బొక్కలపొడి బలమైతే తింటే తప్పేంది!?
– బాబా రాందేవ్‌కు లాలూ వకాల్తా
న్యూఢిల్లీ,మే4(జనంసాక్షి): ‘బొక్కల పొడి తింటే మనిషి బలంగా తయారవుతాడనుకుంటే దాన్ని తినడంలో తప్పేముంది? దేశానికి మేలు చేసే అలాంటి ఉత్పత్తులు తయారుచేస్తోన్న రామ్ దేవ్ గొప్పవాడు అనడంలో తప్పేముంది? అయినా జనం రామ్ దేవ్ పేరు చెబితే కుళ్లుకుంటారు. ఎందుకంటే ఆయన అత్యున్నత విజయాలు సాధించిన వ్యక్తి గనుక’ ఈ మాటలు ఏ బీజేపీ నేతలో, ఆర్‌ఎస్‌ఎస్ వాదులో అనేదుంటే అసలిది వార్తకానేకాకపోయేది. అవును. ఒకప్పుడు రామ్ దేవ్ పేరు చెబితే అంతెత్తు ఎగిరపడ్డ బిహారీ నేత, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్.. యోగా గురు విషయంలో ఇప్పుడు పూర్తిగా మారుమనసు పొందారు. ప్రతిఫలంగా రామ్ దేవ్ లాలూ ముఖానికి క్రీమ్ రాశారు. బుధవారం ఉదయం ఢిల్లీలోని రామ్ దేవ్ నివాసంలో ఈ దృశ్యాలు కనిపించాయి.ఏం పనివిూద వచ్చారో తెలియదుకాదీ, ఆర్జేడీ చీఫ్ లాలూ యాదవ్ ఈ రోజు ఉదయాన్నే యోగా గురు రామ్ దేవ్ ఇంటికి వచ్చారు. సహజంగానే లాలూ చుట్టూ తచ్చాడే విూడియా మైకులతో సహా ఇద్దరినీ పలకరించింది. రామ్‌దేవ్ సైలెంట్ గానే ఉన్నారు. లాలూ మాత్రం తనదైన శైలిలో ..
‘ఆయన (రామ్ దేవ్) ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. పతంజలి ప్రాడక్ట్స్ విూద ఎవరెవరో ఏదేదో మాట్లాడుతుంటారు. నేనే మంటానంటే.. బొక్కలు తినడం ఆరోగ్యానికి మంచిదైతే, అలా చెయ్యడంలో తప్పేముంది? ఇదంతా ఆయన ఎదుగుదల గురించే. జనం రామ్ దేవ్ పేరుచెబితే కుళ్లుకునేది ఇందుకే’ అంటూ యోగాగురును ఆకాశానికి ఎత్తేశారు లాలూ.ఈ సందర్భంగా రామ్ దేవ్ తాను రూపొందించిన ఫేస్ క్రీమ్ ను లాలూ ముఖానికి రాశారు. దీంతో అనధికారికంగా లాలూ రామ్ దేవ్ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ అయినట్లయింది. ‘ఇప్పటికే ఫుల్ గ్లామరస్ గా కనిపించే లాలూ ఇకపై మరింత గ్లామరస్ గా కనిపిస్తే చూడటం మనవల్ల అయ్యేపనేనా?’ అని అనుకున్నారట అక్కడే ఉన్న ఇంకొందరు! ఏది ఏమైనా నచ్చితే కీర్తించడం, నచ్చకుంటే మోహమాటం లేకుండా నిందించడం ఒక్క లాలూకే చెల్లింది. గతంలో లాలూ.. రామ్ దేవ్ ను పెట్టుబడిదారునిగా, ఫక్తు వ్యాపారవేత్త అభివర్ణించిన సంగతి తెలిసిందే. రామ్ దేవ్ ఉత్పత్తుల్లో ఎముకల చూర్ణం కలుస్తుందని వార్తలు వచ్చినప్పుడు కూడా లాలూ వాటిని ఖండించిన విషయం విదితమే.