బౌద్ధం స్వీకరించిన రోహిత్ కుటుంబం
ముంబై,ఏప్రిల్ 14(జనంసాక్షి): వేముల రోహిత్ కుటుంబ సభ్యులు బౌద్ద మతాన్ని స్వీకరించారు. ముంబైలోని దాదర్‌లో ఉన్న అంబేద్కర్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో బౌద్ద భిక్షువుల సమక్షంలో రోహిత్ తల్లి రాధిక, ఆయన సోదరుడు బౌద్ద మతాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా రోహిత్ సోదరుడు మాట్లాడుతూ.. తన అన్న రోహిత్ కూడా బౌద్ద మతాన్ని స్వీకరించాలని అనుకున్నారని, కానీ చేయలేక పోయారని తెలిపారు. ఇవాళ తాము ఆ పని పూర్తి చేశామని వివరించారు. బౌద్ద మతంలోని ప్రబోధనలు తమకు ఎంతగానో నచ్చాయన్నారు. అందుకే అంబేద్కర్ పుట్టిన రోజు సందర్భంగా బౌద్ద మతాన్ని చేపడుతున్నామని పేర్కొన్నారు. కాగా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో వేముల రోహిత్ అనే స్కాలర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళలనలు నిర్వహించిన విషయం తెలిసిందే.