భారత్‌ -బంగ్లా నెట్‌ బంధం

5

న్యూదిల్లీ,మార్చి23(జనంసాక్షి):  భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య బంధం మరింత బలపడింది. రెండు దేశాల మధ్య విద్యుత్తు, ఇంటర్నెట్‌ సరఫరా వ్యవస్థ మరింత పటిష్టమైంది. విద్యుత్తు సరఫరా లైన్‌ను ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆ విద్యుత్తు లైన్‌ వల్ల త్రిపురా రాష్ట్రం సుమారు 100 మెగావాట్ల విద్యుత్తును బంగ్లాదేశ్‌కు సరఫరా చేయనుంది. మరోవైపు బంగ్లాదేశ ప్రధాని షేక్‌ హసినా 100జీబీపీఎస్‌ ఇంటర్నెట్‌ బ్యాండ్‌విడ్త్‌ను ప్రారంభించారు. దీని ద్వారా అగర్తలా రాష్టాన్రికి ఇంటర్నెట్‌ సౌకర్యం లభించనుంది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇరు దేశాల ప్రధానులు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి మహమూద్‌ అలీ, భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌, త్రిపురా సీఎం మానిక్‌ సర్కార్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పాక్‌కు ప్రధాని, రాష్ట్రపతి శుభాకాంక్షలు

పాకిస్థాన్‌ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ దేశ ప్రజలకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్‌ వేదికగా పాక్‌ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కూడా పాక్‌ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ప్రణబ్‌ఆకాంక్షించారు. ఇరు దేశాల మధ్య స్నేహభావం, శాంతి భద్రతలు పెంపొందించేందుకు భారత్‌ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు భారత్‌లోని పాక్‌ హైకమిషనర్‌ కార్యాలయంలో వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు హాజరుకానున్నట్లు భారత విదేశాంగ అధికార ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ తెలిపారు.