భారతీయ విద్యార్థులను వెనక్కుపంపం

1

– ట్రంప్‌

వాషింగ్టన్‌,,మార్చి15(జనంసాక్షి):భారతీయ విద్యార్థులపై డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసలు కురిపించారు. భారతీయుల వంటి చురుకైనవారి అవసరం అమెరికాకు ఉందన్నారు. అమెరికా విద్యా సంస్థల్లో చదివే భారతీయ విద్యార్థులను దేశం నుంచి పంపించనక్కర్లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ‘ఫాక్స్‌ న్యూస్‌’ ఇంటర్వ్యూలో ఆయన హెచ్‌1బీ వీసాలపై తన అభిప్రాయాలపై స్పష్టత ఇచ్చారు. చట్టబద్ధమైన వలసలపై అభిప్రాయాన్ని చెప్పాలని కోరినపుడు ట్రంప్‌ మాట్లాడుతూ మనకు ఇష్టం ఉన్నా, లేకపోయినా, వాళ్ళు డబ్బులిస్తున్నారు, చాలా మందికి, చాలా తెలివైనవారికి మనం విద్య నేర్పుతున్నామన్నారు. ఆ విధంగా చదువుకున్నవారు మన దేశంలో ఉండవలసిన అవసరం ఉందన్నారు.భారతదేశం నుంచి వచ్చే విద్యార్థులు హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో చదువుకొని, మళ్ళీ భారతదేశానికి వెళ్తున్నారని, తమ సొంత దేశంలో పెద్ద పెద్ద కంపెనీలు స్థాపించి, సంపన్నులవుతున్నారని, అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నారని అన్నారు. అటువంటివారిలో చాలా మంది అమెరికాలో ఉండాలని, అటువంటి పనులు ఇక్కడే చేయాలని అనుకుంటున్నారన్నారు. మన దేశంలో అనేక సంవత్సరాలు చదువుకొన్నవారిని, వారు గ్రాడ్యుయేట్లు కాగానే మనం వారిని పంపించేయకూడదన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో రిపబ్లికన్‌ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ ముందు వరుసలో ఉన్న సంగతి తెలిసిందే.