భాజపాకు నేనే లక్ష్యం
– ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ,మే3(జనంసాక్షి): అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ కుంభకోణంలో బీజేపీ తనను టార్గెట్ చేయడం సంతోషంగా ఉందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈ స్కామ్‌లో ఆరోపణలున్న రియల్ ఎస్టేట్ వ్యాపారితో రాహుల్‌కున్న వ్యవహారాలపై విచారణ జరిపించాలని కోరుతూ బీజేపీ ఎంపీ కిరిత్ సౌమ్యా ఈడీ, సీబీఐకి లేఖ రాయడంపై మంగళవారం ఆయన స్పందించారు. బీజేపీకి తాను ఎప్పుడూ టార్గెట్టేనని, దీనికి సంతోషంగా ఉందని రాహుల్ వ్యాఖ్యానించారు.అయితే దీనిపై చర్చ జరగాలని,విచారణ జరిగితే అసలు నిజాలు బయటకు వస్తాయని అన్నారు.కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మే 5న చెన్నైలో జరిగే బహిరంగసభలో సోనియా గాంధీ పాల్గొననున్నట్లు తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇలాంగోవన్ తెలిపారు. ఈ సభకు డీఎంకే అధ్యక్షుడు ఎం కరుణానిధి కూడా హాజరవనున్నారు.అనంతరం మే 7 రాహుల్ గాంధీ చెన్నైలో పర్యటించి ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే-కాంగ్రెస్ కూటమిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మే 16న ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి.