భాజపా ఎమ్మెల్యే దాడిలో గాయపడ్డ శక్తిమాన్ కన్నుమూత
న్యూఢిల్లీ,ఏప్రిల్ 20(జనంసాక్షి):శక్తిమాన్ గుర్తుంది కదా.. బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి చేతిలో దారుణంగా దెబ్బలు తిని.. ఆ మధ్య దేశవ్యాప్తంగా సానుభూతి పొందిన ఈ ఉత్తరాఖండ్ పోలీసు గుర్రం ఇక లేదు. గత నెల హరీశ్ రావత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నిర్వహించిన ఆందోళనలో తీవ్రంగా గాయపడిన ఈ 14 ఏళ్ల గుర్రం ఓ కాలిని వైద్యులు శస్త్రచికిత్స జరిపి తొలగించారు. ఆ కాలి స్థానంలో కృత్రిమ కాలును అమర్చి.. వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఇన్నాళ్లు ప్రాణాలతో పోరాడిన శక్తిమాన్ బుధవారం తుదిశ్వాస విడిచింది.గత కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ గుర్రం చనిపోవడానికి కారణమని బీజేపీ ఆరోపిస్తున్నది. బీజేపీ ఆందోళనలో గాయపడిన కారణంగా ఈ గుర్రానికి సరైన వైద్యం అందించకుండా చనిపోయేలా హరీశ్ రావత్ ప్రభుత్వం చేసిందని కమలం నేత అజయ్ భట్ ఆరోపించారు. ఉత్తరాఖండ్ అశ్వ పోలీసు దళంలో శక్తిమాన్ సేవలందించింది.మార్చి 14న డెహ్రాడూన్‌లో బీజేపీ నిర్వహించిన ఆందోళన సందర్భంగా శక్తిమాన్ గాయపడింది. బీజేపీ ఎమ్మెల్యే గణేశ్ జోషి లాఠీతో కొట్టడం వల్లే ఈ గుర్రం గాయపడిందని పోలీసులు కేసు నమోదు చేసి, ఆయనను అరెస్టు చేశారు. గణేశ్ జోషి గుర్రాన్ని కొడుతున్నట్టు వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. ఆయన మాత్రం తాను గుర్రాన్ని కొట్టలేదని, తన వల్ల అది గాయపడలేదని వాదిస్తున్నారు.