భూసేకరణ చట్టానికి వ్యతిరేక పోరు

1

జంతర్‌ మంతర్‌ నుంచి పార్లమెంటు వరకు

22న దిల్లీలో ర్యాలీ.. కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ,ఏప్రిల్‌3(జనంసాక్షి): భూసేకరణ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఆమ్‌ఆద్మీపార్టీ ఆందోళనకు సిద్దమైంది. ఈనెల 22న దిల్లీ సీఎం కేజీవ్రాల్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. జంతర్‌ మంతర్‌ నుంచి పార్లమెంట్‌ వరకు కేజీవ్రాల్‌ నేతృత్వంలో ప్రదర్శన చేపట్టనున్నట్లు ఆప్‌ వర్గాలు తెలిపాయి. గతంలో అన్నా హజారే జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన చేపట్టగా ఆయన పాల్గొన్నారు. అన్నా ఆందోళనకు మద్దతు పలికారు. అధికారంలో ఉన్నా ఆందోళనలకు దిగడం కేజ్రీవాల్‌కు అలవాటే. క్రితంసారి ముఖ్యమంత్రి హోదాలో ఉండగానే దిల్లీ పోలీసు వ్యవస్థలో సమూల మార్పులకు డిమాండ్‌ చేస్తూ కేజ్రీవాల్‌ పెద్దయెత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రింబవల్లు ఫుట్‌పాత్‌లపై సామాన్య జనంతో కలిసి ఆందోళనలు చేపట్టారు. చలిని, వర్షాన్ని లెక్కచేయకుఞడా ధర్నాల్లో పాల్గొన్నారు. ఇప్పటికే సామాజిక కార్యకర్త అన్నాహజారే దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కు ఆందోళనబాట వీడొద్దని సూచించారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో ప్రజల్ని ఆకర్షించేందుకు కేజ్రీవాల్‌ భూసేకరణపై ఆందోళనకు సిద్ధమయ్యారు.