ఆ ఇద్దరు ఇటాలియన్లు తిరిగొచ్చారు పాస్‌పోర్టు స్వాధీన పర్చారు

కోచి :

కేరళలో హత్యానేరం కేసును ఎదుర్కొంటున్న ఇద్దరు ఇటాలిఇయన్‌ నావికులు క్రిస్మస్‌కు స్వదేశానికి వెళ్లి శుక్రవారం భారత్‌కు తిరిగి వచ్చారని అధికారులు తెలిపారు. కేరళ హైకోర్టు వారికి రెండు వారాల విరామం ఇచ్చింది. శుక్రవారం ఉదయం వారు కోచి విమనాశ్రయంలో ప్రత్యేక విమానం నుంచి దిగినట్లు ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు తెలిపాయి. వారు కొల్లమ్‌ చేరుకుని తమ పాస్‌పోర్టులను కోర్టుకు స్వాధీనం చేస్తారు. గత ఏడాది ఫిబ్రవరి 19న వీరిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు భారత్‌ జాలరులు రాజేష్‌ బింకి (25), జెలిస్టైన్‌ (45)లను వారు కాల్చి చంపారు. కేరళ అలప్పుజా తీరంలో ఇటాలియన్‌ వాణిజ్య నౌక ఎన్‌రికా లెక్సీలో వీరిద్దరు సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్నారు. వారిని సోమాలీ సముద్రపు బందిపోట్లుగా భ్రమించి వీరు కాల్పులు జరపడంతో ఇద్దరు మత్స్యకారులు అక్కడికక్కడే మరణించారు. వీరు జనవరి 10 కల్లా తిరిగిరావాలని హైకోర్టు ఆదేశించింది. జనవరి 15న కొల్లం సెషన్స్‌ కోర్టులో వీరి విచారణ కొనసాగుతుంది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించినప్పటికీ హైకోర్టు తోసిపుచ్చి వారు స్వదేశం వెళ్లేందుకు అనుమతించింది. కోర్టు ఆదేశాలను గౌరవించి వారు భారత్‌ కు తిరిగి వచ్చారు.