భాజపా మద్ధతుతోనే మాల్యాకు రాజ్యసభ సీటు

3

న్యూఢిల్లీ,మార్చి14(జనంసాక్షి): బ్యాంకులను బురిడీ కొట్టించి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాను స్వదేశానికి రప్పించాలని రాజ్యసభలో విపక్షాలు గట్టిగా డిమాండ్‌ చేశాయి. ఆర్థిక మోసాలకు పాల్పడిన ఐపీఎల్‌ మాజీ చీఫ్‌ లలిత్‌ మోదీని స్వదేశానికి తీసుకురావాలని సభలో ఆందోళన చేపట్టాయి. కాంగ్రెస్‌ ఎంపీ ప్రమోద్‌ తివారి జీరో అవర్‌ లో ఈ అంశాన్ని లేవనెత్తారు. బీజేపీ మద్దతుతోనే మాల్యా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన విషయాన్ని గుర్తు చేశారు. ఈ అంశంపై చర్చకు పట్టుబట్టారు. తర్వాత కాంగ్రెస్‌ సభ్యులు వెల్‌ లోకి దూసుకువచ్చి నినాదాలు చేశారు. తివారి ఇచ్చిన నోటీసును రాజ్యసభ చైర్మన్‌ హమిద్‌ అన్సారీ తిరస్కరించారని డిప్యూటీ చైర్మన్‌ పీజే కురియన్‌ తెలిపారు. ఈ అంశాన్ని ఎథిక్స్‌ కమిటీకి నివేదించినట్టు చెప్పారు. అయినా కాంగ్రెస్‌ సభ్యులు శాంతించలేదు. విజయ్‌ మాల్యా, లలిత్‌ మోదీలను స్వదేశానికి రప్పించాల్సిందేనని నినాదాలతో సభను ¬రెత్తించారు. దీంతో ప్రశ్నోత్తరాలకు ముందే సభను కొద్ది నిమిషాల పాటు వాయిదా వేశారు.