బ్రహ్మదేవుడు కూడా నిన్ను రక్షించలేడు
నీకు తగిన శాస్తే జరుగుతుంది
హైదరాబాద్ నీ అబ్బ జాగీరు కాదు
బాబూ నీ పెడబొబ్బలకు ఇక్కడెవరూ భయపడరు
బాబుపై సీఎం కేసీఆర్ ఆర్‌పార
ి్డ
నల్లగొండ, జూన్ 9(జనంసాక్షి) : ఏపీ సీఎం చంద్రబాబుని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. నల్లగొండలోని ఎన్జీ కాలేజీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఏపీలోని మంగళగిరిలో ఇవాళ సాయంత్రం జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడిన విషయాలపై నిప్పులు చెరిగారు. ఏసీబీ కేసులో అన్యాయంగా ఇరికించారని చంద్రబాబు అంటున్నాడని, నువ్వు ఇరికిస్తే ఇరికేటోడివేనా చంద్రబాబు అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. నువ్వు అందరిని ఇరికిస్తావు. అందరి కొంపలు కూల్చేవాడివి, నీ కొంప కూల్చుకుంటావా? అని ఎద్దేవా చేశారు.
పక్క రాష్ట్రపోడు వచ్చి ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొని, ఎమ్మెల్సీని గెలిపిస్తానంటే చేతులు ముడుచుకొని కూర్చోవాలా అని కేసీఆర్ నిలదీశారు. దొంగతనం చేసినోడిని దొంగ అనొద్దంటున్నాడని అన్నారు. పట్టపగలు దొరికిన దొంగ గట్టిగా మాట్లాడుతున్నాడని, పెడబొబ్బలు పెడుతున్నాడని చెప్పారు. చంద్రబాబుని కేసులో ఇరికించాల్సిన అవసరం తమకు లేదని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. తమకంత ఖాళీ లేదని, తమ పనులు చేసుకోవడానికే 24 గంటలకు సరిపోవడం లేదన్నారు.
రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదన్నట్టు దిక్కుమాలిన కాంగ్రెస్ వాళ్లు వద్దంటే హైదరాబాద్ ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా పెట్టిన్రని సీఎం కేసీఆర్ విమర్శించారు. హైదరాబాద్ పై తమకు పదేళ్లు హక్కు ఉందని, తన పోలీసులు, ఏసీబీ అధికారులు కూడా అక్కడే ఉన్నారని చంద్రబాబు అంటున్నాడని, హైదరాబాద్ నీ అబ్బ జాగీరా, నీ తాతదా అని కేసీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్ కు తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రి. ఇక్కడ నీ ఏసీబీ ఉండదు. నీ పోలీసులు ఉండరని స్పష్టం చేశారు. నీ లుచ్చా పని, నీ లత్కోర్ పని దేశానికి తెలిసిపోయిందన్నారు. తెలంగాణ ప్రజానీకమే చంద్రబాబుకు తగిన శాస్తి చేస్తారని, ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. హైదరాబాద్ లో కూడా తమ ఏసీబీ ఉందని చంద్రబాబు అంటున్నాడని, నేను నీ లెక్క దొంగని కాదుగా భయపడటానికి అని అన్నారు.
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేంత ఎమ్మెల్యేల సంఖ్య లేకున్నా ఎందుకు పోటీ చేశావని చంద్రబాబుని నిలదీశారు కేసీఆర్. వేరే పార్టీల ఎమ్మెల్యేలను కోట్లు పెట్టి కొనచ్చనుకున్నావా అని ప్రశ్నించారు. సత్యహరిశ్చంద్రుడు ఇంటి వెనుకనే నీ ఇల్లు కదా.. నీతులు చెబుతున్న వాడివి నీ వ్యవహారం దేశమంతా చూస్తోంది, నీ ఎమ్మెల్యే జైలులో ఉన్నాడన్నారు. అరుపులు, పెడబొబ్బలతో గాయిచేసి మాయ చేద్దామంటే కుదరదని స్పష్టం చేశారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తెలంగాణ బిడ్డ కాబట్టి నీ గురించి ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చి పట్టించాడని ముఖ్యమంత్రి చెప్పారు.
ఉద్యమ బెబ్బులి తెలంగాణ స్వయం పాలనతో దేశం ముందు కాలర్ ఎగరేసుకొని నిలబడ్డదని, నీలాంటివాళ్లకు తగిన శాస్తి జరుగుతుందని చంద్రబాబుని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.