బెంగాల్‌ బీబీకే జై..

1

– ఎగ్జిట్‌పోల్‌ సర్వే వెల్లడి

కోల్‌కతా,ఏప్రిల్‌ 1(జనంసాక్షి): బెంగాల్‌ ప్రజలు మరోసారి దీదీకే పట్టం కట్టనున్నారు. ఒపీనియన్‌ పోల్స్‌ సర్వేల ఫలితాలు కూడా తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీకే అనుకూలంగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా అయిదేళ్ల పాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న మమతా రెండో పర్యాయం కూడా సీఎం పదవిని అధిష్టించనున్నారట.  అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణముల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి గెలవడం ఖాయమని  టైమ్స్‌ నౌ నిర్వహించిన బెంగాల్‌ ఒపీనియన్‌ పోల్స్‌ సర్వేలో వెల్లడైంది. మమతా సారధ్యంలోని తృణముల్‌ కాంగ్రెస్‌కే మళ్లీ అధికారం దక్కుతుందని, కమ్యునిస్టులు రెండో స్థానానికే పరిమితమవుతారని సర్వేల్లో తేలింది.కాగా పశ్చిమ బెంగాల్‌ లో ఆరు విడతలుగా ఎన్నికలు జరగబోతున్నాయి. ఏప్రిల్‌ 4న అంటే  సోమవారంనాడు తొలి విడత పోలింగ్‌ జరిగితే, మే 5న ఆఖరి విడత పోలింగ్‌  వుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగిన బెంగాల్‌ పులి, ఈసారి సొంతంగానే పోటీకి దిగడం గమనిస్తే పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒపీనియన్‌ పోల్స్‌ తృణమూల్‌ కు అనుకూలంగా రావటంతో ఆ పార్టీ కార్యకర్తలు ఫుల్‌ జోష్‌ లో ఉన్నారు.