భాషా ప్రయుక్త రాష్ట్రాలపై అంబేద్కర్‌


తెలంగాణ సమస్యపై కేంద్రం ఏం చేయబోతున్నది? ప్రత్యేక వాదుల ఆందోళనలు ఏ మలుపులు తిరగనున్నాయి?అన్న ప్రశ్నలు ముందుకొస్తాయి. అంబేద్కర్‌ ఇవాళ ఉండి ఉంటే, తప్పకుండా తెలంగాణ ఏర్పాటుని సమర్ధించి ఉండేవారు. అన్నట్లుగా పదేపదే బల్లలు గుద్దుతున్నారు. ఈ పూర్వరంగంలో అసలు ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాల విశ్లేషణ సముచితంగా ఉంటుంది. అయితే స్థలాభావం వల్ల కొద్ది అంశాలకే పరిమితమవడం అనివార్యం.23 ఏప్రిల్‌ 1953లో నాటి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో భాషా ప్రయుక్త రాష్ట్రాల సమస్యపై అంబేద్కర్‌ వ్యాసం ఒకటి ప్రచురితమైంది. పార్లమెంట్‌లో 1951 ఫిబ్రవరిలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ‘హిందూ కోడ్‌’ బిల్లుని ప్రవేశపెట్టారు. ముందిచ్చిన మాటతప్పి ప్రధాని నెహ్రూ కాంగ్రెస్‌ నాయకత్వం ఆ బిల్లును బలపరచడం మానుకొన్నాయి. విరక్తి చెందిన అంబేద్కర్‌ 1951 సెప్టెంబర్‌లో మంత్రివర్గం నుంచి రాజీనామా చేశారు. ఆ తరువాత కాలంలో రాసిన వ్యాసం ఇది. పొట్టి శ్రీరాములు మరణం తరువాత ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు సమస్యను చర్చించిన ఆ వ్యాసం విశ్లేషణ ఇది. భాషా ప్రయుక్త రాష్ట్రాల సూత్రాన్ని కాంగ్రెస్‌ వాదులంతా అంగీకరించిన వారే. అయినా పొట్టి శ్రీరాములు చావాల్సి రావడం విషాదకరం. ఇప్పుడు ఆలోచిస్తున్న ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు ప్రధానిచే ‘పిండ ప్రదానం’ వంటిది. మరే దేశంలోనైనా ఇలాంటివి సహించేవారా? అని ఇప్పుడు ఆలోచించడం వల్ల ఉపయోగం లేదు అంటారు. అంబేద్కర్‌. ఈ వ్యాసంలో బాషా రాష్ట్రాలు అవసరమే అని చెప్తూ, అయితే దానికి కొన్ని ‘చెక్స్‌ అండ్‌ బ్యాలెన్సెస్‌’ ఉండాలంటూ ఈ వ్యాసం ముగించారు. సమస్య చారిత్రక నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ, ఈ సమస్య ఎప్పుడూ ఉన్నదేకాని బహుభాషా ప్రాంతాల్లో ఆయా ప్రజల సాస్కృతిక ఆకాంక్షలని బ్రిటిష్‌వారు అంతగా పట్టించుకోలేదు. అయితే బ్రిటిష్‌ హాయంలోనే బెంగాల్‌, బీహార్‌, బడిశాలను భాషా రాష్ట్రాలుగా పునర్విభజించారు. ఇలా మొదలుపెట్టిన ప్రక్రియని చివరి దాకా తీసుకెళ్లేవారా అంటే జవాబు చెప్పడం కష్టమే అన్నారు అంబేద్కర్‌, ఇక కాంగ్రెస్‌ వైఖరి? 1920లోనే గాంధీ నాయకత్వంలో ఈ సూత్రాన్ని తమ నిబంధనావళిలో ఆమోదించారని గుర్తు చేశారు. అయితే ఒక సిద్దాంతంగా ఆ పని చేసారా? ప్రజలని ఆకట్టుకోవడానికా అన్నది అప్రమత్తం అంటూ ముందుకు సాగారు. 1945లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కాగానే, భాషా రాష్ట్రాల ఏర్పాటు సమస్య మళ్లీ ముందుకొచ్చింది. ఒక పార్లమెంట్‌ సభ్యుడి తీర్మానం రూపంలో అని గుర్తుచేశారు. పార్లమెంట్‌లో ఫ్రభుత్వం పక్షాన ఈ చర్చకు జవాబు చెప్పాల్సిరావడంతో ఉన్నతాధికారులను సంప్రదించాను. వింతగా కనిపించవచ్చు, కాని భాషా రాష్ట్రాల ఏర్పాటుకి పూర్తిగా వ్యతిరేకంగా ఉండింది. దానితో ప్రధని (నెహ్రూ)యే జవాబు చేప్పడం మంచిదని భావించారు. మొత్తం బాషా రాష్ట్రాల సమస్యకు పరిష్కారం కాకుండా, వెంటనే ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుకి వాగ్దాన ప్రకటన చేశారు. ప్రధాని దానితో ఆ తీర్మానాన్ని వెనక్కి తీసుకున్నారు అని రాశారు అంబేద్కర్‌.ఆ తర్వాత రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడిగా రెండోసారి ఈ సమస్యని ఎదుర్కోవాల్సి వచ్చిందని రాశారు. రాజ్యాంగ ముసాయిదా రచన ‘ముగిసిన దశలో’ పై వాగ్ధానం పూర్వ రంగంలో, ఆంధ్ర రాష్ట్రాన్ని పార్టీ ‘ఎ’ రాష్ట్రాల జాబితాలో చేర్చమంటారా? అని ప్రధానికి లేఖ రాశాను ఏమైందో ఏమో గుర్తులేదు కానీ, భాషా రాష్ట్రాల సమస్యపై ధార్‌ కమిటిని రాజ్యాంగసభ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ నియమించారని అం్టఆరు అంబేద్కర్‌. ఆ కమిటీ రిపోర్టుని పరిశీలించిన జైపూర్‌ ఎఐసిసి సభ దానిపై ‘జెవిపి’ కమిటీని నియమించింది. జవహార్‌లాల్‌ నెహ్రూ, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌, పట్టాభి సీతారామయ్య దాని సభ్యులు. ఆ కమిటీ తీర్పు సారాంశం వెంటనే ఆంధ్రరాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి; అయితే మద్రాసుని తమిళులకు వదిలి వేయాలి. దీఆనికి సంబంధించిన వివరాల పరిశీలనకై నియమించబడిన మరో కమిటీ ఏకగ్రీవంగా ఒక రిపోర్టు నిచ్చింది. అయితే మద్రాసు విషయంలో టంగుటూరి ఇంకా బలీయమైన శక్తులు పట్టుబట్టడంతో, ఆ సమస్య అక్కడ ఆగిపోయింది. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు మరణం, ‘పిండ ప్రదానం’గా నెహ్రూ ప్రకటనతో అప్పటి చరిత్ర ప్రస్తావన ముగుస్తుంది. 1920 నుంచీ కాంగ్రెస్‌ ద్వంద్వ విధానాలు, అధికారంలోకి వచ్చాక మాట మార్చడం, కమిటీలతో దోబూచులాడడం, పీకలదాక వచ్చాక గాని చర్చయ తీసుకోకపోవడం ఇవన్నీ కన్పిస్తాయి. అంబేద్కర్‌ వ్యాసంలో (1953), దాదాపు 60 ఏళ్లు దొర్లినా ఇప్పటికీ ఇదే చాణక్చ నీతి? పై చరిత్ర ప్రస్తావన తర్వాత భాషా రాష్ట్రాల ఏర్పాటు సందర్భంగా మూడు షరతులను పూరించాక తన అభిప్రాయాన్ని ప్రకటిస్తారు. అంబేద్కర్‌; 1) ఆ రాష్ట్రం ఆర్థికంగా మనగలుగుతుందా? అన్నది చూడాలి. 2)భాషా రాష్ట్రాల ఏర్పాటు వలన వివిధ సామాజిక వర్గాల ఆర్ధిక, రాజకీయ భవితవ్యం ఏమిటీ? కొత్త రాష్ట్రంలో ఎవరు పెత్తనం చేస్తారు. ఎవరు నలుగుతారు? అణగారిన వర్గాల, ఆర్థిక రాజకీయ భవితవ్యం ఏమిటీ? ఆలోచించాలి. 3) ఒకే భాష మాట్లాడేవారు ఒకే రాష్ట్రంగా సంఘటితం కావాలా? ఈ ప్రశ్న కొత్తగా ఏర్పడే (ఆంధ్ర, మహారాష్ట్ర)రాష్ట్రాలకే కాక, ఇప్పటికే ఏర్పడి ఉన్న పెద్దపెద్ద రాష్ట్రాలకూ (ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌, బెంగాల్‌) వర్తిస్తుంది. విశాల హిందీ ప్రాంతమంతా ఉత్తరప్రదేశ్‌ అన్న ఒకే రాష్ట్రంలో ఎందుకుండాలి? ఈ ప్రశ్నలను లేవనెత్తారంటే భాషా రాష్ట్రాలు వద్దని కాదు, ఆ పేరిట కొందరు అధికార దుర్వినియోగం చేయరాదని, దానికి కావాల్సిన కన్ని నియమాలు చెక్స్‌ అండ్‌ బ్యాలెన్స్‌స్‌ ఉండాలని చెప్తూ ముగిస్తారు. భాషా రాష్ట్రాల ఏర్పాటు సమ్మతిని, అందునా ఆంద్రరాష్ట్రం ఏర్పాటుకి మద్దాతుని అంబేద్కర్‌ వ్యాసంలో చూడవచ్చును. ఈ విసయంలో కాంగ్రెస్‌ పార్టీ ద్వంద్వ విదానాల పట్ల పొట్టి శ్రీరామలు పిండ ప్రదానం వరకు వేచి చూసిన నెహ్రూ ప్రభుత్వం తాత్సారం పట్ల అంబేద్కర్‌ విమర్శలున పైన గమనించాం. పైన లేవనెత్తిన మూడవ షరతు దరిమిలా అంబేద్కర్‌ విశాలాంధ్రని వ్యతిరేకించారని, చెప్పవచ్చునా? ఒక భాష వారికి ఒకే రాష్ట్రం ఉండాలా? అన్న ప్రశ్న రూపంలో చిన్న రాష్ట్రాల సమస్యను లేవనెత్తారా? అలాంటి అర్థంలో కొందరు అంబేద్కర్‌ వాదులు, చాలా మంది ప్రత్యేక రాష్ట్రవాదులు బల్లగుద్దుతున్నారు. అంబేద్కర్‌ జయంతిని చిన్న రాష్ట్రాల దినోత్సవంగా జరపాలని దూకుడుగా ప్రకటనలు గుప్పిస్తూ వస్తున్నారు. అయితే అంబేద్కర్‌ అసులు ఏమని భావించారు? ఇదే వ్యాసంలో ఈ ప్రశ్నలకు సమాధానం చూడవచ్చును. ఆంధ్ర రాష్ట్రం రాజధాని సమస్యని కూడా ఆయన ఈ వ్యాసంలో చర్చించారు.కొత్తగా ఏర్పడబోయే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు. రాజధాని ఏర్పాటు లేకుండా ఒక రాష్ట్రం ఏర్పాటు గురించిఇంతకు ముందెన్నడూ నేనూ వినలేదు. అంటూ ఈ సమస్యని ప్రస్తావిస్తారు. అంబేద్కర్‌, అతిధికి ఒక్క రాత్రయినా అతిథ్యం ఇవ్వాలన్నది హిందూ ధర్మం! కాని, తమిళ తెగ పెద్ద మనుషుల్లో కెల్లా గట్టివాడైన రాజాజీ కొత్త ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మాద్రస్‌ నగరంలో ఒక్క రాత్రయినా ఉండనివ్వరట’ అని వ్యగ్యంగా ప్రస్తావించారు అంబేద్కర్‌. రాజాజి ఒక దేశ నాయకుడిగా రాజీనీతిజ్ఞుడిగా కాక, తమిళవాదిగా ప్రవర్తించాడన్న భావం ఆ వ్యంగ్యంలో ధ్వనిస్తుంది.స్థిర రాజధాని లేని ఆంధ్ర రాష్ట్రం ఒయాస్సిస్సులేని ఎడారి లాగా ఉండాల్సి వస్తుందని అంబేద్కర్‌ అంటారు.తాత్కాలిక రాజధాని కోసం అనవసర ఖర్చులు పెట్టాల్సివస్తుందంటూ శాశ్వత రాజధానిగా తయారయ్యే అవకాశం గల ప్రదేశాన్ని ఇప్పుడు ఎందుకు ఇవ్వకూడదు అన్న ప్రశ్నను లేవనెత్తారు అంబేద్కర్‌ .
– ఎం కృష్ణ ఆదిత్య
వీక్షణం సౌజన్యంతో
తరువాయి భాగం రేపటి సంచికలో…