భాజపా ప్రజల మధ్య విబేధాలు సృష్టిస్తోంది హింసను ప్రేరేపిస్తోంది

4

– ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ

దిగ్బోయ్‌,ఏప్రిల్‌ 1(జనంసాక్షి):భాజపా అడుగుపెట్టిన చోటల్లా ప్రజల్లో భేదాలు తెచ్చి హింసను ప్రేరేపిస్తోందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. త్వరలో అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాహుల్‌ దిగ్బోయ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. భాజపాపై విమర్శల వర్షం కురిపించారు. అస్సాంలో రెండు భిన్న సిద్ధాంతాల మధ్య ఘర్షణ జరుగుతోందని, భాజపా, ఆరెస్సెస్‌ ఓ వైపు ఉంటే కాంగ్రెస్‌ మరోవైపు ఉందని రాహుల్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా నిజంగా పనిచేస్తుంటే ఫెయిర్‌అండ్‌లవ్‌లీ పథకం ఎందుకు పుట్టిందని ప్రశ్నించారు.రాహుల్‌ గాంధీ తీన్‌సుకియా, దిబ్రూఘడ్‌, తేజ్‌పూర్‌ జిల్లాల్లో ఎన్నికల ర్యాలీల్లో పాల్గొననున్నారు. ఇంతకు ముందు కూడా ఆయన కర్బీ అంగ్‌లాంగ్‌, కరీమ్‌గంజ్‌, కచర్‌ జిల్లాల్లో ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ సైతం బుధవారం అంగురి, బిశ్వనాథ్‌ జిల్లాల్లో ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. రోడ్డు కనెక్టివిటీని, ఉద్యోగావకాశాల్ని పెంచడం ముఖ్యమైన విషయాలుగా ఇక్కడ కాంగ్రెస్‌ వర్గాలు ప్రచారం కొనసాగిస్తున్నాయి.

మాల్యా వెల్లిపోవడానికి బిజెపియే కారణం

బీజేపీ ఎక్కడకు వెళ్లినా ప్రజల్లో హింసను రెచ్చగొడుతోందని, అసోంలో కూడా హింస తిరిగొస్తే ఈ రాష్ట్ర అభివృద్ధి ఏమైపోవాలని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. విభజన రాజకీయాలతో బిజెపి చిచ్చు పెడుతోందని అన్నారు. మన ముందు ఎన్నికలు వస్తున్నాయని, రెండు రకాల ఆలోచనల మధ్య పోటీ ఉందని చెప్పారు. ఒకవైపు కాంగ్రెస్‌, మరోవైపు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, మోదీ ఉన్నారన్నారు. ప్రధాని ఎక్కడికి వెళ్లినా అభివృద్ధి గురించి మాట్లాడతారు గానీ, బీజేపీ ఏ రాష్ట్రంలో గెలిచినా అక్కడ మాత్రం హింస చెలరేగుతుందని రాహుల్‌ అన్నారు. నల్లధనం విూద పోరాడుతానని మోదీ ఒకవైపు చెబుతూనే ఉన్నా, మరోవైపు మాల్యా లాంటివాళ్లు మాత్రం దేశం వదిలి పారిపోతారని ఎద్దేవా చేశారు. మాల్యా వెళ్లిపోవడానికి రెండు మూడు రోజుల ముందు కూడా పార్లమెంటులో అరుణ్‌ జైట్లీతో మాట్లాడారని, వాళ్లిద్దరి మధ్య ఏం మాటలు నడిచాయని ప్రశ్నించారు. ప్రధాని నిజంగా అవినీతిపై పోరాడుతుంటే, ఆయన ఎందుకు ‘ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’ స్కీము ప్రవేశపెట్టారని రాహుల్‌ నిలదీశారు. ప్రతి జిల్లాలో సివిల్‌ సర్వీసు పరీక్షలకు హాజరయ్యే వంద మంది విద్యార్థులకు ప్రతిభ ఆధారంగా స్కాలర్‌షిప్పులు ఇస్తామని రాహుల్‌ గాంధీ ప్రకటించారు. అసోంలో మళ్లీ అధికారంలోకి వస్తే కిలో బియ్యం రూ. 2కే అందిస్తామన్నారు. అసోం మినీ భారతదేశమని, దేశవ్యాప్తంగా ఏవేం ఉంటాయో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయని చెప్పారు. మోదీ ఇక్కడకు వస్తే మాత్రం నల్లధనం గురించి గానీ, మాల్యా గురించి గానీ, లలిత్‌ మోదీ గురించి గానీ ఒక్క మాట కూడా మాట్లాడరని ఎద్దేవా చేశారు.