బ్రెయిలీ సేవలు అమూల్యం బదిరులకు ఉద్యోగ అవకాశాలు సీఎం కిరణ్
హైదరాబాద్, జనవరి 4 (జనంసాక్షి) :
లూయి బ్రెయిలీ 204వ జయంతి జరుపుకోవడం హర్షదాయకమని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.అంధులే కాకుండా జాతి యావత్తు ఆయనకు రుణపడి ఉందని అన్నారు. లూయీ బ్రెయిలీ జయంతి సందర్భంగా మలక్‌పేటలోని బ్రెయిలీ విగ్రహానికి శుక్రవారం ఉదయం పూలమాలలు వేసి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నివాళులర్పించారు. రాజ్యసభ సభ్యులు వి.హనుమంత రావు, మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డి, దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ వికలాంగుల సంక్షేమ భవనాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. వికలాంగుల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. వికలాంగ గ్రూపులకు రుణాలు ఇవ్వాలని బ్యాంకులు
ఆదేశాలిచ్చా మన్నారు. 15వేల గ్రూపులు 220 కోట్లు మేర రుణాలు తీసుకుంటున్నాయన్నారు. ఈ ఏడాది 600 కోట్లకు పెంచాలని యోచిస్తున్నామన్నారు. వచ్చే ఏడాది 1000 కోట్లకు పెంచనున్నట్టు తెలిపారు. అయితే తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలన్నారు. తీసుకున్న రుణం చెల్లిస్తే సరిపోతుందని.. వడ్డీ కట్టనవసరం లేదని తెలిపారు. వికలాంగుల శిక్షణ కేంద్రం నిర్వహణ కోసం ప్రతి ఏటా కోటి రూపాయలను కేటాయించామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనే గాక ప్రైవేటు సంస్థల్లోను వికలాంగులకు ఉద్యోగాలిప్పిస్తామని తెలిపారు. చెవిటి వారికి కూడా ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. ఇటీవలె నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇంటర్ చదివిన అయిదారుగురికి ఇటీవలె ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగాలిప్పిచ్చామని తెలిపారు. రాజీవ్ విద్యామిషన్ ద్వారా బండ్లగూడలో ర్యాంపులు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే 7వేల స్కూళ్లల్లో వికలాంగులకు ప్రత్యేకంగా బాత్‌రూములు నిర్మించనున్నట్టు వెల్లడించారు. అంతేగాక రిసోర్సు సెంటర్లను 41 కోట్లతో నిర్మించనున్నట్టు చెప్పారు. ఉపకరణాలు అందిస్తున్నామన్నారు. ఉచితంగా సర్జరీలకు కూడా అనుమతి ఇచ్చామని వివరించారు. అంధులకు ఉద్యోగాల్లో మరిన్ని అవకాశాలు కల్పిస్తా మన్నారు. ఆరో రోస్టర్ విధానంలో మార్పులు చేసేందుకు ఏమైనా అవకాశం ఉంటుందా అన్న దానిపై న్యాయ నిపుణులతో చర్చించాల్సి ఉందన్నారు. వారి సూచనల మేరకు నడుచుకుంటామన్నారు. అప్పటివరకు ఆ విధానంపై ప్రభుత్వం ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా వికలాంగులకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. వారి బతుకులు వారు బతికేలా తగిన సేవలందిస్తామన్నారు. వికలాంగుల పెన్షన్ పెంపుపై త్వరలో స్పందిస్తా నన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మరో లక్ష మంది వికలాంగుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని, ఆ ప్రక్రియ పూర్తయ్యాక నివేదిక అందాక పెన్షన్ పెంపుపై తుది నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తొలుత రాజ్యసభసభ్యులు వి.హనుమంతరావు మాట్లాడుతూ..బ్రెయిలీ జయంతిని జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. బ్రెయిలీ 204వ జయంతిని కన్నుల పండువగా జరుపుకోవడం ప్రజల అదృష్టమన్నారు. మిగిలిన వారిలో కంటే వికలాంగుల్లో అపారమైన తెలివి, ఏకాగ్రత, పట్టుదల ఉంటుందన్నారు. భగవంతుడు వారికిచ్చిన అపూర్వ వరమన్నారు. వాటిని ఆసరాగా చేసుకుని ఎంతో ఎత్తుకు ఎదగడం గర్వకారణమన్నారు. ఆరో రోస్టర్ విధానాన్ని మార్చడం ఎవరి వల్లా కాదన్నారు. అది అసాధ్యమన్నారు. అయితే వికలాంగుల సంక్షేమానికి మరో విధంగా తోడ్పడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు. ప్రస్తుతం వికలాంగులకు 500 రూపాయల పెన్షన్ ఇస్తున్నారని, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల నేపథ్యంలో 1000 రూపాయలకు పెంచాలని వికలాంగుల తరఫున ముఖ్యమంత్రిని కోరుతున్నానన్నారు. తాను చేసిన సేవలకు గాను ఇటీవలె పెరియార్ అవార్డుతో తనను సత్కరించారని అన్నారు. ఆ సందర్భంగా తనకు అందజేసిన లక్ష రూపాయలను నేడు వికలాంగుల సంక్షేమం కోసం ఇస్తున్నానని ప్రకటించారు. బెయిలీ జయంతి సందర్భంగా వికలాంగులకు తాను ఇచ్చే కానుక అదేనని చెప్పారు. ఆ తర్వాత రాష్ట్ర మంత్రి సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బ్రెయిలీ 204వ జయంతిని జరుపుకోవడం అందరి అదృష్టమన్నారు. రెండేళ్ల క్రితం సంక్షేమ భవనానికి శంకుస్థాపన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేశారని, ఆయన చేతుల మీదుగానే భవనాన్ని ప్రారంభింపజేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. వికలాంగుల సంక్షేమం కోసం ఆయన ఎన్నో నిర్ణయాలను ఇప్పటికే తీసుకున్నారని, అవి సక్రమంగానే అమలవుతున్నాయని తెలిపారు. సంక్షేమ భవన నిర్మాణానికి నాలుగున్నర కోట్ల రూపాయలను కేటాయించి అది తొందరగా పూర్తయ్యేందుకు సహాయ సహకారాలు అందజేశారన్నారు. మాట్లాడే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న అన్న చందాన ముఖ్యమంత్రి వ్యవహరిస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వికలాంగుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకుని మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. వికలాంగుల హాస్టళ్లలోని వారి మెస్ చార్జీలను కూడా ముఖ్యమంత్రి పెంచారన్నారు. అంతేగాకుండా ఎన్నో పథకాల్లో వికలాంగులకు ప్రత్యేక రాయితీలు కల్పించారన్నారు. ఎగ్జామినేషన్ ఫీజులో కూడా రాయితీ ఇచ్చారన్నారు. వికలాంగులు అన్ని రంగాల్లోను అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇదిలా ఉండగా పలువురు వికలాంగ విద్యార్థులకు ముఖ్యమంత్రి లాప్‌టాప్‌లు అందజేశారు. వికలాంగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.