భారత్‌ వైవిధ్యం నిండిన దేశం

4

– మన్‌కీబాత్‌తో ప్రధాని మోదీ

న్యూదిల్లీ,మార్చి27(జనంసాక్షి): భారత్‌ వైవిధ్యంతో నిండిన దేశమని.. దీన్ని అన్వేషించడానికి జీవితకాలం సరిపోదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఆల్‌ ఇండియా రేడియో ద్వారా ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో దేశ ప్రజలనుద్దేశించి ఈరోజు ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరులకు ఈస్టర్‌ శుభాకాంక్షలు తెలిపారు. మోదీ మాట్లాడుతూ.. టీ20 ప్రపంచకప్‌లో ప్రతిభ కనబరుస్తున్న భారత జట్టును అభినందించారు. పాక్‌, బంగ్లాపై భారత్‌ గెలవడం సంతోషంగా ఉందని… నేడు జరగబోయే మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై విజయం సాధించి సెవిూస్‌కు చేరాలని ఆకాంక్షించారు. ఫుట్‌బాల్‌ క్రీడలో భారత్‌ వెనుకబడి ఉందని… దేశం నలుమూలలా ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. 2017లో అండర్‌-17 ఫిఫా పోటీలకు భారత్‌ ఆతిథ్యమిస్తున్న విషయాన్ని మోదీ ప్రస్తావించారు. ఈ పోటీలకు యువత బ్రాండ్‌ అంబాసిడర్లు కావాలని సూచించారు. దేశం నలుమూలలా ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరిగేలా చూడాలన్నారు.వేసవి సెలవులు వస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు మోదీ పలు సూచనలిచ్చారు. సెలవుల్లో ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలని సూచించారు. ప్రయాణాలవల్ల కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం వస్తుందని… అందుకే ఈ సెలవుల్లో ప్రయాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దీని ద్వారా పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. డిజిటల్‌ ఇండియా నగరాల్లోని యువత కోసం మాత్రమే కాదని… రైతుల కోసం కూడా అని పేర్కొన్నారు. రైతుల కోసం కిసాన్‌ సువిధా యాప్‌ విడుదల చేశామని… దీని ద్వారా రైతులకు వ్యవసాయ, వాతావరణ సమాచారం అందుతుందన్నారు.