బిజెపి పట్టిన కుందేటికి రెండే కాళ్లు
తాను పట్టిన కుందేటికి రెండే కాళ్లు అన్నది ఇప్పుడు కేంద్రంలోని ఎన్‌డిఎగా వెలుగొందుతున్న బిజెపి ప్రభుత్వం మాటగా ఉంది. ఈ రెండు కొమ్ముల్లో ఒకటి నోట్ల రద్దు, రెండోది జిఎస్టీ. దీంతో భారత ప్రజలు వెలిగిపోతున్నారన్న ప్రచారంతో దూసుకుని పోతున్నారు. అందువల్ల ప్రజలు తమ ఆర్థికస్థితిని వందల రెట్లు పెంచుకుని బలపడ్డారన్న రీతిలో ప్రచారం సాగిస్తున్నారు. ఎందుకంటే వారికి డబ్బులు అవసరం లేనంతగా వ్యాపారం సాగుతోంది. వ్యాపారం చేయాల్సిన అవసరం రావడం లేదు. డబ్బుల అవసరం లేకుండా ఎటిఎంలు, బ్యాంకులు తమపని తాము చేసుకుంటూ పోతున్నాయి. అందువల్ల ఈ రెండు విషయాల్లో తాము పట్టిన కుందేటికి రెండేకాళ్లని నమ్మించ గలుగుతున్నారు. ప్రజలు ఏమైనా ఫర్వాలేదు. ఇవన్నీ సర్దుకుంటాయన్న ధీమాలో ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వ పరంగా మోడీ నిర్ణయాలు, పార్టీ పరంగా అమిత్‌షా నిర్ణయాలు మాత్రమే చెల్లుబాటు అవుతున్న రోజులివి. అందువల్ల వీరిద్దరు ఏం మాట్లాడినా శంఖులో పోసిన తీర్థంలా అందరూ మహాప్రసాదం అంటూ సర్దుకు పోతున్నారు. ఎవరైనా విమర్శించే సాహసం చేయడంలేదు. విపక్షాల విమర్శలకు విలువ లేదు. వారిని కేసులతో చావగొట్టేస్తున్నారు. లేదా అభివృద్ది నిరోధకులనో లేకపోతే నల్లడబ్బుకు కొమ్ము కాసేవారనో ప్రచారం చేస్తున్నారు. ఇకపోతే మంచిచేస్తున్నా ఎక్కడైనా విమర్శలు వస్తున్నాయని గమనించే వారిని పట్టుకుని ఎదురుదాడి చేస్తున్నారు.
ప్రజలనైతే అర్థం చేసుకోవడం లేదని పక్కన పెట్టేస్తున్నారు. యశ్వంత్ సిన్హా లాంటి వారు ఎవరైనా మాట్లాడితే అంటరాని వాడుగా జమకడుతున్నారు. పార్టీలో అలాంటి వారి పరువు తీస్తున్నారు. అద్వానీ లాంటి వారిని మాట్లాడకుండా చేసేసారు. భారతంలో భీష్మ పితామహుడి పాత్రకే ఆయన పరిమితం అయ్యారు. ఇప్పుడంతా కౌరవసభ జరుగుతుందా అన్న రీతిలో మురళీమనోహర్ జోషి, అరుణ్‌శౌరి లాంటి వారిని కూడా పక్కన పడేశారు. దీంతో వారు కూడా చేసేదేవిూ లేక తమ మాటలు పెదాలను దాటి రాకుండా చూసుకుంటున్నారు. మన అదృష్టం బాగుండి వెంకయ్య నాయుడు లాంటి వారు ఉపరాష్ట్రపతి అయ్యారు. లేకుంటే ఆయన కూడా వారంలో ఐదు రోజులు తెలుగు రాష్టాల్ల్రో తిష్టవేసి మోడీ అద్భుతాలను మనకు నిత్యం వేద పారాయణంలా వెల్లడించేవారు. మొత్తానికి ఇప్పుడు మోడీ,అమిత్‌షాలు ఏది చెబితే అదే వేదం. అందుకే ఆయా రాష్టాల్ర ప్రభుత్వాలు కూడా కిమ్మనకుండా అనివార్యంగా మద్దతు తెలుపుతూ మిన్నకున్నాయి. తెలుగు రాష్టాల్ర ముఖ్యమంత్రులు కూడా తమ అవసరార్థం తానా తందానా అంటున్నారు. మోడీ పథకాలు భేష్ అంటున్నారు. జిఎస్టీ వాతలు పడుతున్నా సర్దుకు పోతున్నారు. అందుకే అచ్చేదిన్ నినాదంతో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు అయ్యాక ఇప్పుడు ప్రజలు కూడా దీనికి అలవాటు పడ్డారు. తమకూ ఓ అవకాశం రాకపోతుందా..అప్పుడే చూద్దాం లే అన్న రీతిలో వెయిట్ అండ్ సీ ధోరణిలో ఉన్నారు. భారత ప్రజాస్వామ్యంలో మధ్యలో లేచి ఎంత అరిచి గీపెట్టినా లాభం లేదు. ఐదేళ్ల కాలం వరకు ఆగాల్సిందే. అందుకే మంచి రోజులు తమకూ వస్తాయని ప్రజలు నేరుగా ప్రశ్నించడం మానుకున్నారు. అచ్చేదిన్ కోసం ఎదురుచూస్తున్న ప్రజానీకానికి బీజేపీ నాయకుల ప్రచార ¬రు తప్ప సానుకూల ఫలితాలు లేవని తెలియక కాదు. కేందప్రభుత్వ పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం అవుతున్నా తాము మంచి నిర్ణయాలు తీసుకున్నామని, ఆర్థిక సంస్కరణలకారణంగా భారత్ వృద్దిరేటులో పరుగులు పెడుతోందని మన గౌరవీనయ ఆర్థికమంత్రి జైట్లీగారు అమెరికాలో కూడా ప్రచారం చేస్తున్న తీరు నవ్వుపుట్టించేదిగా కూడా లేదు. ఎందుకంటే నవ్వడానికి ప్రజలకు తీరిక లేకుండా పోయింది. మోడీని నమ్ముకున్నందుకు తమ బతుకులు నవ్వుల పాలయ్యాయని వారు గమనించాక ఇక నవ్వడం మానేశారు.
యూపీఏ హయాంలో నానా బాధలు అనుభవించిన ప్రజలు మోదీ ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాక నవ్వుల పాలయ్యారు. తమ రాత మార్చే నాయకుడు, చాయ్ అమ్ముకునే సామాన్యుడు, భార్యబిడ్డలు లాంటి భవబంధాలు లేని నేత ప్రధాని అయ్యాడని సంబరపడ్డారు. ముందుగ మురిసిన అమ్మ పండగ పొద్దెరగదన్న రీతిలో ఇప్పుడు ప్రజలకు పండగలే లేకుండా పోయాయి. పాత వెయ్యినోటుకున్న విలువ ప్రస్తుత రెండువేల నోటుకు ఎందుకు లేకపోయిందే అన్న బాధలో అన్నీ మరచిపోతున్నారు. నోట్ల రద్దు మాయలో పడ్డ ప్రజలు తమకు తెలియకుండానే జిఎస్టీ వాయిస్తోందని గుర్తించినా లాభం లేకుండా పోతోంది. రెండు నెలల కాలంలో ప్రజలు తమ జీవన వ్యయం పెరిగిందని, ఎక్కడికెళ్లినా జిఎస్టీ పేరుతో వాయిస్తు న్నారని, వ్యాట్‌ను మించిన వాతలు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నా, గుర్తించేవారు లేరన్న బాధలో ఉన్నారు. ఇదే విధంగా కొనసాగితే తమ పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నా చెవిటివాడి ముందు శంకం ఊదినట్లుగా ఆ ఇద్దరికీ ఇది వినిపించడం లేదా కనిపించడం జరగడం లేదని తెగ బాధపడి పోతున్నారు. జిఎస్టీ అనే ఉత్పేర్రకం అమలులోకి వచ్చాక ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు రోజుకోతీరుగా మారిపోతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నా పట్టించుకునే వారు లేరని తెగబాధపడిపోతున్నారు. జీఎస్టీ కారణంగా కొన్ని వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా చేసేదేవిూ లేక ఆకాశానికేసే చూస్తున్నారు. జీఎస్టీ అమలులోకి వస్తే ధరలు దిగి వస్తాయని మోడీద్వయం చెప్పినదానికి, జరుగుతున్న దానికి ఎక్కడా పొంతన ఎందుకు లేదా అని అలాగే ఆకాశం కేసి చూస్తున్నారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్లలో పెట్రోల్, డీజిల్ పై 12సార్లు ఎక్సైజ్ పన్ను పెంచారు. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిన కారణంగా ఈ మధ్య రెండు రూపాయలు తగ్గించి ఉదారత చూపినట్లు నటించారు. గ్యాస్ ధరలు సబ్సిడీని దాటి పరుగులు పెడుతున్నాయి. 2014 నాటి ధరలు పోల్చి చూస్తే అన్నీ నూటికి మూడువందల శాతం పెరిగినా అచ్చేదిన్ అనుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ప్రజలు దేశాభివృద్ధి కోసం బీజేపీకి పట్టం కడితే బీజేపీ నాయకులు తమ పార్టీ అభివృద్ధికి మాత్రమే కృషి చేస్తున్నా, ఇదంతా దేశం కోసమే కావచ్చని వెర్రిబాగుల మొహంతో ఆకాశం కేసి చూస్తున్నారు. అచ్చేదిన్ కోసం మరో ఏడాది ఓపిక పట్టాలేమో అని ఎదురుచూస్తున్నారు.