలు చేసినా భాజపా, మోదీ పాలనపై కర్ణాటక తెలుగు ప్రజలకు ఆకర్షణ పెరిగిందే కానీ తగ్గలేదన్నారు.  ఎన్ని దశలు మారినా చంద్రబాబు మోస చరిత్ర మారదని విమర్శించారు. తెలంగాణ, ఆంధ్రలో ప్రజలకనుగుణంగా పాలన నడిపించే శక్తి భాజపాకు, మోదీకి మాత్రమే ఉందన్నారు. వారసత్వ రాజకీయాలు, ప్రభుత్వ వైఫల్యాలపై సమరశంఖం పూరిస్తూ 2019 ఎన్నికలకు సిద్ధం కావాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ పిలుపునిచ్చారు. మజ్లిస్‌కు కొమ్ముకాస్తూ రూ.40కోట్ల నిధులు కేటాయించిన తెరాస మతవిద్వేషాలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. రైతుబంధు పథకం ‘భూస్వామి బంధు’గా మారిపోయిందన్నారు.  రానున్న పంచాయతీ ఎన్నికలను సవాల్‌గా తీసుకొని ప్రజల్లోకి వెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. మొత్తంగా ఎలాంటి ప్రణాళిక ఉందో తెలియదు కానీ తెలంగాణలో, ఎపిలో పాగా వేస్తామని ప్రకటనలు మాత్రం గుప్పిస్తున్నారు. ఇక్కడ అధికరాంలో ఉన్న కెసిఆర్‌ ఓ బలమైన ప్రాంతీయ పార్టీ నేత, కాంగ్రెస్‌ విపక్షంగా ఉంది. వీరిని కాదని బిజెపి ఇప్పటికిప్పుడు అధికారంలోకి రావడానికి  అవకాశాలు కనుచూపు మేరలో కూడా కానరావడం లేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపితో పొత్తు కారణంగా ఒక పార్లమెంట్‌, ఐదు అసెంబ్లీ సీట్లను గెల్చుకున్న బిజెపి ఇప్పుడు ఆ మేరకు మళ్లీ సత్తా చాటుతుందా లేదా అన్నది అనుమానమే. గత నాలుగేళ్లలో బిజెపి పెద్దగా బలపడిన దాఖలాలు లేవు. పార్టీలో చేరిన వారు ఒక్కొక్కరే వెనక్కి పోయారు. కొందరు రావాలనుకున్నా ఎందుకనో వెనకడుగు వేశారు. గత సార్వత్రిక ఎన్నికలలో నరేంద్రమోఢీ హవాతో కేంద్రంలో అధికారాన్ని సొంతం చేసుకున్న బిజెపి తెలంగాణలో మాత్రం తన పట్టును నిరూపించుకోలేదు.  గత ఎన్నికలో టిడిపితో జతకట్టి కేవలం ఒక్క పార్లమెంటు, ఐదు అసెంబ్లీ స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. అందులో ఓ స్థానంలో ఉన్న గోషామహల్‌ ఎమ్మెల్యే పార్టీతో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. నిజానికి ఈనాలుగేళ్లలో బిజెపి చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. అధికార టిఆర్‌ఎస్‌ను మరపించేలా కార్యక్రమాలు చేయలేకపోయింది. టిఆర్‌ఎస్‌ను తిడితే బిజెపిని మెచ్చుకుంటారన్న ధోరణి తప్ప మరోటి వారి ఎజెండాలో లేకుండా పోయింది. అందుకే ఈ మధ్య బిజెపి నేతలు కూడా ప్రచార్భాటాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. పార్టీలో చేరిన నాగం జనార్ధన్‌ రెడ్డి, దిలీప్‌ కుమార్‌ లాంటి వారు ఇమడలేక వెల్లి పోయారు. మనికొందరు అదే దారిలో ఉన్నారు. కెసిఆర్‌ కుటంబ పాలన అంటూ విమర్శలు చేస్తున్నా అది పెద్దగా ప్రజల్లోకి వెళ్లడం లేదు. ఎందుకంటే కేంద్రంతో పోల్చుకుంటే తెలంగాణలో కొన్ని అభివృద్ది , సంక్షేమ ఫలాలు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయి.  ప్రధాని స్వయంగా ప్రతిపాదించి ప్రచారం చేసిన స్వచ్ఛభారత్‌ అభాసు పాలవుతోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు  ప్రాతినిధ్యం వహిస్తున్న ముషీరాబాద్‌లోనే స్వచ్ఛత కరువుగా ఉంది. కనీసం ఈ నియోజకవర్గంలో పర్యటించి సొంత ప్రజల సమస్యలను తెలుసుకునే తీరిక కూడా లక్ష్మణ్‌కు లేదంటే వారి పనితీరు ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చు. బిజెపి అధ్యక్షుడు, ఎంపి దత్తాత్రేయ  
ఉంటున్న ప్రాంతాల్లోనే పరిస్థితులు దారుణంగా ఉంటున్నాయి.  పార్టీ నిప్పు అని మోదీ చెబుతుంటే ఇక్కడ తుప్పు పట్టిస్తున్నారు. ఎపిలో నేతలు పట్టుబట్టి ఇప్పుడు ప్యాకేజీలు, ఆర్థిక సాయాలు, వివిధ సంస్థలు తెచ్చు కున్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచడంలో బలాన్ని చాటారు. అయినా అక్కడ బిజెపితో టిడిపి తెగదెంపులు చేసుకున్నది. ఎపికి చేసిందేవిూ లేదంటూ ఎదురుదాడి చేస్తోంది. ఎపిలో లాగా సిఎం కెసిఆర్‌ ఇక్కడ అలాంటి ఎదురుదాడి చేయడం లేదు కానీ పదేపదే సమస్యలను ప్రస్తావిస్తునే ఉన్నారు. కేవలం అధికారకంగా తెలంగాణ విమోచన జరపాలన్న డిమాండ్‌తో తిరంగా యాత్రలతో ప్రజలను మభ్య పెట్టడం తప్ప బిజెపి పరంగా జరిన కార్యక్రమాలు కూడా ప్రజలను ఆకట్టుకునేలా లేవు. కేంద్రంతో పోరాడి ఫలనా సాధించామని చెప్పుకునే స్థితిలో కూడా నేతలు లేరు.  దీంతో ప్రజలకు ఒరిగేదేవిూ లేదు. కేంద్రానికి రాష్ట్రానికి అనుసంధానంగా ఉండి సమస్యలను పరిష్కరించడంలో నేతలు విఫలమయ్యారు. నిజంగా చెప్పాలంటే చేతగాకుండా మిన్నకుండి పోయారు. హైకోర్టునే తీసుకుంటే దానిని విభజన చేయించే దమ్ము ధైర్యం కూడా ఈ నేతలకు లేదని చెప్పడంలో సందేహించాల్సిన అవసరం లేదు. బిజెపి జాతీయ నాయకత్వం రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించినా రాష్ట్ర నేతలు మాత్రం తమ కార్యాచరణను ప్రకటించడం లేదు. పొలిటికల్‌ గ్యాప్‌ను క్యాష్‌ చేసుకోవడంలో కాషాయదళం విఫలం అవుతుందనడానికి ఇంతకన్నా రుజువులు అక్కర్లేదు.  కేంద్రంలో అధికారంలో ఉండడంతో పార్టీకి కావాల్సిన అన్ని  అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అయినా  నాయకత్వంలో ఎక్కడో లోపం కనిపిస్తోంది.  తెలంగాణ ఉద్యమంలో టిఆర్‌ఎస్‌తో సమానంగా పోరాడి, తెలంగాణ ఏర్పాటులో కీలక భూమిక పోషించినా ఇప్పుడు క్రెడిట్‌ అంతా కెసిఆర్‌ కొట్టేసినా దాన్ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నాలు చేయడం లేదు.సిద్దాంతాల ప్రాతిపాదికన రాజకీయాలు చేసే పార్టీగా గుర్తింపు ఉన్న బిజెపి తెలంగాణలో ఎందుకు ఎదగలేక పోతుందన్న చర్చ చేయడం లేదు. కేవలం మోడీని చూపి అ¬ బ్రహ్మాండం..ఒ¬ బ్రహ్మాండం అంటూ అవినీతి రహిత పాలన అంటూ చంకలు గుద్దుకుంటే బిజెపిని ప్రజలు ఆదరిస్తారను కుంటే పొరపాటుకాక మరోటి కాదు.
——————————————